'మంత్రి దేవినేనిని బర్తరఫ్ చేయండి'
హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనీ ప్రశ్నించారు.. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
వాటాలో లెక్కలు తేలక ఒకరి దోపిడీ మరొకరు బయట పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. దోపిడీపై విచారణ చేయించే ధైర్యం మీకుందా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు నేరుగా సవాల్ విసిరారు. కాంట్రాక్టు కంపెనీలను తక్షణమే బ్లాక్లిస్ట్లో చేర్చాలన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నారంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.