Rains damage
-
వయనాడ్ ఘటనపై లోక్ సభలో రాహుల్ గాంధీ
-
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‌కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‌కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్‌కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!
లక్నో: భారీ వర్షాలు, వరదలు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయి మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటావాతో పాటు ఫిరోజాబాద్, బలరాంపుర్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటావా చంద్రపురా ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. క్రిపాల్‌పుర్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందావా కే బంగ్లా గ్రామంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
గాలివానకు దెబ్బతిన్న మామిడి
గుర్రంకొండ: మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలకు పలు గ్రామాల్లో మామిడి పంట దెబ్బతినింది. గుర్రంకొండ–వాల్మీకిపురం మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు కూలిపోయి రోడ్డుపై పడ్డాయి. మామిడితోటల్లో కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు భారీగా నష్టపోయారు. -
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్‌పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్‌లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
అన్నదాత కష్టాలు..తడిసి మోపెడు
ఈ ఫొటోలోని రైతు పేరు మట్టు యాదయ్య. ఈయనది నల్లగొండ జిల్లా జి.చెన్నారం గ్రామం. ఈ యాసంగిలో పండిన 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ఏప్రిల్ 10న అమ్మకానికి తీసుకువచ్చాడు. ధాన్యంపై కప్పేందుకు 20 పట్టాలు అద్దెకు తీసుకున్నాడు. ఒక్కో పట్టాకు రోజుకు రూ.20 అద్దె. ఇలా రోజుకు రూ.400 అద్దె కడుతున్నాడు. ఇప్పటికి 37 రోజుల వుతోంది. తేమ శాతం చూసి పెట్టారు. కానీ కొనడం లేదు. ఈయన కంటే ముందు 50 మంది రైతులు ఉన్నారు. వారం దరివీ కొన్న తరువాతనే కొంటామని చెప్పడంతో కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నాడు. పట్టాల అద్దె ఇప్పటివరకు రూ.14 వేలకు పైగా చెల్లించాడు. ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే ఇన్ని కష్టాలా? ఏం చేయాలో పాలు పోవడం లేదు..’అంటూ యాదయ్య వాపోతున్నాడు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎన్న డూ లేనంతగా జరిగిన యాసంగి పంటల సాగు సంబురం రైతుల కళ్లల్లో ఏమాత్రం కన్పించడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేయడం ఒక ఎల్తైతే, పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు అష్ట కష్టాలూ పడుతున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, సేకరించిన తర్వాత రవాణాకు వాహనాలు లభించక ధాన్యాన్ని తరలించలేని పరిస్థితులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విధించిన కఠిన నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, ఇవి చాలదన్నట్టుగా ముంచుకొచ్చిన తుపాను.. వెరసి రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. మరో పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి వానాకాలం మొదలుకానున్నా.. ఇంతవరకు యాభై శాతం ధాన్యం సేకరణ కూడా పూర్తి కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. లక్ష్యం చేరని సేకరణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందన్న ప్రకటనలో జరిగిన జాప్యం మొదలు.. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, అన్నీ కలిసి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చురుగ్గా ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కనీసంగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో 94.81 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రణాళిక వేశారు. ఇందుకోసం 7,204 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, 6,700 కేంద్రాలను తెరిచారు. వీటి ద్వారా సుమారు 2 లక్షలకు పైగా రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. మరో 54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 40 రోజులుగా సాగుతున్న సేకరణలో రోజుకు లక్ష టన్నుల మేర సేకరణ జరుగుతోంది. ఈ లెక్కన మిగతా సేకరణకు మరో నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతుండగా, జూన్‌లో మళ్లీ వర్షాలు మొదలైతే ధాన్యాన్ని అమ్ముకోవడం మరింత కష్టతరం కానుంది. పూర్తిస్థాయిలో వర్షాలు మొదలైతే పెట్టుబడి కూడా దక్కక తాము అప్పులపాలు కావాల్సిందేనని రైతులు అంటున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి జగిత్యాల జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు గాను ఇంతవరకు 2.50 లక్షల టన్నులు, నిజామాబాద్‌లో 8 లక్షల టన్నులకు గాను 5 లక్షల టన్నులు, ఖమ్మంలో 4.5 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు, యాదాద్రిలో 4.7 లక్షల టన్నులకు గాను 1.9 లక్షల టన్నులు, సిద్దిపేటలో 5.46 లక్షల టన్నులకు గాను 1.6 లక్షల టన్నుల ధాన్యం సేకరణే జరిగింది. ఈ జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. తరుగు పేరిట గొరిగేస్తున్నారు.. మరోవైపు ఎఫ్‌సీఐ నిబంధనలంటూ పౌర సరఫరాల శాఖ నాణ్యత విషయంలో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తేమ 17 శాతం మించకుండా చూసుకోవడంతో పాటు తాలు.. చెత్త ఒక శాతం, మట్టి పెడ్డలు, రాళ్లు ఒక శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా పరిపక్వత చెందని ధాన్యం 3 శాతానికి మించి ఉండకూడదన్న ఎఫ్‌సీఐ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. దీంతో నాణ్యత లేని ధాన్యాన్ని కేంద్రాల్లో తూకం వేయడం లేదు. ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యంలో తేమ 20 శాతానికి పైగానే ఉంటోంది. దీన్ని పగలంతా ఆరబెట్టి రాత్రికి కుప్పలు చేస్తే, మళ్లీ వర్షం పడటంతో తేమ శాతం మళ్లీ పెరుగుతోంది. చాలా చోట్ల టార్పాలిన్ల కొరత రైతుల్ని వేధిస్తోంది. రోజుకు రూ.20 చొప్పున నాలుగైదు టార్పాలిన్లు అద్దెకు తెచ్చి కుప్పలను కప్పుతున్నా తేమ శాతం తగ్గకపోవడం, ధాన్యం రంగుమారడం జరుగుతోంది. ఎలాగో ధాన్యాన్ని తూకం వేసినా క్వింటాల్‌కు కనీసంగా తరుగు పేరిట నాలుగు నుంచి 5 కిలోలు తీసేస్తున్నారు. మిల్లు వద్ద నాణ్యత పేరిట మరో రెండు కిలోలు తరుగు తీస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేధిస్తున్న వాహనాల సమస్య కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన మేర లారీలు, డీసీఎంలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకేసారి పంట కోతకు రావడం, కుప్పలుగా ధాన్యం కేంద్రాలకు రావడంతో అక్కడి నుంచి కేంద్రానికి కేటాయించిన ఐదారు లారీల ద్వారా తరలింపు ఆలస్యమవుతోంది. బిహార్, యూపీలకు చెందిన హమాలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కరోనా కారణంగా స్థానిక కూలీలెవరూ పనికి ముందుకు రాకపోవడంతో లోడింVŠ ప్రక్రియ జాప్యం అవుతోంది. ఇక మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లోనూ సమస్య ఎదురవుతోంది. దీంతో మిల్లుల వద్ద వాహనాలు బారులు కడుతున్నాయి. దీన్ని నివారించేందుకు స్థానికంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవాలని చెబుతున్నా, లాక్డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 తర్వాత పెట్రోల్ బంకులు మూసి వేస్తుండటంతో వాహనాలు సమకూర్చేందుకు యజమానులు ముందుకు రావట్లేదు. లారీలు వస్తలేవంటున్నరు మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి ఊరిలోనే కేంద్రానికి తీసుకొస్తే పది రోజులు అవుతున్నా కొంటలేరు. అడిగితే లారీలు వస్తలేవంటున్నరు. వానొస్తే ధాన్యం తడిచిపోతాది. టార్పాలిన్లు అడిగితే ఇస్తలేరు. నేనే బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చిన. తొందరగా కొనేటట్టు చూడాలె. – మల్లేశం, చాట్లపల్లి, సిద్దిపేట జిల్లా తాలు పేరుతో దోచుకుంటున్నారు.. రెండెకరాల్లో పండిన 40 క్వింటాళ్ల ధాన్యాన్ని మందపల్లి పీఏసీఎస్ కేంద్రానికి 10 రోజుల క్రితం తీసుకువచ్చాను. కుప్పలు పోసి ప్యాడీ క్లీనర్లు తూర్పారబట్టిన తర్వాత ఆరు రోజులకు గన్నీ సంచులు ఇచ్చారు. తర్వాత రెండ్రోజులకు కాంటా పెట్టిండ్రు. తూర్పారపట్టినా కూడా మిల్లు వాడు నలభై కిలోల బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తీసుకున్నాడు. మొత్తం మీద నాకు క్వింటాకు 5 కిలోల తరుగు నష్టం జరిగింది. – అజ్మీర్ రాములు, రాజ్యాతండా, దుగ్గొండి మండలం, వరంగల్ రూరల్ జిల్లా 40 రోజులుగా పడిగాపులు నా పొలంలో 320 బస్తాల వడ్ల దిగుబడి వచ్చింది. అమ్ముదా మని కూసుమంచిలోని కొనుగోలు కేంద్రానికి 40 రోజుల కిందట తీసుకొచ్చిన. ఇప్పటివరకు 170 బస్తాలు కాంటా వేశారు. 150 బస్తాలు మిగిలే ఉన్నాయి. కాంటా వేసిన ధాన్యం ఎగుమతి కాలేదు. కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా. వర్షాలు, గాలిదుమారాలు వస్తుంటే భయంగా ఉంది. ధాన్యం తడిస్తే రంగు మారిందని తరుగు తీస్తున్నారు. – వడ్త్యి నాగేశ్వరరావు, గంగ బండతండా, ఖమ్మం జిల్లా ఈ ఫొటోలోని రైతు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన నరెడ్ల అంజిరెడ్డి. 3 ఎకరాల్లో వరి సాగుచేస్తే దాదాపు 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ఆరు ట్రాక్టర్లలో తరలించాడు. కానీ అక్కడ ధాన్యం ఆరబోయడానికి వసతులు లేవు. టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో 10 టార్పాలిన్ కవర్లు అద్దెకు తీసుకువచ్చాడు. ఇంత చేసినా వర్షం కురవడంతో రంగు మారిపోయింది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అంటున్నాడు. ఈమె పేరు ఎల్లోబోయిన సమ్మక్క (జనగామ జిల్లా చీటకోడూరు గ్రామం). ఐదున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. 120 బస్తాల దిగుబడి వచ్చింది. జనగామలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌కు 11 రోజుల కింద తీసుకొచ్చారు. అకాల వర్షాలకు రెండుసార్లు ధాన్యం తడిసిపోయింది. ధాన్యం ఆరబోసేందుకు రోజుకు రూ.వెయ్యి ఖర్చయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు నిమ్మల జయపాల్‌రెడ్డి రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. అకాల వర్షానికి తడిసి ధాన్యం రంగు మారింది. మిల్లర్ల వద్దకు చేరిస్తే క్వింటాకు 7.30 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగును రైతులు అంగీకరిస్తేనే కొనుగోలు జరుగుతోందని చెప్పాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన పెంటప్ప 15 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోశాక గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు వసతులు లేకపోవడంతో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ వద్ద రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొత్తం 900 ధాన్యం బస్తాలను తరలించాడు. కానీ అక్కడి నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉందని, క్వింటాలుకు 10 కిలోల తరుగు తీసి వేస్తామని చెప్పడంతో ధాన్యం బస్తాలను తిరిగి గ్రామానికి తీసుకొని వెళ్లాడు. రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం అధికార పార్టీకి చెందిన మండల ప్రజా ప్రతినిధిది కావటం గమనార్హం. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు. పేరు వెంకట్రామిరెడ్డి. తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. 210 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు అమ్ముకుందామనే ఉద్దేశంతో స్థానిక పీఏసీఎస్ సెంటర్‌కు తీసుకొచ్చి విక్రయించాడు. అయితే ధాన్యం సేకరించి రెండు మూడు రోజులు గడిచినా లారీల కొరతతో కేంద్రం సిబ్బంది ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేదు. వర్ష సూచన, ధాన్యంపై కప్పడానికి టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాకు రూ.20 చెల్లించి ప్రైవేట్ వాహనాలలో మిల్లు వద్దకు తరలించారు. ఇంతా చేస్తే అక్కడ ధాన్యం దించడానికి వారం సమయం పట్టింది. వాహనాల యజమానులు వెయిటింగ్ చార్జీ కింద రోజుకు రూ.400 వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు బస్తా బరువు కలుపుకొని 40.600 గ్రాములు తూకం వేయాలి. కానీ తరుగు, తేమ అంటూ మిల్లర్ల పేరిట కొనుగోలు సెంటర్లోనే బస్తాకు అదనంగా 600 గ్రాములు చొప్పున క్వింటాల్‌కు కిలోకు పైగానే ధాన్యం తరుగు తీశారు. తర్వాత లారీల కొరత, రైసుమిల్లులో ధాన్యం దించడానికి వెయిటింగ్ ఇలా వారం నుండి పది రోజులు çసమయం గడవడంతో గింజ బరువు తగ్గి తూకంలో తేడా వచ్చింది. దీంతో మిల్లర్లు మళ్ళీ కిలోకు పైగా ధాన్యం తరుగు తీశారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి వాపోయాడు. రెండున్నర ఎకరాలు పంట సాగుకు దాదాపు రూ.80 వేలు, ధాన్యం రవాణా ఖర్చు రూ.6 వేలు అయ్యిందని, ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు పెట్టుబడికే సరిపోయి నట్టయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం రవాణాకు సరిపడినన్ని లారీలు, ఇతర వాహనాలు లేక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో వేచి చూడాల్సి వస్తోంది. వర్షాలతో తేమ 17 శాతం మించకుండా చూడటం కష్టమవుతోంది. ఈ తేమ తగ్గేందుకు ఆరబెడుతున్నా, మళ్లీ వర్షాలు వస్తుండటంతో మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ధాన్యం రంగుమారినా, ఆరబెట్టే క్రమంలో పెళ్లలు వచ్చినా క్వింటాల్‌కు 3–4 కిలోలు తరుగు పోతోంది. మిల్లుల్లోనూ కోత పెడుతున్నారు. వాస్తవానికి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లాక రైతుకు సంబంధం ఉండొద్దు. కానీ అక్కడ నాణ్యతను సాకుగా చూపి మొత్తం తూకంలో మళ్లీ కోత వేస్తున్నారు. హమాలీల కొరతతో కేంద్రాల వద్ద లోడింగ్, మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. టార్పాలిన్లు, మిల్లుల వద్ద వెయిటింగ్ చార్జీలు తడిసి మోపెడవుతు న్నాయి. ఒక్క టార్పాలిన్కు రూ.20 వరకు అద్దె ఉంటోంది. ఒక రైతుకు కనీసం పది టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. -
తవ్వేకొద్దీ శవాలు..!
సాక్షి, చెన్నై: మూనారు రాజమలైలో తవ్వే కొద్ది శవాలు బయట పడుతున్నాయి. మృతులంతా తమిళులే కావడంతో బాధిత కుటుంబాల రోదనలు వర్ణణాతీతంగా మారాయి. అత్యధిక శాతం మంది కైతారు వాసులు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం సంప్రదింపులు జరిపారు. కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లా మూనారు సమీపంలోని రాజమలై తేయాకు తోటల్లో పనులకు వెళ్లిన కార్మికులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులంతా తిరునల్వేలి, తెన్ కాశి పరిసర వాసులకు చెందిన వారు కావడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం మరో 20 మేరకు మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మేరకు మృతదేహాల కోసం అన్వేషణ సాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది జాడ కానరాకపోవడంతో వీరంతా తేయాకు తోటకు కూత వేటు దూరంలో ప్రవహిస్తున్న నదిలో కొట్టుకెళ్లి ఉంటారన్న నిర్ధారణకు సహాయక బృందాలు వచ్చాయి. దీంతో హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. మృతదేహాలను సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో అక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా సహాయక చర్యలకు వర్షం అండ్డంకిగా మారిందని ఇడిక్కి ఎస్పీ కరుప్పుస్వామి పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. బంధువుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామన్నారు. (అగ్నిప్రమాదం కలచివేసింది) విజయన్‌తో పళని భేటి... కేరళ సీఎం పినరయి విజయన్‌తో ముఖ్యమంత్రి పళనిస్వామి ఫోన్లో మాట్లాడారు. మూనారులో సాగుతున్న సహాయక చర్యలు, మృతుల్లో తమిళులు ఉండడం గురించి మాట్లాడారు. అవసరమైతే తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.సహాయక చర్యలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని, త్వరితగతిన అన్ని వివరాలను తమిళనాడుకు అందజేస్తామని విజయన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇది కంటి తుడుపు చర్య అని రూ. 25 లక్షలు ప్రకటించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. నష్ట పరిహారం పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
పంట నష్టం అపారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లో మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశా రు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముంది. నష్టపోయిన పంట రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. -
ఎకరాకు రూ. 70వేలు ఇవ్వాలి
సాక్షి, అనంతపురం : పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బెలుగుప్ప మండలంలోని రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, గత ఏడాదిలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 70వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందని ధ్వజమెత్తారు. గత కొద్ది కాలంగా అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే ఉచితంగా విత్తన మొక్కలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. -
రాష్ట్రానికి సాయం చేయండి
వర్షాల నష్టంపై రాజ్‌నాథ్‌ను కోరిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన తెలంగాణకు తగిన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ శనివారం ఫోన్లో హోంమంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాలకు, పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదికను పరిశీలించారు. ఆ నివేదికను కేంద్రానికి అందిస్తామని సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, రాజీవ్ శర్మ ఆదివారం ఢిల్లీకి వెళ్లి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదిక సమర్పించనున్నారు. సీఎం నవరాత్రి శుభాకాంక్షలు: పవిత్రమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాం క్షలు తెలిపారు. ఈ నవరాత్రులు ప్రజలకు సుఖ సంతోషాలు, ప్రశాంతత, అదృష్టాన్ని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.