irregation projects
-
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు వార్తలు
-
సరళాసాగర్‌కు గండి!
సాక్షి, నాగర్‌కర్నూల్/వనపర్తి: అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్‌పాడు జలాశయానికి చేరింది. అక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్‌లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం, ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గండి పడింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం సరళాసాగర్‌కు గండి పడిన విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టును పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మైనర్ ఇరిగేషన్ సీఈ అమీద్‌ఖాన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సీఈ అనంతరెడ్డి గండిపడిన ప్రాంతానికి వెళ్లి పునర్నిర్మాణానికి సర్వే చేపట్టారు. ప్రాజెక్టుకు మరమ్మతులు, స్థాయి పెంపుపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఆసియా ఖండంలోనే తొలి సైఫన్ సిస్టం.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో 1947లో ప్రాజె క్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నా యి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు. ఈసారి భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుం చి వచ్చిన నీటి ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిని నింపారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది. 25 ఏళ్లుగా మరమ్మతులు లేవు.. 25 ఏళ్లుగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపించారు. 10రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు కట్ట బలహీనంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టా లని నీటి పారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. కాగా, ఈ నెల 24న ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా.. మండలంలోని ఓ ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని అధికారులు గేట్లు తెరవలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు గొడవ చేయటంతో ఆలస్యంగా 26న కాల్వలకు నీటి విడుదల చేశారు. అయితే సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో 27న బంద్ చేసి 28 నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీరు వదిలారు. ఇలా మూడ్రోజుల జాప్యం కారణంగానే గండి పడిందని రైతులు చెబుతున్నారు. ఆయకట్టుకు సాగు నీరిస్తాం.. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగునీరు అందిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. కేఎల్ఐ పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి ఈ ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కుడి, ఎడమ, సమాంతర కాల్వలతో అనుసంధానం చేసి యాసంగి పంటలకు నీరిస్తామని తెలిపారు. -
ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ జలకళను సంతరించుకోవడంతో గరిష్టంగా అరకోటి ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి చేసిన, పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కిందే 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చే అవకాశముండగా, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిన సాగు జరగనుంది. సాగర్ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు.. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ప్రాజె క్టులో నీటి నిల్వలు 315 టీఎంసీల మేర ఉన్నాయి. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలున్నాయి. తాగునీటి అవసరాలకు మరో 25 టీఎంసీల వరకు అవసరముంటుంది. తాగునీటికి పక్కనపెట్టినా, మరో 50 టీఎంసీల మేర తెలంగాణకు వాటా దక్కే అవకాశం ఉన్నందున పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్వకుర్తి కింద కనిష్టంగా 3 లక్షల ఎకరాలు.. ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశముంది. కల్వకుర్తికి కనిష్టంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 25 టీఎంసీల మేర నీటి కేటాయింపులు చేయనున్నారు. జూరాలపై లక్ష ఎకరాలు, దానిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాల పరిధిలో చెరో రెండు లక్షల ఎకరాల మేర కలిపి 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 600లకు పైగా చెరువులు నింపారు. వీటికింద కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం ఉంది. 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వఉన్న 90 టీఎంసీలతో పాటు లోయర్‌మానేరు డ్యామ్ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చెరువులు నింపే కార్యక్రమం జరుగుతోంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా చెరువులు నింపుతూ నీరు వదులుతున్నారు. మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలు దేవాదుల కింద ఇప్పటికే 7 టీఎంసీల గోదావరి నీటితో 300 చెరువులకు నీరివ్వడంతో పాటు ఆయకట్టుకు నీరిస్తున్నారు. యాసంగిలోనూ మరో 12 నుంచి 13 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటే ఏఎంఆర్పీ, కాళేశ్వరం నదీ జలాలను ఎత్తిపోసే పరిమాణాన్ని బట్టి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి రానుంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. వీటిద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆస్కారముంది. చెరువుల కిందా జోరుగానే.. ఈ ఏడాది చెరువుల కింద గరిష్ట సాగుకు అవకాశముంది. ఇప్పటికే 43 వేలకు పైగా ఉన్న చెరువుల్లో 22 వేల చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మొత్తం చెరువుల్లో 17 వేల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 4,700 చెరువులు 75 శాతం వరకు నీటితో ఉన్నాయి. వీటితో పాటే సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని తరలించేలా 3 వేల తూముల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే వెయ్యికి పైగా పూర్తయ్యాయి. ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తి స్థాయిలో నింపే అవకాశముంది. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, 14 లక్షలకు తగ్గకుండా సాగు జరిగే అవకాశముంది. ఇక ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, ఇందులో ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. మొత్తంగా చిన్న నీటి వనరుల కిందే 16 లక్షల ఎకరాల మేర సాగుకు ఈ ఏడాది నీరు అందే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. 2.52 లక్షల ఎకరాల్లో రబీ సాగు సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సీజన్ సాగు లక్ష్యం, ఇప్పటివరకు ఎంత సాగైందన్న వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు నివేదించింది. దాని ప్రకారం రబీ సాధా రణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో (8%) సాగైంది. అందులో అత్యధికంగా వేరుశనగ సాగైంది. వేరుశనగ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1.67 లక్షల (51%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు లక్ష్యం 2.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52,500 ఎకరాల్లో (18%) సాగయ్యాయి. అందులో కేవలం శనగ పంట సాగైంది. ఇక రబీలో కీలకమైన వరి సాధారణ సాగు 17.07 లక్షల ఎకరాలు కాగా, నాట్లు మొదలు కావాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురవడం, రిజర్వాయర్లు, చెరువులు నిండిపోవడంతో లక్ష్యానికిమించి వరి నాట్లు పడతాయని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక మొక్కజొన్న రబీ సాధారణ సాగు లక్ష్యం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 ఎకరాల్లో (2%) మాత్రమే సాగైంది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నాగర్‌కర్నూలు జిల్లాలో 64% విస్తీర్ణంలో రబీ పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా లో 53% సాగయ్యాయి. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలోనూ పంటల సాగు మొదలుకాలేదని నివేదిక తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికం ఈ ఏడాది వర్షాలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి ఆలస్యంగా మొదలైనా, ఆగస్టు నుంచి పుంజుకోవడంతో ఇప్పటివరకు అధిక వర్షాలే కురుస్తున్నాయి. జూన్‌లో 33 శాతం లోటు కనపడింది. జూలైలో 12 శాతం లోటున్నా సాధారణ వర్షపాతంగానే రికార్డయింది. ఇక ఆగస్టులో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏకంగా 92 శాతం అధికంగా కురవడం విశేషం. ఆ తర్వాత రబీ మొదలైన అక్టోబర్ నెలలోనూ ఏకంగా 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం ఇక పంట రుణాలపై బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. గత ఖరీఫ్‌లో 102 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి ఏకంగా 131 శాతం సాగైంది. గత ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇచ్చింది రూ.16,820 కోట్లే. ఇక రబీ సీజన్ ప్రారంభమైనా రుణాలు అత్యంత తక్కువగానే ఇచ్చాయి. రబీ పంట రుణ లక్ష్యం రూ.17,950 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచి్చనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పెద్ద ఎత్తున వరి నాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఆదుకోకుంటే రైతులకు అప్పులు మాత్రమే మిగులుతాయని అంటున్నారు. -
సీఎం హామీకి మోక్షమెప్పుడో ?
