కృష్ణమ్మకు జలకళ
- ప్రకాశం బ్యారేజి నుంచి కాల్వలకు నీటి విడుదల
- ఇన్‌ఫ్లో : 28,001 క్యూసెక్కుల నీరు
- అవుట్ ఫ్లో : 18,430 క్యూసెక్కుల నీరు
కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి పంట కాలువలకు గురువారం నీరు విడుదల చేశారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లో గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి నీటిమట్టం 585.70 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో బాగా ఉండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో బ్యారేజి గేట్ల నుంచి నీరు పొంగిపొర్లుతోంది.
గతవారం నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద 9 అడుగులకు అటూఇటుగా నీటి మట్టం నిలకడగా ఉంటోంది. గురువారానికి నీటి మట్టం 12 అడుగులకు పెరిగింది. శుక్రవారం ఉదయానికి ఎగువ నుంచి 28,001 క్యూసెక్కుల నీరు బ్యారేజి వద్దకు రానుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో దిగువ మండలాల ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగాయలంక, అవనిగడ్డ, కైకలూరు, కోడూరు మండలాల రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో బ్యారేజి నుంచి గురువారం 18,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 10,248 క్యూసెక్కులు, బందరు కాల్వకు 2,311, ఏలూరు కాల్వకు 1,352, రైవస్ కాల్వకు 4,401 , కృష్ణా తూర్పు బ్లాక్‌కు 2,184, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వలకు 7,837 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. అలాగే గుంటూరు నగర తాగు నీటి అవసరాలకు వినియోగించే గుంటూరు చానల్‌కు 345 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాగా పొంగి పొర్లుతున్న కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు బ్యారేజి వద్దకు తరలి రావడంతో సందడి నెలకొంది.
- భవానీపురం