కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట్‌లో నీట మునిగిన పత్తిచేను
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లో మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది.
వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశా రు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముంది. నష్టపోయిన పంట రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment