సరళాసాగర్‌కు గండి! | Water Flow Out From SaralaSagar Project In Wanaparthy | Sakshi
Sakshi News home page

సరళాసాగర్‌కు గండి!

Published Wed, Jan 1 2020 2:00 AM | Last Updated on Wed, Jan 1 2020 2:00 AM

Water Flow Out From SaralaSagar Project In Wanaparthy - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌/వనపర్తి: అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా సరళాసాగర్‌ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్‌పాడు జలాశయానికి చేరింది. అక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్‌లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం, ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గండి పడింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్వేతా మహంతి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  

సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
సరళాసాగర్‌కు గండి పడిన విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. ప్రాజెక్టును పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ అమీద్‌ఖాన్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల సీఈ అనంతరెడ్డి గండిపడిన ప్రాంతానికి వెళ్లి పునర్నిర్మాణానికి సర్వే చేపట్టారు. ప్రాజెక్టుకు మరమ్మతులు, స్థాయి పెంపుపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు.  

ఆసియా ఖండంలోనే తొలి సైఫన్‌ సిస్టం..  
వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టంతో 1947లో ప్రాజె క్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నా యి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు. ఈసారి భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల నుం చి వచ్చిన నీటి ద్వారా సరళాసాగర్‌ ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిని నింపారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది.

25 ఏళ్లుగా మరమ్మతులు లేవు..  
25 ఏళ్లుగా సరళాసాగర్‌ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపించారు. 10రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు కట్ట బలహీనంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టా లని నీటి పారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. కాగా, ఈ నెల 24న ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా.. మండలంలోని ఓ ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని అధికారులు గేట్లు తెరవలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు గొడవ చేయటంతో ఆలస్యంగా 26న కాల్వలకు నీటి విడుదల చేశారు. అయితే సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో 27న బంద్‌ చేసి 28 నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీరు వదిలారు. ఇలా మూడ్రోజుల జాప్యం కారణంగానే గండి పడిందని రైతులు చెబుతున్నారు.

ఆయకట్టుకు సాగు నీరిస్తాం..
సరళాసాగర్‌ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగునీరు అందిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. కేఎల్‌ఐ పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి ఈ ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కుడి, ఎడమ, సమాంతర కాల్వలతో అనుసంధానం చేసి యాసంగి పంటలకు నీరిస్తామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement