లైన్ తప్పింది!
ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ కింద ఆయకట్టును పెంచేందుకు కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచేందుకు ఓవైపు సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా.. మరోవైపు అధికారులు గతంలో అర్ధాంతరంగా ఆపేసిన మరమ్మతు పనులను హడావుడిగా చేపడుతున్నారు. దీంతో కాల్వ వెడల్పు ఉంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కాల్వ వెడల్పు పనులు చేపట్టినట్టయితే ప్రస్తుతం చేస్తున్న రూ.3కోట్ల విలువైన పనులు వృథా కానున్నాయి.
తిమ్మాపూర్: ఉత్తర తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్‌ఎండీ జలాశయాలు నాలుగు జిల్లాల రైతాంగానికి ప్రధానమైన నీటి వనరులు. జలాశయాల నుంచి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రధానమైనది కాకతీయ కాలువ. తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి కోసం కాకతీయ కాలువ వెడల్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో కాలువ ద్వారా గరిష్టంగా 8500 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉండగా..దీనిని 14వేలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సీఎం సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అధికారులు లైన్ ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపించారు. కాలువ వెడల్పు పనులు చేపట్టేందుకు సర్వే చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వెడల్పు మాటను పక్కన పెట్టిన అధికారులు గతంలో నిర్వహించిన టెండర్ల ప్రకారం రూ.3కోట్లతో లైనింగ్ మరమ్మతు పనులు చేయిస్తున్నారు.
ఎస్సారెస్పీ అధికారుల తీరు చూస్తుంటే.. కేసీఆర్ హామీ ప్రకారం కాకతీయ కాలువ వెడల్పు ఉంటుందా.. లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాలువ వెడల్పు చేసే పరిస్థితి ఉంటే ప్రస్తుతం చేస్తున్న పనుల్లో కాలువ కుడివైపు మళ్లీ తొలగించాల్సి ఉంటుంది. దీంతో నిధులు నీళ్ల పాలవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది. లేదంటే కేసీఆర్ హామీ నీటి మూటగానే మారనుంది.
8500 నుంచి 14 వేల క్యూసెక్కులకు...
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 8500 క్యూసెక్కుల నీటిని తరలించేలా కాకతీయ ప్రధాన కాలువను డిజైన్ చేశారు. గతంలో లైనింగ్ చెడిపోవడంతో గత ప్రభుత్వ హయాంలో రూ.3కోట్లతో ఎల్‌ఎండీ దిగువన మరమ్మతులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాలువ వెడల్పు చేస్తానని హామీచ్చారు.
దీంతో 14వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అధికారులు తాత్కాలిక అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం 27మీటర్ల అడుగు భాగం ఉన్న కాలువను 52 మీటర్లు చేయాల్సిన అవసరముందని, కాలువకు రెండు పక్కల కాకుండా కుడివైపునే కట్టను తొలగించి వెడల్పు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదనలు రూపొందించారు. వీటికి సంబంధించి పూర్తి సర్వే కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇటు సర్వే చేయాల్సి ఉండగా... మరమ్మతులు చేయడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెడల్పు చేసే పరిస్థితి ఉంటే కాలువ కట్టను తొలగిస్తే ఇప్పుడు చేసిన ఖర్చు నీటి పాలవుతుందనే విమర్శలున్నాయి. కేసీఆర్ హామీ ప్రకారం కాలువ వెడల్పు చేస్తే ఇప్పుడు చేసే పనులు కొంత వృథా అవుతాయని అధికారులు ఆలోచిస్తున్నా.. బయటకు చెప్పేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికైనా కాలువ వెడల్పు ఉంటుందా..లేదా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇస్తే నిధులు వృథా కాకుండా కాలువ కుడివైపు మరమ్మతులు చేయడమా..ఆపడమా అనేది నిర్ధారించుకోవచ్చని అధికారులు అనుకుంటున్నారు. కాలువ లైనింగ్ పనులు కుడివైపు చేపడ్తున్నారంటే... కేసీఆర్ హామీ ఉత్తిదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.