‘సీమ’కు ఉరి వేసిన ముఖ్యమంత్రి
కడప రూరల్ : శ్రీశైలం జలాశయంలో డెడ్ స్టోరేజీని మిగిల్చి రాయలసీమకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉరి వేశారని రాయలసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో సాధారణంగా 854 అడుగుల నీరు నిల్వ ఉండాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 12, 13 తేదీల్లో ఆ నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం 824 అడుగులకు పడిపోయిందన్నారు. అంటే ఆ జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుందని తెలిపారు. అయితే ఆ నీటిని కూడా వాడాలనుకోవడం శోచనీయమన్నారు. శ్రీశైలంలో ఉన్న డెడ్ స్టోరేజీ కారణంగా సీమకు చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా, కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి అటు పులివెందులకు, ఇటు అనంతపురంకు సమాంతర కాలువలు లేనిదే సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీమ జిల్లాలను విస్మరించి కేవలం తొమ్మిది జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. కాగా, రాష్ట్ర రాజధానిలో జనాభా ప్రాతిపదికన ‘సీమ’ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగేతాము ఎమ్మెల్సీ అభ్యర్థులు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాలను బలపరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నాగార్జునరెడ్డి, రాయలసీమ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, రచయిత నారాయణస్వామి, రాధాకృష్ణ, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.