స్పీకర్‌ బీసీ కావడం వల్లే చంద్రబాబు ఆయన చేయి పట్టుకోలేదు | Chevireddy Bhaskar Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ బీసీ కావడం వల్లే చంద్రబాబు ఆయన చేయి పట్టుకోలేదు

Published Fri, Jun 14 2019 4:48 AM | Last Updated on Fri, Jun 14 2019 4:48 AM

Chevireddy Bhaskar Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు చెందినవారు కాబట్టే స్పీకర్‌ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గురువారం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారాంకు చెవిరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెకు కూడా తానే ఎమ్మెల్యేగా ఉన్నానని  తెలిపారు. ‘గతంలో స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా నోట్‌ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోడెలను స్పీకర్‌గా ఎన్నుకోగానే జగన్‌ స్వయంగా చేయి పట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఓ బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టేందుకు కూడా వీళ్లకు (టీడీపీ సభ్యులకు) మనసు రాలేదు. వీళ్లు సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

స్పీకర్‌ బలహీన వర్గాలకు చెందినవారు కాబట్టే ఆయన చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదు. అదే స్థానంలో వారి సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉంటే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్పీకర్‌ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతుల్లాగా వారిని (ఎమ్మెల్యేలు) పంపించారు. గతంలో ఇదే సభలో టీడీపీ సభ్యులు దివంగత నేత రాజశేఖరరెడ్డిని రాక్షసుడు అన్నారు. ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. బంట్రోతు అంటే బండి నడిపే వాడని, సేవకుడని అర్థం. అచ్చెన్నాయుడు ఒక్కడే తనకు ఆపాదించుకుని కేవలం రాజకీయం చేయడం కోసం విలువైన సభా సమయాన్ని వృధా చేశారు’ అని చెవిరెడ్డి అన్నారు.  

పాత రికార్డులు బయటకు తీయండి: బుగ్గన
గత ఐదేళ్లలో టీడీపీ వాళ్లు ఎంతగా తెగించి మాట్లాడారో మరచిపోయినట్లున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘టీడీపీ నేతలు సాధారణంగా తమకు తాము ప్రజా సైనికులని, సేవకులని చెప్పుకుంటుంటారు. ఈ క్రమంలోనే బంట్రోతుల్లా అని చెవిరెడ్డి అని ఉండొచ్చు. కాకపోతే గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు వినాలి. ఒకరేమో పూడ్చిపెడతాం అంటారు. ఇంకొకరేమో పాతిపెడతాం అంటారు. చివరికి అచ్చెన్నాయుడు అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను పట్టుకుని ‘నువ్వు మగాడివైతే’ అని దుర్భాషలాడారు. మరి ఈ మాటలకు సమాధానం లేదా? ఈరోజు చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్‌గా ఉన్నట్లు మాట్లాడుతున్నారు.

నిజంగా మీరు అలాగే ఉంటుంటే న్యాయంగా అనిపించేది. సేవకులు, సైనికులు అని చెప్పుకుని టీడీపీ నేతలు తిరుగుతుంటారు కాబట్టి చెవిరెడ్డి ఓ మాట అని ఉండొచ్చు. ఈ చిన్న మాటను పట్టుకుని గొడవ చేస్తారా? టీడీపీ నుంచి ప్రతీఒక్కరూ గతంలో ఇష్టానుసారం మాట్లాడారు’ అని బుగ్గన డిమాండ్‌ చేశారు. స్పీకరు స్థానాన్ని దబాయిస్తూ చంద్రబాబు, టీడీపీ సభ్యులు మాట్లాడటం తగదని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ సభ్యులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు జోక్యం చేసుకుని బలహీన వర్గాలను కించపరిచినందుకు పశ్చాత్తాపం చెందకుండా ఎదురు దాడికి దిగడం తగదని తప్పు పట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement