the release of water
-
‘సీమ’కు ఉరి వేసిన ముఖ్యమంత్రి
కడప రూరల్ : శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజీని మిగిల్చి రాయలసీమకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉరి వేశారని రాయలసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో సాధారణంగా 854 అడుగుల నీరు నిల్వ ఉండాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 12, 13 తేదీల్లో ఆ నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం 824 అడుగులకు పడిపోయిందన్నారు. అంటే ఆ జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుందని తెలిపారు. అయితే ఆ నీటిని కూడా వాడాలనుకోవడం శోచనీయమన్నారు. శ్రీశైలంలో ఉన్న డెడ్ స్టోరేజీ కారణంగా సీమకు చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా, కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి అటు పులివెందులకు, ఇటు అనంతపురంకు సమాంతర కాలువలు లేనిదే సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీమ జిల్లాలను విస్మరించి కేవలం తొమ్మిది జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. కాగా, రాష్ట్ర రాజధానిలో జనాభా ప్రాతిపదికన ‘సీమ’ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగేతాము ఎమ్మెల్సీ అభ్యర్థులు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాలను బలపరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నాగార్జునరెడ్డి, రాయలసీమ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, రచయిత నారాయణస్వామి, రాధాకృష్ణ, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు కుడి కాలువకు నీటి విడుదల
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు నేడు నీటిని విడుదల చేయనున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప సోమవారం తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అశనిపాతం
కర్ణాటకకు వ్యతిరేకంగా మహదాయి ట్రిబ్యునల్ తీర్పు బెళగావి, గదగ్ ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ సంఘాలు న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం: సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: మహదాయి నదీ జలాల వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర అర్జీని మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెళగావి, గదగ్‌లోని నరగుంద తదితర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మహదాయి నది నుంచి మలప్రభకు ఎత్తిపోతల ద్వారా 7.56 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ట్రిబ్యునల్ ఎదుట మధ్యంతర అర్జీని దాఖలు చేసింది. కర్ణాటక తరఫున ప్రముఖ న్యాయవాది ఫాలి నారీమన్ వాదనలు వినిపించగా, గోవా తరఫున ఆత్మారామ్ నాడికర్ణి ఆ రాష్ట్ర వాదనలను వినిపించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తన మధ్యంతర తీర్పును బుధవారం వెలువరించింది. 7.56టీఎంసీల నీటిని కోరుతూ కర్ణాటక దాఖలు చేసిన మధ్యంతర అర్జీని ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ ప్రాంతంలోని ప్రజలు తాగునీటి అవసరాల కోసం మహదాయి నదీ జలాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా ఈ అంశంపై పోరాటం సాగిస్తున్నారు. తీర్పు విషయం తెలిసిన వెంటనే బెళగావి, గదగ్ జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. వివిధ రైతు సంఘాలు, కన్నడ సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గదగ్‌లోని ఎంపీ శివకుమార ఉదాసీ కార్యాలయంపై నిరసన కారులు దాడికి పాల్పడ్డారు. ఎంపీ కార్యాలయం వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌ను విరిచేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక బైలహొంగళ నగరంలో కళసా-బండూరి పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీని నిర్వహించి నిరసనను తెలియజేశారు. బెళగావిలోని అనేక ప్రాంతాల్లో సైతం రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు టైర్లకు నిప్పుపెట్టి, ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే సందర్భంలో వివిధ కన్నడ సంఘాలు నేడు(గురువారం) కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం...... మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేము శాయశక్తులా ప్రయత్నించాం. అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సైతం భేటీ అయి విషయాన్ని వివరించాం, అయినా ఫలితం లేకుండా పోయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పునకు సంబంధించిన ప్రతులు ఇంకా మాకు అందలేదు. ట్రిబ్యునల్ తీర్పు ప్రతి కోసం రాష్ట్ర న్యాయవాదులు ఇప్పటికే అర్జీ దాఖలు చేశారు. తీర్పు ప్రతి అందిన తర్వాత న్యాయవాదులతో చర్చించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాము. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 30న కన్నడ చలనచిత్రసీమ బంద్ మహదాయి నదీజలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ తీర్పు కర్ణాటకకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఈనెల 30న కన్నడ చలనచిత్ర సీమ బంద్ పాటించనుందని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సా.రా.గోవిందు వెల్లడించారు. కర్ణాటకకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ బంద్‌ను పాటించనున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో కన్నడ సంఘాల ఒక్కూట నేతృత్వంలో ఈనెల 30న కర్ణాటక బంద్ పాటించనున్నట్లు ఒక్కూట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ తెలిపారు. గురువారం నుంచే తమ నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం రోజున గోవా, మహారాష్ట్ర సీఎంల దిష్టిబొమ్మలను తగల బెట్టడం ద్వారా తమ పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తీర్పునకు వ్యతిరేకంగా ధర్నా తుమకూరు: మహదాయి నదీ జలాలపై కర్ణాటకకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తుమకూరు నగరంలోని టౌన్‌హాల్ సర్కిల్లో బుధవారం రైతు సంఘం నేత కోడి హళ్ళి చంద్రశేఖర్ నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. -
మాట తప్పారు
పట్టిసీమ ద్వారా డెల్టాకు సాగునీరు ఎప్పటికో.. జూన్ 1, జూన్ 15, ఆగస్టు 15న సాగునీరంటూ వాయిదాలు ఎదురుచూసిన రైతులకు మిగిలింది నిరాశే.. మచిలీపట్నం : పట్టిసీమ నుంచి డెల్టాకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ముచ్చటగా మూడోసారీ మాటతప్పింది. జూన్ ఒకటో తేదీకే ఖరీఫ్ నారుమడులకు సాగునీరు అంది స్తామని ఒకసారి, కొద్ది రోజుల తరువాత అదే నెల 15వ తేదీ నాటికి ఇస్తామని మరోసారి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ నీరు పోల వరం కాలువలో పారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాగ్దానం చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నాటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మాటమార్చేశారు. పట్టిసీమ పనులు పూర్తి కానందున, ఈ పనుల్లో నాణ్యత పాటించాల్సి ఉన్నందున వారం, పది రోజుల తరువాత కృష్ణానదికి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో డెల్టా రైతుల్లో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్‌లో సాగర్ నీరు వచ్చినారాకున్నా, పట్టిసీమ నీరు తెచ్చి కృష్ణానదిలో కలిపి, ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్ ఒకటి నుంచి సాగునీరు ఇస్తామని ఘంటసాల మండలంలో పర్యటించినప్పుడు మంత్రి ఉమా ప్రకటించారు. ఆ తరువాత జరిగిన జెడ్పీ సమావేశంలో జూన్ 15వ తేదీ నుంచి నీరు ఇస్తామన్నారు. అయితే వరుణుడు కరుణించక, పాలకులు చెప్పినట్టు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు చేరి కాలువలకు విడుదల చేస్తే పంటలు సాగు చేసుకుందామనే ఆశతో రైతులు ఉన్నారు. కాలువలకు నీటి విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టిసీమ ద్వారా నీరు చేరేనా..! పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 174 కిలోమీటర్ల దూరం ఉంది. 130 కిలోమీటర్ల మేర వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోల వరం కాలువను తవ్వారు. అప్పట్లో ఈ కాలువను 86 కిలోమీటర్ల పొడవున తవ్వారు. మిగిలిన 44 కిలోమీటర్ల మేర పోలవరం కాలువ తవ్వి కృష్ణానదికిలో పట్టిసీమ నీరు చేరేలా పనులు పూర్తిచేయాలి. ఏడాదిగా ఈ పనులు చేస్తూ ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. పట్టిసీమ వద్ద పంపింగ్ చేయడం ప్రారంభిస్తే 48 గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు చేరుతుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏడాదిగా చెప్తున్నారు. రూ.1300 కోట్లతో చేపట్టిన ఈ పథకం వద్ద 24 మోటార్లతో రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి తరలించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పనులు పూర్తికాకపోవటంతో కనీసం నాలుగు మోటార్ల ద్వారానైనా నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారని, అయితే ఆ పనులు కూడా పూర్తికాలేదని రైతులు చెబుతున్నారు. తొలుత 30 మోటార్లను ఈ పట్టిసీమ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. తరువాత వాటిని 24కు కుదించారు. అనుకున్న సమయానికి పనులు కాకున్నా పట్టిసీమ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నీరు కృష్ణానదికి చేరేనా.. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద నుంచి 30 మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వస్తుందనేది అధికారుల లెక్క. ఈ మోటార్ల సంఖ్యను 24కు, అక్కడి నుంచి ఎనిమిదికి, ఆ తరువాత నాలుగుకు, అక్కడి నుంచి ఒక్క మోటారుకు కుదించినట్లు ప్రచారం జరుగుతోంది. 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 24 మోటార్లు నూరుశాతం పనిచేసేందుకు విద్యుత్ నిరాటంకంగా సరఫరా అవుతుందా అన్న అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలవరం కాలువ పనుల్లో వంతెనలు నిర్మించాల్సిన చోట తూములు ఏర్పాటు చేశారని, ఇవి ఎంతమేర పనిచేస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల సంక్షేమాన్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏడాది కాలంగా పట్టిసీమ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి చివరి క్షణాల్లో తూచ్ అనటం టీడీపీ నాయకులకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పులిచింతలను ఆదర్శంగా తీసుకున్నారా? నిర్మాణ పనులు పూర్తికాకుండానే 2013 నవంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 35 నుంచి 45 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ ఉంచే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. నిర్వాసితులకు రూ.200 కోట్లు ఇస్తే పులిచింతల పనులు పూర్తిస్థాయిలో చేయించుకునే అవకాశం ఉన్నా నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రూ.257 కోట్ల కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారని రైతు సంఘల నాయకులు పేర్కొంటున్నారు. పులిచింతలకు రూ.200 కోట్లు విడుదల చేస్తే 40 నుంచి 45 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పులిచింతలను కాదని, 35 టీఎంసీల నీటిని పట్టిసీమ నుంచి కృష్ణానదికి పంపింగ్ చేసేందుకే మొగ్గు చూపటం వెనుక కారణాలు ఏమిటని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
లైన్ తప్పింది!
ఎస్సారెస్పీ, ఎల్ఎండీ కింద ఆయకట్టును పెంచేందుకు కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచేందుకు ఓవైపు సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా.. మరోవైపు అధికారులు గతంలో అర్ధాంతరంగా ఆపేసిన మరమ్మతు పనులను హడావుడిగా చేపడుతున్నారు. దీంతో కాల్వ వెడల్పు ఉంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కాల్వ వెడల్పు పనులు చేపట్టినట్టయితే ప్రస్తుతం చేస్తున్న రూ.3కోట్ల విలువైన పనులు వృథా కానున్నాయి. తిమ్మాపూర్: ఉత్తర తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీ జలాశయాలు నాలుగు జిల్లాల రైతాంగానికి ప్రధానమైన నీటి వనరులు. జలాశయాల నుంచి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రధానమైనది కాకతీయ కాలువ. తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి కోసం కాకతీయ కాలువ వెడల్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో కాలువ ద్వారా గరిష్టంగా 8500 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉండగా..దీనిని 14వేలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అధికారులు లైన్ ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపించారు. కాలువ వెడల్పు పనులు చేపట్టేందుకు సర్వే చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వెడల్పు మాటను పక్కన పెట్టిన అధికారులు గతంలో నిర్వహించిన టెండర్ల ప్రకారం రూ.3కోట్లతో లైనింగ్ మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారుల తీరు చూస్తుంటే.. కేసీఆర్ హామీ ప్రకారం కాకతీయ కాలువ వెడల్పు ఉంటుందా.. లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాలువ వెడల్పు చేసే పరిస్థితి ఉంటే ప్రస్తుతం చేస్తున్న పనుల్లో కాలువ కుడివైపు మళ్లీ తొలగించాల్సి ఉంటుంది. దీంతో నిధులు నీళ్ల పాలవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది. లేదంటే కేసీఆర్ హామీ నీటి మూటగానే మారనుంది. 8500 నుంచి 14 వేల క్యూసెక్కులకు... ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 8500 క్యూసెక్కుల నీటిని తరలించేలా కాకతీయ ప్రధాన కాలువను డిజైన్ చేశారు. గతంలో లైనింగ్ చెడిపోవడంతో గత ప్రభుత్వ హయాంలో రూ.3కోట్లతో ఎల్ఎండీ దిగువన మరమ్మతులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాలువ వెడల్పు చేస్తానని హామీచ్చారు. దీంతో 14వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అధికారులు తాత్కాలిక అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం 27మీటర్ల అడుగు భాగం ఉన్న కాలువను 52 మీటర్లు చేయాల్సిన అవసరముందని, కాలువకు రెండు పక్కల కాకుండా కుడివైపునే కట్టను తొలగించి వెడల్పు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదనలు రూపొందించారు. వీటికి సంబంధించి పూర్తి సర్వే కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇటు సర్వే చేయాల్సి ఉండగా... మరమ్మతులు చేయడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెడల్పు చేసే పరిస్థితి ఉంటే కాలువ కట్టను తొలగిస్తే ఇప్పుడు చేసిన ఖర్చు నీటి పాలవుతుందనే విమర్శలున్నాయి. కేసీఆర్ హామీ ప్రకారం కాలువ వెడల్పు చేస్తే ఇప్పుడు చేసే పనులు కొంత వృథా అవుతాయని అధికారులు ఆలోచిస్తున్నా.. బయటకు చెప్పేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా కాలువ వెడల్పు ఉంటుందా..లేదా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇస్తే నిధులు వృథా కాకుండా కాలువ కుడివైపు మరమ్మతులు చేయడమా..ఆపడమా అనేది నిర్ధారించుకోవచ్చని అధికారులు అనుకుంటున్నారు. కాలువ లైనింగ్ పనులు కుడివైపు చేపడ్తున్నారంటే... కేసీఆర్ హామీ ఉత్తిదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
కృష్ణమ్మకు జలకళ
ప్రకాశం బ్యారేజి నుంచి కాల్వలకు నీటి విడుదల ఇన్‌ఫ్లో : 28,001 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో : 18,430 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి పంట కాలువలకు గురువారం నీరు విడుదల చేశారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లో గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి నీటిమట్టం 585.70 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో బాగా ఉండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో బ్యారేజి గేట్ల నుంచి నీరు పొంగిపొర్లుతోంది. గతవారం నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద 9 అడుగులకు అటూఇటుగా నీటి మట్టం నిలకడగా ఉంటోంది. గురువారానికి నీటి మట్టం 12 అడుగులకు పెరిగింది. శుక్రవారం ఉదయానికి ఎగువ నుంచి 28,001 క్యూసెక్కుల నీరు బ్యారేజి వద్దకు రానుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో దిగువ మండలాల ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగాయలంక, అవనిగడ్డ, కైకలూరు, కోడూరు మండలాల రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజి నుంచి గురువారం 18,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 10,248 క్యూసెక్కులు, బందరు కాల్వకు 2,311, ఏలూరు కాల్వకు 1,352, రైవస్ కాల్వకు 4,401 , కృష్ణా తూర్పు బ్లాక్‌కు 2,184, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వలకు 7,837 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. అలాగే గుంటూరు నగర తాగు నీటి అవసరాలకు వినియోగించే గుంటూరు చానల్‌కు 345 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాగా పొంగి పొర్లుతున్న కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు బ్యారేజి వద్దకు తరలి రావడంతో సందడి నెలకొంది. - భవానీపురం -
ఎవరి గోల వారిది..
► హెచ్చెల్సీ నీటి కోసం తగువులాడుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు ► కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ ► పంటలకు నీరు వదలాల్సిందేనని చీఫ్ విప్ పట్టు ► చెరువులకు ఇవ్వాలని మంత్రి సునీత ఆదేశం ► పులివెందులకు వదలొద్దంటున్న వరదాపురం సూరి ► శింగనమలకూ నీరివ్వాలంటున్న యామినీ బాల ► నేడు సాగునీటి సలహా మండలి సమావేశం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల మధ్య నీటి చిచ్చు రగులుకుంది. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదల విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోవిధంగా ఆదేశాలు జారీ చేస్తుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దున ఉన్న కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల రైతులు ఆయకట్టులో వరినాట్లు వేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వరి సాగు చేసేందుకు వారికి పూర్తి హక్కు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఈ ఏడాది హెచ్చెల్సీ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో 8.5 టీఎంసీలు జిల్లాలో తాగునీటి అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన 13.5 టీఎంసీలలో నాలుగు టీఎంసీలు నీటి ఆవిరితో పాటు సరఫరా నష్టాలు ఉంటాయని హెచ్చెల్సీ అధికారులు అంచనా వేశారు. మిగిలిన నీటిని 90 వేల ఎకరాల్లో పంటలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. మిరప, పత్తి, వరి పంటలు వేస్తే నీరు ఎక్కువగా అవసరం అవుతాయని, కావున ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం హెచ్చెల్సీ నీటితో తమ నియోజకవర్గ ప్రజలకే లబ్ధి చేకూర్చుకునేందుకు పోటీపడుతున్నారు. మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులకు నీటిని విడుదల చేయించుకోవాలని పట్టుబడుతున్నారు. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడికాలువ కింద 47 చెరువులు ఉన్నాయి. వీటికి హెచ్చెల్సీ నీరివ్వాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి తన నియోజకవర్గంలోని చెరువులకు నీటిని ఇవ్వాలని, పులివెందులకు విడుదల చేయకూడదంటూ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. శింగనమల చెరువు, సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సిందేనంటూ ప్రభుత్వ విప్, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి డిమాండ్ చేస్తున్నారు. బాంబులు వేసైనా సరే శింగనమల చెరువుకు నీళ్లు రప్పించుకుంటామని నెల క్రితం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగిన సమావేశంలో శపథం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హెచ్చెల్సీ నీటిని వివిధ ఉప కాలువలకు విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకునేందుకు నేడు (శనివారం) అనంతపురంలో సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హెచ్చెల్సీ పరిధిలోని ప్రజాప్రతినిధులందరూ హాజరుకానున్నారు. నీటి విడుదల విషయంలో ఒకరి అభిప్రాయానికి ఒకరు కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి తుంగభద్ర జలాశయం నిండి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వెళుతోంది. తుంగభద్ర నుంచి సమాంతర కాలువను నిర్మిస్తే ఈ నీటిని జిల్లాకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తే కేటాయింపుల మేరకు నీటిని పూర్తి స్థాయిలో తెచ్చుకోవచ్చు. వీటిపై జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోగా, వస్తున్న కాస్తో కూస్తో నీటి కోసం పరస్పరం గొడవలు పడుతున్నారు. జిల్లా ప్రజలు టీడీపీకి 12 మంది ఎమ్మెల్యేలను అందించారు. కావున జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. నీటిని తీసుకువచ్చే విషయంలో జిల్లా నేతలు.. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. శ్రీశైలం డ్యాం నుంచి కేవలం రెండు టీఎంసీల నీటిని హంద్రీ-నీవా ద్వారా ఇచ్చేందుకు మాత్రమే ఆమోదముద్ర వేయించారు. తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్న తరుణంలో హంద్రీ-నీవా ద్వారా అదనపు నీరు తీసుకురాగలిగితే రానున్న వేసవిలో తాగునీటి సమస్యను కొంత మేరకు అధిగమించవచ్చు. ఇదిలావుండగా.. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి కేటాయించిన 22 టీఎంసీల నీటిలో ఐదు టీ ఎంసీలను మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెన్నా నది ద్వారా వైఎస్సార్ జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు విడుదల చేయాలి. అలాగే పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు ఒక టీఎంసీ, కర్నూలు జిల్లాలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) నుంచి 0.9 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. రావమ్మా.. కృష్ణమ్మా.. నేడు కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ-నీవాకు నీటి విడుదల అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా కాలువకు నేడు కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేయనున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంలో శుక్రవారం నాటికి నీటి మట్టం 875 అడుగులకు (పూర్తి సామర్థ్యం 885 అడుగులు) చేరుకుంది. డ్యాంలో 854 అడుగుల ఎత్తుకు నీటి మట్టం చేరుకుంటే నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత హంద్రీ-నీవా కాలువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు విన్నవించారు. సోమవారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన సభ్యులు మంత్రుల విన్నపంపై చర్చించి తొలివిడగా అనంతపురం జిల్లాకు మల్యాల లిఫ్టు ద్వారా 2 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించారు. పరిస్థితిని బట్టి విడతల వారీగా నీటిని విడుదల చేస్తామిన తీర్మానించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కర్నూలు జిల్లా మల్యాల వద్ద లిప్టు హంద్రీ-నీవా చీఫ్ ఇంజనీర్ మనోహర్ మోటార్ల స్విచ్‌ను ఆన్‌చేసి నీటిని విడుదల చేయనున్నారు. కాగా, మొదటి దశలో కాలువ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో పూడిక ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లాకు ఇపుడు కేటాయించిన రెండు టీఎంసీల నీటిలో చివరకు ఏమేరకు చేరుతాయనేది ప్రశ్నార్థకమే. -
కృష్ణా నుంచి తాగునీరు విడుదల
త్వరలో సాగునీటి విడుదలకు ఏర్పాట్లు: మంత్రి దేవినేని విజయపురి సౌత్: ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను దశలవారీగా పూర్తి చేస్తామని నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 11.20 గంటలకు స్విచ్ ఆన్ చేయగా గంటకు 500 క్యూ సెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రానికి 6,000 క్యూసెక్కు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల అనంతరం మంత్రి రివర్ వ్యూ అతిథి గృహంలో మాట్లాడారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వల్ల తాగునీటి కోసం నీటిని విడుదల చేశామన్నారు. కృష్ణా డెల్టాకు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రాయలసీమకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు.