రాష్ట్రానికి సాయం చేయండి
వర్షాల నష్టంపై రాజ్‌నాథ్‌ను కోరిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన తెలంగాణకు తగిన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ శనివారం ఫోన్‌లో హోంమంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాలకు, పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదికను పరిశీలించారు. ఆ నివేదికను కేంద్రానికి అందిస్తామని సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, రాజీవ్ శర్మ ఆదివారం ఢిల్లీకి వెళ్లి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదిక సమర్పించనున్నారు.
సీఎం నవరాత్రి శుభాకాంక్షలు: పవిత్రమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాం క్షలు తెలిపారు. ఈ నవరాత్రులు ప్రజలకు సుఖ సంతోషాలు, ప్రశాంతత, అదృష్టాన్ని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.