అన్నదాత:మారని తలరాత
రాష్ట్రంలో ఆగని రైతు ఆత్మహత్యలు
వర్షాభావం, పంట నష్టం, అప్పుల బాధలే కారణం
ఎనిమిది నెలల్లో 700 మంది బలవన్మరణం
96 మందే ఆత్మహత్యకు పాల్పడ్డారంటున్న సర్కారు
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వర్షాభావం, కరువు, పంట నష్టాలు, రుణభారం, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటివాటితో విసిగి వేసారిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా.. 700 మందికిపైగా బలవన్మరణాలకు పాల్పడినట్లుగా రైతు సంఘాలు ఆధారాలతో సహా చూపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను తక్కువగా చూపుతున్న ప్రభుత్వం.. వాటి నివారణకు చర్యలేమీ తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ పోలీసు అధికారులు మాత్రం గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 660 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 87 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించడం గమనార్హం.
ప్రైవేటు అప్పులు రూ.18 వేల కోట్లు!
గత ఖరీఫ్‌లో రైతులకు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో విత్తనాలు సరఫరా చేయలేదు. దీంతో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనాల్సి వచ్చింది. దానికితోడు వర్షాలు సరిగా కురవకపోవడంతో.. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చి, ఖర్చులు రెండింతలయ్యాయి. మూడుసార్లు విత్తనాలు వేసిన రైతులూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం రుణమాఫీపై సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఖరీఫ్ పూర్తయ్యే వరకు (సెప్టెంబర్ 30 నాటికి) బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం రైతులు రూ.18 వేల కోట్ల మేరకు ప్రైవేటు అప్పులు చేసినట్లు అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాభావం కూడా ఏర్పడి పంటల్లో 40 శాతం ఎండిపోయాయి. దీంతో వరి దిగుబడి బాగా తగ్గిపోయింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనైతే వందలాది ఎకరాల్లో వరిని తగులబెట్టారు. బావుల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోయాయి. పత్తి ఎకరాకు 2 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెరిగిన అప్పులు, వడ్డీలు, ఎండిన పంటలు.. రైతులను బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయి.
తక్కువగా చూపుతున్న సర్కారు..
ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపుతోందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అన్నదాతల ఆత్మహత్యలను నిర్ధాంచేందుకు జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ సభ్యులుగా కమిటీలు వేశారు. వారు నిర్ధారించిన ప్రకారం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ లెక్కలపై రైతు సంఘాలు, బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 674 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అసలు ఆత్మహత్యలే జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ నల్లగొండలో 93 మంది, నిజామాబాద్‌లో 48 మంది, ఖమ్మంలో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాలు లెక్కతేల్చాయి. మరోవైపు చాలా ఆత్మహత్యలు ‘ఇతర కారణాల’తో జరిగినవిగా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంటోంది. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరమనే ఉద్దేశంతోనే సర్కారు పెద్దలు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.ట
దుర్భర పరిస్థితులు..
2014-15లో వ్యవసాయరంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్, రబీల్లో పూర్తిస్థాయి వర్షాలు కురవలేదు. గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన గత సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 498.1 మిల్లీమీటర్లు (30% లోటు) నమోదైంది. అలాగే గత అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు రబీలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 50.8 మిల్లీమీటర్లు (61% లోటు) మాత్రమే నమోదైంది. మొత్తంగా గత వ్యవసాయ సీజన్‌లో 906.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 649.6 మిల్లీమీటర్లకే (25% లోటు) పరిమితమైంది. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్ల నుంచి 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. రబీలో ఆహార ధాన్యాల సాగు 10.41 లక్షల హెక్టార్ల నుంచి 8.13 లక్షల హెకార్టకే (78%) పరిమితమైంది.
మిగిలింది ఆవేదనే..
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గిపోవడానికి తోడు, వచ్చిన ఆ కాస్త దిగుబడికీ సరైన మద్దతు ధర లభించక అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయారు. అలాంటి చాలామంది రైతులు నష్టాన్ని తట్టుకోలేక, పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో గుండె ఆగిపోయి మరణించారు.