‘‘పక్కనే కృష్ణమ్మ ఉంది. ఇక్కడి రైతులకు నీరందాలంటే నెల్లికల్ ఎత్తిపోతల అవసరం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించండి. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభిస్తాం’’ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.సీఎం హామీ నెరవేరుస్తారని తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్‌ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు ముగిశాయి. కాలం గడిచిపోతోంది. కానీ నెల్లికల్ లిఫ్ట్‌పై ఎవరూ నోరు మెదపడం లేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బహుళార్ధకసాధక ప్రాజెక్టు. ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ... ఎంతో మంది గొంతును తడుపుతున్న కృష్ణమ్మ... కానీ పక్కనే మూడు కిలోమీటర్లు కూడా లేని నెల్లికల్ ప్రాంత ప్రజలకు మాత్రం తాగు, సాగు నీరు అందడం లేదు. ఈ సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. వివరాల్లోకెళితే...తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతం డా, సఫావత్‌ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం ప్రకటనలకే పరిమితం అయింది. ఎత్తిపోతల పథకాన్ని నాయకులు, అధికారులు పట్టించుకోకపోడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటను సాగుచేస్తున్నారు. వర్షాలు కూడా కాలాగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో నిరాశచెందుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 4500 ఎకరాలు సాగులోకి నెల్లికల్ లిప్టు పూర్తయితే ఏడు గ్రామాల్లో 1500 కుటుంబాలకు సుమారు 4500 ఎకరాలకు సాగునీరందనుంది. ప్రతి ఏటా రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో నెల్లికల్‌లో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడి భూములును సస్యశ్యామలం చూస్తామంటూ ఊకదంపుడు ప్రచారాలతో ప్రజలను, రైతులను మభ్యపెడుతూ ఓట్లను దండుకొని బయటపడుతున్నారు. అనంతరం అనుమతుల సాకుతో తప్పించుకుంటున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు సుమారు రూ. 60 కోట్ల వ్యవయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి రైతులు నీటిని వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది. ఈ పథకం నిర్వాహణకు 1 /4 టీఎంసీల నీరు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంపుహౌస్‌లు నిర్మించి, మోటార్ల ద్వారా సాగునీరు అందించాల్సి ఉంటుంది. రెండు నెలలు కావస్తున్నా ఊసేలేదు.. లిప్టును ఏర్పాటు చేయకుండా నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో ఎన్నికల సమయంలో లిప్టు పేరును చెప్పి తమ ఓట్లను దండుకుంటున్నారని, ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏడు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు, ఓటములను కృష్ణపట్టె ప్రాంతం శాశిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు గట్టి హామీనే ఇచ్చింది. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే స్వయంగా తానే వచ్చి కొబ్బరికాయ కొట్టి నెల్లికల్ లిప్టు పనులను ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రకటించడంతో ఏడు గ్రామాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలు కావస్తున్నా నేటికీ లిప్టు పనుల ప్రారంభ దిశగా అడుగులు పడకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులే లిప్టుకు సంబంధించిన ప్రాథమిక పనులను ప్రారంభించటానికి అటవీ అనుమతులు రావా ల్సి ఉండటంతో ఐడీసీ అధికారులు కలెక్టర్ ద్వా రా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. వణ్యప్రాణుల అభయారణ్యం కావడంతో పాటు సుమా రు 9 ఎకరాలు అటవీభూమి మీదుగా పైపులైన్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశా ఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో పైపులైన్ల నిర్మాణంతో అడవికి జరిగే నష్టానికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్లు రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 299 /2లో గల సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించడానికి ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరితట్రిబ్యూనల్కు ప్ర భుత్వ భూమిని బదలాయింపు ప్రతిపాదనలు రా ష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో లిప్టు పనులతో అడవికి, అందులోని వణ్యప్రాణులకు ఏమైనా హాని ఉందా అని ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. సీఎం మాటపై నమ్మకముంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తానే స్వయంగా వచ్చి నెల్లికల్ లిప్టుకు కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి సారు నోరువెంట నెల్లికల్ లిప్టు రావడంతో ఈసారి లిప్టు పనులు ప్రారంభమవుతాయని సంతోషపడ్డాం. ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలవుతున్నా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో బాధగా ఉంది. కేసీఆర్ సారు తన మాటకు కట్టుబడి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించాలి. – మేకపోతుల గాలయ్య, రైతు, నెల్లికల్ వేల ఎకరాలు సాగులోకి లిప్టును ఏర్పాటు చేస్తే వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేసే రోజులు పోయాయి. వర్షాలు కూడా కాలానుగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా వేల రూపాయలు నష్టపోతున్నాం. ప్రభుత్వం చొరవ చూపి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి. – బుర్రి భిక్షమయ్య, రైతు నెల్లికల్ -
మరింత వేగంగా..
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ తుది అనుమతులు రావడంతో మరింత ముందడుగు పడినట్టయింది. నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సీఎం కేసీఆరే దీనిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం తర్వాత ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది సీతారామకే. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగనుంది. సీఎం మొదటి సమీక్ష ప్రాజెక్టులపై చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దీంతో వెంటనే తుది పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ.11 వేల కోట్ల నిధుల సేకరణ సైతం పూర్తయిందని సీఎం ప్రకటించారు. ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల బృందాన్ని పంపించిన కేసీఆర్, వారి ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇక తాజాగా తుది పర్యావరణ అనుమతులు సైతం రావడంతో మరింత నజర్ పెట్టనున్నారు. అంచనా వ్యయం రూ.13,884 కోట్లు.. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్‌గా నామకరణం చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భదాద్రి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 5 లక్షల ఎకరాలకు నీరందించాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత 6.75 లక్షల ఎకరాలకు పెరగడంతో అంచనా వ్యయాన్ని రూ.7,926 కోట్ల నుంచి రూ.13,884 కోట్లకు ప్రభుత్వం పెంచింది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తున్నారు. మొత్తం 372 కిలోమీటర్ల కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద మొదటి దశ పంప్‌హౌస్, పాల్వంచ మండలం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద రెండోదశ పంప్‌హౌస్, కమలాపురం వద్ద మూడోదశ పంప్‌హౌస్ పనులు జరుగుతున్నాయి. వీటిల్లో మొదటి, రెండో దశ పంప్‌హౌస్‌లతో పాటు కిన్నెరసానిపై అక్విడెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే జూన్ నెలాఖరు కల్లా భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న మొదటి దశ పంప్‌హౌస్ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్‌హౌస్ పనులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఫేజ్–1లో 110 కిలోమీటర్ల కెనాల్‌కు గాను 40 కిలోమీటర్ల వరకు కెనాల్ పనులు వేగంగా నడుస్తున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, 2వ దశ ద్వారా 3.25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బందులు వచ్చినప్పటికీ.. ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని, సాగర్ చివరి ఆయకట్టుకు సీతారామ ద్వారా నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి మొత్తం 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. ఆ దారిపొడవునా అనేక చోట్ల చెరువులు నింపేలా డిజైన్ రూపొందించారు. -
సాగుకు నీళ్లు నిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్‌లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు. ప్రవాహాలు వచ్చేదాకా అంతే... నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్‌లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
రూ.కోట్లు మింగేశారు
ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, కోట మండలాల్లో నిర్వహించిన స్వర్ణముఖి, చల్లకాలువ పొర్లుకట్టల మట్టి పనులు తూతూ మంత్రంగా నిర్వహించి అందులో రూ.కోట్లు మింగేశారు. వాకాడు : వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి పామంజి వరకు 14.5 కిలోమీటర్ల పొడవున నదికి కుడివైపున జరుగుతున్న పొర్లుకట్ట పనుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శిం చారు. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.17.05 కోట్లు. అందులో 3.5 కిలోమీటర్ల మేర సుమారు రూ.3 కోట్ల పనులను చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ నిధులను చేసిన పనులకే సర్దుబాటు చేశారు. దీంతో కొంతమంది రైతులు ఆందోళన చేపట్టడంతో కొత్తగా రూ.3 కోట్లకు అంచనాలు తయారు చేసే ప్రక్రియలో ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.జిల్లాలో 2000–01 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. జలవనరుల శాఖ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పొర్లుకట్టల పనుల పటిష్టత కోసం నాయుడుపేట నుంచి వాకాడు మండలం పామంజి వరకు, కోట మండలం చల్లకాలువ నుంచి పామంజి వరకు పొర్లుకట్టల పనులకు రూ. 287 కోట్లతో అంచనాలు తయారు చేసింది. అప్పట్లో టెండర్లు పిలిచినా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 2012 సంవత్సరంలో పొర్లు కట్టల ఎత్తు తగ్గించి మళ్లీ అంచనాలు సవరించి రూ.226 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 2013లో పొర్లుకట్టల పనులకు టెండర్లు పిలిచారు. అందులోనే కోట మండలం గూడలి నుంచి చల్లకాలువ మీదుగా పామంజి వరకు ఇరువైపులా పొర్లుకట్టలకు సంబంధించి సుమారు రూ.100 కోట్లతో పనులు చేయాల్సి ఉంది. ఒకవైపు కట్టకు సంబంధించి సుమారు రూ.45 కోట్ల టెండర్లకు గాను కాంట్రాక్టర్ లెస్ వేసి రూ.40 కోట్లకే పనులు దక్కించుకున్నారు. ఒక వైపే ఈ పనులు చేసి రెండో వైపు భూసేకరణ సమస్యతో పనుల్లో జాప్యం జరిగింది. రెండు ప్యాకేజీలకు సంబంధించిన పనుల అంచనాలు పలు విధాలుగా విభజించి అధికారులు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా చేశారు. కొందరు రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించి పాత టెం డర్లు రద్దు చేయించి, తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కుడివైపు కట్టకు రూ.17.05 కోట్లు వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి పామంజి వరకు 14.5 కి.మీ. నదికి కుడి వైపు కట్టకు సంబంధించి రూ. 17.05 కోట్లు అదే సమయంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నెల్లూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్నారు. ఈ పనులను 2015 నాటికి పూర్తి చేసేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. అధికారులు, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం వెరసి ఒప్పందం ప్రకారం పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యత లోపించి ఎక్కడ మట్టి అక్కడే జారిపోయింది. మళ్లీ పనులు చేసేందుకు ఇటీవల అధికారపార్టీ నేతల జోక్యంతో పొర్లుకట్టల పనులకు ఇంజినీర్లు అంచనాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసేందుకు అంచనాల మీద అంచనాలు తయారు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వాకాడు మండలంలో పొర్లు కట్టలకు సంబంధించి సమారు 30 ఎకరాలు భూ సేకరణ జరిగింది. అయితే ఆయా భూముల యజమానులకు ఇంత వరకు ఒక్క పైసాకూడా పరిహారం అందలేదు. దీంతో రైతులు పనులు జరగనివ్వకుండా అడ్డుతగులుతున్నారు. నాయుడుపేట నుంచి వాకాడు మండలం పామంజి వరకు జరిగిన పనుల్లో రూ.50 కోట్ల వరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నాణ్యతేదీ? వాకాడు నుంచి పామంజి మధ్య పొర్లుకట్టల నిర్మాణ పనులన్నీ నాణ్యత లేకుండా జరిగాయి. పొర్లుకట్టకు పక్క భాగంగాలోనే ఉన్న ఇసుక, మట్టిని తీసి కట్టలకు ఉపయోగించారు. అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని చోట్ల కట్ట కరిగిపోయింది. మరికొన్ని చోట్ల గండ్లుపడి రైతులకు నష్టపోయారు. ఇది ఇలా ఉంటే కొన్ని చోట్ల పాతకట్టల పనులనే చూపి బిల్లులు చేసుకున్నారు. ఇప్పటికే నీరు–చెట్టు పథకం కింద తెలుగు తమ్ముళ్లు పలు అక్రమాలకు పాల్పడ్డారు. మని కొన్ని పనులకు దొంగ బిల్లులు పెట్టి, అధికారులను భయపెడుతూ నిధుల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల జరిగిన టీడీపీ జనరల్‌బాడీ సమావేశంలో ఈ నెలాఖరుకల్లా నీరు–చెట్టు పథకానికి సంబంధించిన బిల్లులు అన్నిటికీ నిధులు మంజూరు చేస్తామంటూ స్వయాన రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. పనులు నాసిరకంగా చేపట్టారు వాకాడు స్వర్ణముఖి నది పొర్లుకట్టల పనులు నాసిరకంగా చేపట్టారు. దీంతో వరదలొస్తే సమీప గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పొర్లుకట్టలకు సంబంధించి రైతుల నుంచి భూములను రెవెన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అందుకు పరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. భూములు కోల్పోయిన వారంతా దళితులు. జీవనాధారమైన పొలం తీసుకోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. –దుంపల సుబ్రహ్మణ్యం, రైతు, గంగన్నపాళెం పొర్లుకట్టల పనులు పూర్తి కాలేదు ప్రస్తుతం జరుగుతున్న స్వర్ణముఖి నది పొర్లుకట్టల పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల మట్టి జారిపోయిన సంగతి వాస్తవమే. ఆయా చోట్ల మళ్లీ పనులు చేపడతాం. ఎందుకంటే పనులు పూర్తి చేసిన రెండేళ్ల వరకు కాంట్రాక్టర్ మరమ్మతుల పనులు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే పొర్లుకట్టల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. –మధు, ఇరిగేషన్ డీఈ -
'మంత్రి దేవినేనిని బర్తరఫ్ చేయండి'
హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనీ ప్రశ్నించారు.. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. వాటాలో లెక్కలు తేలక ఒకరి దోపిడీ మరొకరు బయట పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. దోపిడీపై విచారణ చేయించే ధైర్యం మీకుందా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు నేరుగా సవాల్ విసిరారు. కాంట్రాక్టు కంపెనీలను తక్షణమే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నారంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బాబు సర్కార్ వందల కోట్లు లూటీ'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ సాగునీటి ప్రాజెక్టు పనుల్లో లూటీ చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరును ఉన్నతాధికారులు కూడా తప్పుపడుతున్నారని, ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుల విషయంలో వందల కోట్ల రూపాయల కమీషన్లు, ముడుపులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు చేశారు. 18 నెలల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, లేనిపక్షంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు ముద్దుబిడ్డ అని ఆమె వ్యాఖ్యలు చేశారు. వాల్‌మార్ట్ దోపిడీకి గేట్లు బార్లా తెరవడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.