Onion Price Hike News: ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’! - Sakshi
Sakshi News home page

Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!

Sep 10 2021 2:44 PM | Updated on Sep 10 2021 9:20 PM

Onion Prices Likely To Rise Told By Crisil - Sakshi

దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ  మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ హెచ్చరించింది.

నెలకు 13 లక్షల టన్నులు
ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్‌ అభిప్రాయపడింది.  

ఖరీఫ్‌పై ప్రభావం
దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్‌ సీజన్‌ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్‌ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్‌.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్‌ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది.

రబీ పైనా ప్రభావం
ఖరీఫ్‌ సీజన్‌ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్‌ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్‌ స్టాక్‌ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్‌ అంటోంది.  

నాసిక్‌లో కరువు
మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్‌ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్‌ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్‌.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్‌ చేయాలో తెలుసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement