నేటి నుంచి ప్రపంచ వ్యవసాయ సదస్సు
రైతుల నిర్లిప్తత.. రైతు సంఘాల వ్యతిరేకత..
{పధాని, కేంద్ర వ్యవసాయ మంత్రీ రావడం లేదు
విదేశీ ప్రతినిధుల నమోదు 10 శాతమే.. రుసుము తగ్గించినా ఫలితం శూన్యం
ఆలస్యంగా ఆహ్వానాలు.. రాలేనన్న చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్ ఉపాధ్యక్షుడు
ఐసీఏఆర్ డెరైక్టర్ డా. అయ్యప్పన్, డా.స్వామినాథన్‌ల పరిస్థితీ ఇదే
సదస్సు ప్రాంగణంలో సందడి కోసమే జిల్లాల నుంచి రైతుల తరలింపు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ప్రపంచ వ్యవసాయ సదస్సు(డబ్ల్యూఏఎఫ్) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా హడావుడి చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం నిర్లిప్తంగానే ఉండిపోయారు. ఈ సదస్సును బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే నిర్వహిస్తున్నారు తప్ప మన దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు అన్ని రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ఆతిథ్యమిచ్చే అవకాశం మనకు దక్కడం ఎంతో ప్రతిష్టాత్మకమని.. ఇందులో చర్చలు, తీర్మానాలు ఇక్కడి సన్న, చిన్నకారు రైతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని నమ్మబలుకుతోంది. ఈ వాద వివాదాల మధ్య సోమవారం నుంచి నాలుగు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సుకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతోంది.
తేలిపోయిన తొమ్మిది నెలల కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సుకు 9 నెలల క్రితం నుంచే సన్నాహాలు చేయనారంభించినా ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నిర్వాహకులు మొదట చెప్పినట్లు ప్రధాని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిల్‌గేట్స్ రావడం లేదు. చివరికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణే కార్యక్రమాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 350 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులే 350 మంది హాజరవుతారని తొలుత ప్రకటించారు. చివరకు వీరి సంఖ్య 33కు పరిమితమైంది. సభ్యత్వ నమోదు రుసుమును రూ.10,600 నుంచి రూ.5,000కు తగ్గించినప్పటికీ ప్రతినిధుల సంఖ్య పెరగలేదు.
ప్రభుత్వం రుసుము చెల్లించి 25 మంది రైతు సంఘాల ప్రతినిధులు, 50 మంది ఆదర్శ రైతులను సదస్సుకు పంపుతోంది. వీరితో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగులు, విత్తనాలు, పురుగుమందుల కంపెనీల ప్రతినిధులు సదస్సులో ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. ఆలస్యంగా ఆహ్వానించినందున చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్ ఉపాధ్యక్షుడు సదస్సుకు రావడం లేదు. ఇదే కారణంతో చివరికి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్) డెరైక్టర్ డా. అయ్యప్పన్, డా. ఎం.ఎస్. స్వామినాథన్ కూడా రావడం లేదని సమాచారం. ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో సదస్సు వద్ద ఏర్పాటయ్యే అగ్రి ట్రేడ్ ఫెయిర్‌కు రోజుకు 1,000-1,500 మంది రైతులను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రైతుల బాగుకా..? కంపెనీల లాభాలకా..?
ప్రపంచ వ్యవసాయ సదస్సును పలు స్వచ్ఛంద, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బహుళ జాతి సంస్థల వ్యాపారాభివృద్ధికే సదస్సు నిర్వహిస్తున్నారని తూర్పారబడుతున్నాయి. సదస్సును అడ్డుకుంటామని సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితర పార్టీల అనుబంధ రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఐసీఏఆర్ సభ్యునిగా రైతులకు క్షమాపణ చెపుతున్నా
సదస్సు నిజంగా సన్న, చిన్నకారు రైతుల కోసమే అయితే, రాష్ట్రంలోనే ఉన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.వీ. రావు లాంటి వారితోనో, ఐసీఏఆర్ డీజీ అయ్యప్పన్ లాంటి వారితోనో ప్రారంభోపన్యాసం చేయించి ఉండాల్సింది. అందుకు బదులుగా బేయర్ కంపెనీ అధిపతులతో ప్రారంభోపన్యాసం చేయించడంలోనే వారి ఉద్దేశాలు తేటతెల్లమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలిలో 4 రాష్ట్రాల రైతులకు ఏకైక ప్రతినిధిని నేను. కానీ, నాకు ఆహ్వానం రాలేదు. ఐసీఏఆర్ సభ్యునిగా రాష్ట్ర రైతులకు క్షమాపణ చెపుతున్నా.
- ఎంవీఎస్ నాగిరెడ్డి, కన్వీనర్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మేం బహిష్కరిస్తున్నాం: సన్న, చిన్నకారు రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమే ఈ సదస్సు. చిన్న కమతాల సేద్యాన్ని కార్పొరేట్ సేద్యం కిందకు తెచ్చే ప్రయత్నాల్లో భాగమే ఈ సదస్సు. దీన్ని బహిష్కరిస్తున్నాం. సదస్సుకు వ్యతిరేకంగా సోమవారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద వామపక్ష భావాలు కలిగిన పది రైతు సంఘాలు, రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం.
- కె.రామకృష్ణ, సీపీఐ అనుబంధ రైతు సంఘం