సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది.
కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
సంగమేశ్వరుడి సన్నిధికి..
కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది.
Comments
Please login to add a commentAdd a comment