సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీ వంచేస్తోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ జలకళను సంతరించుకోవడంతో గరిష్టంగా అరకోటి ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి చేసిన, పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కిందే 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చే అవకాశముండగా, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ జరగని రీతిన సాగు జరగనుంది.
సాగర్ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు..
ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ప్రాజె క్టులో నీటి నిల్వలు 315 టీఎంసీల మేర ఉన్నాయి. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలున్నాయి. తాగునీటి అవసరాలకు మరో 25 టీఎంసీల వరకు అవసరముంటుంది. తాగునీటికి పక్కనపెట్టినా, మరో 50 టీఎంసీల మేర తెలంగాణకు వాటా దక్కే అవకాశం ఉన్నందున పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
కల్వకుర్తి కింద కనిష్టంగా 3 లక్షల ఎకరాలు..
ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశముంది. కల్వకుర్తికి కనిష్టంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 25 టీఎంసీల మేర నీటి కేటాయింపులు చేయనున్నారు. జూరాలపై లక్ష ఎకరాలు, దానిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాల పరిధిలో చెరో రెండు లక్షల ఎకరాల మేర కలిపి 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 600లకు పైగా చెరువులు నింపారు. వీటికింద కనిష్టంగా లక్ష నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం ఉంది. 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వఉన్న 90 టీఎంసీలతో పాటు లోయర్‌మానేరు డ్యామ్ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చెరువులు నింపే కార్యక్రమం జరుగుతోంది. 3.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా చెరువులు నింపుతూ నీరు వదులుతున్నారు.
మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలు
దేవాదుల కింద ఇప్పటికే 7 టీఎంసీల గోదావరి నీటితో 300 చెరువులకు నీరివ్వడంతో పాటు ఆయకట్టుకు నీరిస్తున్నారు. యాసంగిలోనూ మరో 12 నుంచి 13 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చే కసరత్తులు జరుగుతున్నాయి. వీటితో పాటే ఏఎంఆర్‌పీ, కాళేశ్వరం నదీ జలాలను ఎత్తిపోసే పరిమాణాన్ని బట్టి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి రానుంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. వీటిద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆస్కారముంది.
చెరువుల కిందా జోరుగానే..
ఈ ఏడాది చెరువుల కింద గరిష్ట సాగుకు అవకాశముంది. ఇప్పటికే 43 వేలకు పైగా ఉన్న చెరువుల్లో 22 వేల చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మొత్తం చెరువుల్లో 17 వేల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. మరో 4,700 చెరువులు 75 శాతం వరకు నీటితో ఉన్నాయి. వీటితో పాటే సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని తరలించేలా 3 వేల తూముల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే వెయ్యికి పైగా పూర్తయ్యాయి. ప్రాజెక్టుల కాల్వల నుంచి నీటిని చెరువులకు మళ్లించి వాటిని పూర్తి స్థాయిలో నింపే అవకాశముంది. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, 14 లక్షలకు తగ్గకుండా సాగు జరిగే అవకాశముంది. ఇక ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 4.43 లక్షల ఎకరాల మేర ఆయకట్టుండగా, ఇందులో ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. మొత్తంగా చిన్న నీటి వనరుల కిందే 16 లక్షల ఎకరాల మేర సాగుకు ఈ ఏడాది నీరు అందే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది.
2.52 లక్షల ఎకరాల్లో రబీ సాగు
సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సీజన్ సాగు లక్ష్యం, ఇప్పటివరకు ఎంత సాగైందన్న వివరాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు నివేదించింది. దాని ప్రకారం రబీ సాధా రణ సాగు విస్తీర్ణం 31.95 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో (8%) సాగైంది. అందులో అత్యధికంగా వేరుశనగ సాగైంది. వేరుశనగ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1.67 లక్షల (51%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు లక్ష్యం 2.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52,500 ఎకరాల్లో (18%) సాగయ్యాయి. అందులో కేవలం శనగ పంట సాగైంది. ఇక రబీలో కీలకమైన వరి సాధారణ సాగు 17.07 లక్షల ఎకరాలు కాగా, నాట్లు మొదలు కావాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురవడం, రిజర్వాయర్లు, చెరువులు నిండిపోవడంతో లక్ష్యానికిమించి వరి నాట్లు పడతాయని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక మొక్కజొన్న రబీ సాధారణ సాగు లక్ష్యం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 7,500 ఎకరాల్లో (2%) మాత్రమే సాగైంది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నాగర్‌కర్నూలు జిల్లాలో 64% విస్తీర్ణంలో రబీ పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా లో 53% సాగయ్యాయి. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలోనూ పంటల సాగు మొదలుకాలేదని నివేదిక తెలిపింది.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికం
ఈ ఏడాది వర్షాలు అధికంగా నమోదయ్యాయి. నైరుతి ఆలస్యంగా మొదలైనా, ఆగస్టు నుంచి పుంజుకోవడంతో ఇప్పటివరకు అధిక వర్షాలే కురుస్తున్నాయి. జూన్‌లో 33 శాతం లోటు కనపడింది. జూలైలో 12 శాతం లోటున్నా సాధారణ వర్షపాతంగానే రికార్డయింది. ఇక ఆగస్టులో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏకంగా 92 శాతం అధికంగా కురవడం విశేషం. ఆ తర్వాత రబీ మొదలైన అక్టోబర్ నెలలోనూ ఏకంగా 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం
ఇక పంట రుణాలపై బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. గత ఖరీఫ్‌లో 102 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి ఏకంగా 131 శాతం సాగైంది. గత ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.29 వేల కోట్లు కాగా, ఇచ్చింది రూ.16,820 కోట్లే. ఇక రబీ సీజన్ ప్రారంభమైనా రుణాలు అత్యంత తక్కువగానే ఇచ్చాయి. రబీ పంట రుణ లక్ష్యం రూ.17,950 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచి్చనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పెద్ద ఎత్తున వరి నాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు ఆదుకోకుంటే రైతులకు అప్పులు మాత్రమే మిగులుతాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment