సాక్షి, అమరావతి: గౌరవ ప్రదమైన శాసన సభాపతి ఎన్నిక సందర్భంగా గురువారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలు సభా కార్యక్రమాలను వీక్షించిన ప్రతి ఒక్కరిలోనూ ఆవేదనను కలిగించాయి. బలహీన వర్గాలకు చెందిన ఒక సీనియర్ నాయకుడిని వైఎస్సార్‌సీపీ స్పీకర్ పదవికి ఎన్నిక చేస్తే సభా సంప్రదాయాలను గౌరవించి ఆయన్ను అన్ని పార్టీల నాయకులు స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి సాదరంగా కూర్చోబెట్టడానికి ప్రతిపక్ష నేత ముందుకు రాకపోవడం ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కూడా స్పీకర్ తమ్మినేనిని అభినందిస్తూ సభ్యులు చేసే ప్రసంగాలు ముందుకు సాగకుండా రాజకీయపుటెత్తుగడలు పన్నడంపై కూడా పలువురు సీనియర్ నేతలు ముక్కున వేలేసుకున్నారు. సీఎంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబునాయుడు.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ షెడ్యూల్డ్ కులాల పట్ల తనకున్న వివక్షను బయటపెట్టుకున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఒక్క ప్రతిపాదనా చేయని టీడీపీ
తమ్మినేని సీతారామ్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌గా నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆ స్థానానికి ఆయన పేరును ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ తరుణంలో తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవ ఎన్నికకు తోడ్పడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆయనకు మద్దతుగా ఒక్క ప్రతిపాదన కూడా చేయించలేదు. తమ్మినేని సీతారామ్ తరఫున వైఎస్సార్‌సీపీ నేతల ప్రతిపాదనలు మాత్రమే ఉండడంతో ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆయన్ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాధ్యక్ష స్థానం నుంచి ప్రకటించారు. అదే సమయంలో ఆయన్ను స్పీకర్ స్థానాన్ని అధిష్టించాల్సిందిగా ఆహ్వానించారు. సభా నాయకుడు, ఇతర పార్టీల నాయకులు స్పీకర్ స్థానమున్న వేదికపైకి సీతారామ్‌ను తోడ్కొని రావలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం తమ్మినేని సీతారామ్‌కు నమస్కరిస్తూ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వేదికపైకి తీసుకువెళ్లేందుకు వీలుగా ముందుకు సాగారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ముందుకు వస్తారని కొన్ని క్షణాలు చూశారు.
ఆ సమయంలో ఆయన సభలోనే కూర్చొని ఉన్నప్పటికీ తన స్థానం నుంచి కనీసం కదలకపోవడం సభలో ఉన్న వారితో పాటు ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న అందరినీ విస్మయానికి గురిచేసింది. తన పక్కనే ఉన్న పార్టీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడిని వెళ్లమని బాబు సైగ చేయడంతో ఆయన లేచి వెళ్లి తమ్మినేని వెనుక నడిచారు. ఈ పరిణామాలు ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన కలిగించాయి. తమ్మినేని సీతారాం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా అందులో అయిదుసార్లు టీడీపీ నుంచే గెలిచారు. మూడుసార్లు మంత్రిగా చంద్రబాబుతో పాటు కలసి పనిచేశారు. తన సహచరుడిగా అనేక సంవత్సరాలు కలసి నడిచిన బీసీ నాయకుడు స్పీకర్‌గా ఎన్నికైతే అదే సభలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు ఆయన్ను గౌరవించాలన్న ఆలోచన కూడా లేకపోవడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు టీడీపీ సభ్యులను కూడా విస్మయానికి గురిచేసింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌గా ఎన్నికైన నాయకుడి పట్ల అప్పట్లో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఇలాగే వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు.
అభినందనలకూ బ్రేక్ వేసే యత్నం
వేదికపై స్పీకర్ కూర్చున్నాక అభినందనలు తెలియచేసే సభ్యుల ప్రసంగాలు ముందుకు సాగకుండా ప్రతిపక్ష నేత తన సభ్యులతో అడ్డుకొనేలా చేయడం విమర్శలకు దారితీసింది. ప్రతిపక్ష నేత తీరు పట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి.. అచ్చెన్నాయుడిని ఉద్దేశించి చేసిన ఒక చిన్న వ్యాఖ్యను అడ్డుపెట్టుకొని చంద్రబాబు సభలోనే రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడిని చెవిరెడ్డి అవమానించారంటూ అందుకు క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేయాలని చంద్రబాబు వారి ఎమ్మెల్యేలకు సైగ చేశారు. దీంతో అభినందనల పరంపరను ఆటంకపరుస్తూ వారు నినాదాలతో అడ్డుకున్నారు.
చెవిరెడ్డి వ్యాఖ్యలపై తాను రూలింగ్ ఇస్తానని, ఆ వ్యాఖ్యలను పరిశీలించాక తప్పుగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ పదేపదే చెబుతున్నా అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా అదే తీరున నినాదాలు కొనసాగించారు. సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఇది సరికాదని, తన సభ్యులను అదుపు చేయాలని అంబటి రాంబాబు ఇతర నేతలు పదేపదే విన్నవించాల్సి వచ్చింది. నూతన స్పీకర్‌కు అభినందనలు కూడా తెలియచేయనివ్వకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన సభ్యులతో అడ్డుపడడం గతంలో ఎన్నడూ లేదని పలువురు విమర్శించారు. చివరకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా సభలో సంఘటనల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment