కొనసాగుతున్న సహాయక చర్యలు (ఇన్‌సెట్) మృతదేహాలు
సాక్షి, చెన్నై: మూనారు రాజమలైలో తవ్వే కొద్ది శవాలు బయట పడుతున్నాయి. మృతులంతా తమిళులే కావడంతో బాధిత కుటుంబాల రోదనలు వర్ణణాతీతంగా మారాయి. అత్యధిక శాతం మంది కైతారు వాసులు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం సంప్రదింపులు జరిపారు. కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లా మూనారు సమీపంలోని రాజమలై తేయాకు తోటల్లో పనులకు వెళ్లిన కార్మికులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులంతా తిరునల్వేలి, తెన్ కాశి పరిసర వాసులకు చెందిన వారు కావడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం మరో 20 మేరకు మృతదేహాలను వెలికి తీశారు.
ఇంకా 50 మేరకు మృతదేహాల కోసం అన్వేషణ సాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది జాడ కానరాకపోవడంతో వీరంతా తేయాకు తోటకు కూత వేటు దూరంలో ప్రవహిస్తున్న నదిలో కొట్టుకెళ్లి ఉంటారన్న నిర్ధారణకు సహాయక బృందాలు వచ్చాయి. దీంతో హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. మృతదేహాలను సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో అక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా సహాయక చర్యలకు వర్షం అండ్డంకిగా మారిందని ఇడిక్కి ఎస్పీ కరుప్పుస్వామి పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. బంధువుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామన్నారు. (అగ్నిప్రమాదం కలచివేసింది)
విజయన్‌తో పళని భేటి...
కేరళ సీఎం పినరయి విజయన్‌తో ముఖ్యమంత్రి పళనిస్వామి ఫోన్‌లో మాట్లాడారు. మూనారులో సాగుతున్న సహాయక చర్యలు, మృతుల్లో తమిళులు ఉండడం గురించి మాట్లాడారు. అవసరమైతే తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.సహాయక చర్యలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని, త్వరితగతిన అన్ని వివరాలను తమిళనాడుకు అందజేస్తామని విజయన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇది కంటి తుడుపు చర్య అని రూ. 25 లక్షలు ప్రకటించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. నష్ట పరిహారం పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment