ఎవరి గోల వారిది.. | Whose noise theirs .... | Sakshi
Sakshi News home page

ఎవరి గోల వారిది..

Published Sat, Aug 9 2014 3:24 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

ఎవరి గోల వారిది.. - Sakshi

ఎవరి గోల వారిది..

హెచ్చెల్సీ నీటి కోసం తగువులాడుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు
కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
పంటలకు నీరు వదలాల్సిందేనని చీఫ్ విప్ పట్టు  
చెరువులకు ఇవ్వాలని మంత్రి సునీత ఆదేశం
పులివెందులకు వదలొద్దంటున్న వరదాపురం సూరి  
శింగనమలకూ నీరివ్వాలంటున్న యామినీ బాల
నేడు సాగునీటి సలహా మండలి సమావేశం
 

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల మధ్య నీటి చిచ్చు రగులుకుంది. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదల విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోవిధంగా ఆదేశాలు జారీ చేస్తుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దున ఉన్న కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల రైతులు ఆయకట్టులో వరినాట్లు వేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వరి సాగు చేసేందుకు వారికి పూర్తి హక్కు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఈ ఏడాది హెచ్చెల్సీ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఏడాది హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో 8.5 టీఎంసీలు జిల్లాలో తాగునీటి అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన 13.5 టీఎంసీలలో నాలుగు టీఎంసీలు నీటి ఆవిరితో పాటు సరఫరా నష్టాలు ఉంటాయని హెచ్చెల్సీ అధికారులు అంచనా వేశారు. మిగిలిన నీటిని 90 వేల ఎకరాల్లో పంటలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. మిరప, పత్తి, వరి పంటలు వేస్తే నీరు ఎక్కువగా అవసరం అవుతాయని, కావున ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం హెచ్చెల్సీ నీటితో తమ నియోజకవర్గ ప్రజలకే లబ్ధి చేకూర్చుకునేందుకు పోటీపడుతున్నారు. మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులకు నీటిని విడుదల చేయించుకోవాలని పట్టుబడుతున్నారు. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడికాలువ కింద 47 చెరువులు ఉన్నాయి. వీటికి హెచ్చెల్సీ నీరివ్వాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి తన నియోజకవర్గంలోని చెరువులకు నీటిని ఇవ్వాలని, పులివెందులకు విడుదల చేయకూడదంటూ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. శింగనమల చెరువు, సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సిందేనంటూ ప్రభుత్వ విప్, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి డిమాండ్ చేస్తున్నారు. బాంబులు వేసైనా సరే శింగనమల చెరువుకు నీళ్లు రప్పించుకుంటామని నెల క్రితం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగిన సమావేశంలో శపథం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హెచ్చెల్సీ నీటిని వివిధ ఉప కాలువలకు విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకునేందుకు నేడు (శనివారం) అనంతపురంలో సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హెచ్చెల్సీ పరిధిలోని ప్రజాప్రతినిధులందరూ హాజరుకానున్నారు. నీటి విడుదల విషయంలో ఒకరి అభిప్రాయానికి ఒకరు కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు.


వాస్తవానికి తుంగభద్ర జలాశయం నిండి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వెళుతోంది. తుంగభద్ర నుంచి సమాంతర కాలువను నిర్మిస్తే ఈ నీటిని జిల్లాకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తే కేటాయింపుల మేరకు నీటిని పూర్తి స్థాయిలో తెచ్చుకోవచ్చు. వీటిపై జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోగా, వస్తున్న కాస్తో కూస్తో నీటి కోసం పరస్పరం గొడవలు పడుతున్నారు.

జిల్లా ప్రజలు టీడీపీకి 12 మంది ఎమ్మెల్యేలను అందించారు. కావున జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. నీటిని తీసుకువచ్చే విషయంలో జిల్లా నేతలు.. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. శ్రీశైలం డ్యాం నుంచి కేవలం రెండు టీఎంసీల నీటిని హంద్రీ-నీవా ద్వారా ఇచ్చేందుకు మాత్రమే ఆమోదముద్ర వేయించారు. తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్న తరుణంలో హంద్రీ-నీవా ద్వారా అదనపు నీరు తీసుకురాగలిగితే రానున్న వేసవిలో తాగునీటి సమస్యను కొంత మేరకు అధిగమించవచ్చు. ఇదిలావుండగా.. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి కేటాయించిన 22 టీఎంసీల నీటిలో ఐదు టీ ఎంసీలను మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెన్నా నది ద్వారా వైఎస్సార్ జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు విడుదల చేయాలి. అలాగే పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు ఒక టీఎంసీ, కర్నూలు జిల్లాలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) నుంచి 0.9 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది.
 
రావమ్మా.. కృష్ణమ్మా..

నేడు కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ-నీవాకు నీటి విడుదల

 అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా కాలువకు నేడు కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేయనున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంలో శుక్రవారం నాటికి నీటి మట్టం 875 అడుగులకు (పూర్తి సామర్థ్యం 885 అడుగులు) చేరుకుంది.  డ్యాంలో 854 అడుగుల ఎత్తుకు నీటి మట్టం చేరుకుంటే నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత హంద్రీ-నీవా కాలువకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు విన్నవించారు. సోమవారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన సభ్యులు మంత్రుల విన్నపంపై చర్చించి తొలివిడగా అనంతపురం జిల్లాకు మల్యాల లిఫ్టు ద్వారా 2 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించారు. పరిస్థితిని బట్టి విడతల వారీగా నీటిని విడుదల చేస్తామిన తీర్మానించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కర్నూలు జిల్లా మల్యాల వద్ద లిప్టు హంద్రీ-నీవా చీఫ్ ఇంజనీర్ మనోహర్ మోటార్ల స్విచ్‌ను ఆన్‌చేసి నీటిని విడుదల చేయనున్నారు. కాగా, మొదటి దశలో కాలువ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో పూడిక ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లాకు ఇపుడు కేటాయించిన రెండు టీఎంసీల నీటిలో చివరకు ఏమేరకు చేరుతాయనేది ప్రశ్నార్థకమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement