పదవుల గోల
పదవుల గోల
Published Wed, Jan 18 2017 11:27 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
పార్టీ మారిన ఎమ్మెల్యేల పాట్లు
- తమ కార్యకర్తలకు న్యాయం
చేయాలని కొత్త డిమాండ్
- ఒత్తిళ్ల నేపథ్యంలో నియోజకవర్గాల్లో
గందరగోళం
- ఇప్పటి వరకు ఒక్క పదవీ దక్కని వైనం
- అధికార పార్టీలో తెరపైకి రోజుకో రగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి తమకివ్వాలంటూ పట్టుబట్టి సాధించుకున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. తాజాగా పార్టీలో పదవులపైనా కన్నేశారు. తమ అనుచరులకు పదవులు ఇవ్వాలంటూ కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెస్తున్నారు. తాము అధికార పార్టీలో చేరినప్పటికీ తమ అనుచరులకు మాత్రం ఒక్క పదవీ దక్కలేదని వీరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులకు పార్టీలో పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తమకు పార్టీలో తగిన గౌరవం దక్కదనే వాదనను వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న నేతలకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య మరో వివాదం మొదలవుతోంది. మొత్తం మీద అధికారపార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది.
ఇక ఎమ్మెల్యే రాజ్..
అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు గోడ దూకిన తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జి ఎవరనే విషయంలో పేచీ పడింది. ఇప్పటికే ఉన్న ఇన్‌చార్జీలదే పెత్తనం సాగుతుందని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కేవలం ప్రొటోకాల్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని మొదట్లో అధికార పార్టీ తేల్చి చెప్పింది. ఇందుకు అనుగుణంగానే నియోజకవర్గ ఇన్‌చార్జీలదే మొన్నటి వరకూ ఆధిపత్యం సాగింది. అయితే, తాజాగా గత నెల రోజుల పరిణామాల్లో పార్టీ మారిన తమకు కాదని ఇప్పటికే ఉన్న వారికి అధికారం కట్టబెడితే ఇక తాము పార్టీ మారి ఏం ప్రయోజనమే వాదనను వీరు తీసుకొచ్చారు. ఇదే అంశాన్ని అధిష్టానం వద్ద వినిపించారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారికే అధికారం కట్టబెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పది రోజుల క్రితం అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఈ అధికార మార్పిడి తంతు కాస్తా కర్నూలు నియోజకవర్గంలో ముగిసింది. వచ్చే నెల నుంచి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతాయని బుధవారం జరిగిన సమావేశంలో తేటతెల్లమయ్యింది. దీనిపై ఎంపీ టీజీ వెంకటేష్ వర్గీయులు ఇప్పటికే మండిపడటం ప్రారంభమయ్యింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇంతే సామరస్యంగా అధికార మార్పిడి తంతు సాగుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డ, కోడుమూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయోననే సందేహాలు అధికారపార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి.
మా భవిష్యత్ మాదే..
ఎమ్మెల్యేలకే అధికారం కట్టబెడుతుండటంతో అప్పటికే ఉన్న నేతలంతా అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న వీరిలో తలెత్తుతోంది. అందువల్ల తమ భవిష్యత్ కోసం తమ దారి తాము చూసుకోవాల్సిందేననే ఆలోచన ఈ నేతల్లో మెదలుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. అంతకంటే ముందుగా పాత నేతలందరూ కలిసి ఇదే పరిస్థితి కొనసాగిస్తే తమకు కష్టాలు తప్పవని.. దాంతో పాటు పార్టీకి కూడా నష్టమని అధినేత వద్ద వాదించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అందరూ ఒకే తాటిపైకి వస్తారా అనే సందేహాలు వ్యవక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇన్‌చార్జి ఎవరనే అంశంపై అధికారపార్టీలో రగడ కాస్తా రోజురోజుకీ ముదురుతుందే తప్ప తగ్గని పరిస్థితి నెలకొంది.
Advertisement