సాగుకు నీళ్లు నిల్‌! | Shivam Committee Said That water Can Not Be Given For Kharif Season | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 2:29 AM | Last Updated on Fri, Aug 3 2018 2:29 AM

Shivam Committee Said That water Can Not Be Given For Kharif Season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ (శివమ్‌) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్‌లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది.

తొలి ప్రాధాన్యం తాగునీటికే...
రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్‌ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్‌ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్‌సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్‌ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్‌లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్‌ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్‌ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్‌ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్‌ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు.

ప్రవాహాలు వచ్చేదాకా అంతే...
నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్‌ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్‌పూర్‌ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్‌లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్‌ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్‌ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్‌ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement