మాట తప్పారు
పట్టిసీమ ద్వారా డెల్టాకు సాగునీరు ఎప్పటికో..
జూన్ 1, జూన్ 15, ఆగస్టు 15న సాగునీరంటూ వాయిదాలు
ఎదురుచూసిన రైతులకు మిగిలింది నిరాశే..
మచిలీపట్నం : పట్టిసీమ నుంచి డెల్టాకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ముచ్చటగా మూడోసారీ మాటతప్పింది. జూన్ ఒకటో తేదీకే ఖరీఫ్ నారుమడులకు సాగునీరు అంది స్తామని ఒకసారి, కొద్ది రోజుల తరువాత అదే నెల 15వ తేదీ నాటికి ఇస్తామని మరోసారి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ నీరు పోల వరం కాలువలో పారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాగ్దానం చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నాటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మాటమార్చేశారు. పట్టిసీమ పనులు పూర్తి కానందున, ఈ పనుల్లో నాణ్యత పాటించాల్సి ఉన్నందున వారం, పది రోజుల తరువాత కృష్ణానదికి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో డెల్టా రైతుల్లో నిరాశ, నిస్పృహ నెలకొంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్‌లో సాగర్ నీరు వచ్చినారాకున్నా, పట్టిసీమ నీరు తెచ్చి కృష్ణానదిలో కలిపి, ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్ ఒకటి నుంచి సాగునీరు ఇస్తామని ఘంటసాల మండలంలో పర్యటించినప్పుడు మంత్రి ఉమా ప్రకటించారు. ఆ తరువాత జరిగిన జెడ్పీ సమావేశంలో జూన్ 15వ తేదీ నుంచి నీరు ఇస్తామన్నారు. అయితే వరుణుడు కరుణించక, పాలకులు చెప్పినట్టు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు చేరి కాలువలకు విడుదల చేస్తే పంటలు సాగు చేసుకుందామనే ఆశతో రైతులు ఉన్నారు. కాలువలకు నీటి విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పట్టిసీమ ద్వారా నీరు చేరేనా..!
పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 174 కిలోమీటర్ల దూరం ఉంది. 130 కిలోమీటర్ల మేర వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోల వరం కాలువను తవ్వారు. అప్పట్లో ఈ కాలువను 86 కిలోమీటర్ల పొడవున తవ్వారు. మిగిలిన 44 కిలోమీటర్ల మేర పోలవరం కాలువ తవ్వి కృష్ణానదికిలో పట్టిసీమ నీరు చేరేలా పనులు పూర్తిచేయాలి. ఏడాదిగా ఈ పనులు చేస్తూ ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. పట్టిసీమ వద్ద పంపింగ్ చేయడం ప్రారంభిస్తే 48 గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు చేరుతుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏడాదిగా చెప్తున్నారు. రూ.1300 కోట్లతో చేపట్టిన ఈ పథకం వద్ద 24 మోటార్లతో రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి తరలించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పనులు పూర్తికాకపోవటంతో కనీసం నాలుగు మోటార్ల ద్వారానైనా నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారని, అయితే ఆ పనులు కూడా పూర్తికాలేదని రైతులు చెబుతున్నారు. తొలుత 30 మోటార్లను ఈ పట్టిసీమ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. తరువాత వాటిని 24కు కుదించారు. అనుకున్న సమయానికి పనులు కాకున్నా పట్టిసీమ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నీరు కృష్ణానదికి చేరేనా..
పట్టిసీమ ప్రాజెక్టు వద్ద నుంచి 30 మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వస్తుందనేది అధికారుల లెక్క. ఈ మోటార్ల సంఖ్యను 24కు, అక్కడి నుంచి ఎనిమిదికి, ఆ తరువాత నాలుగుకు, అక్కడి నుంచి ఒక్క మోటారుకు కుదించినట్లు ప్రచారం జరుగుతోంది. 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 24 మోటార్లు నూరుశాతం పనిచేసేందుకు విద్యుత్ నిరాటంకంగా సరఫరా అవుతుందా అన్న అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలవరం కాలువ పనుల్లో వంతెనలు నిర్మించాల్సిన చోట తూములు ఏర్పాటు చేశారని, ఇవి ఎంతమేర పనిచేస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల సంక్షేమాన్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏడాది కాలంగా పట్టిసీమ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి చివరి క్షణాల్లో తూచ్ అనటం టీడీపీ నాయకులకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పులిచింతలను ఆదర్శంగా తీసుకున్నారా?
నిర్మాణ పనులు పూర్తికాకుండానే 2013 నవంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 35 నుంచి 45 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ ఉంచే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. నిర్వాసితులకు రూ.200 కోట్లు ఇస్తే పులిచింతల పనులు పూర్తిస్థాయిలో చేయించుకునే అవకాశం ఉన్నా నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రూ.257 కోట్ల కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారని రైతు సంఘల నాయకులు పేర్కొంటున్నారు. పులిచింతలకు రూ.200 కోట్లు విడుదల చేస్తే 40 నుంచి 45 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పులిచింతలను కాదని, 35 టీఎంసీల నీటిని పట్టిసీమ నుంచి కృష్ణానదికి పంపింగ్ చేసేందుకే మొగ్గు చూపటం వెనుక కారణాలు ఏమిటని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.