హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తగిన ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు గురువారం లేఖ రాశారు. ముంబై మాదిరిగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నగరం ఏ-1 కేటగిరీలో ఉందని అందులో పేర్కొన్నారు.
స్మార్ట్‌సిటీల పథకంలో హైదరాబాద్‌ను కూడా చేర్చి, ఏడాదికి కేవలం రూ. వంద కోట్లు మాత్రమే ఇవ్వడం వల్ల సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. దానికి బదులు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా గుర్తించి, ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలని కోరారు.
ప్రత్యేక వ్యూహం అవసరం
హైదరాబాద్‌పై అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ‘కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2011లో నియమించిన అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్‌కు కీలక రంగాల్లో రూ. 30,370 కోట్ల పెట్టుబడులు కావాలని పేర్కొంది. ఏటా యాజమాన్య, నిర్వహణ ఖర్చుల కింద రూ.1,264 కోట్లు అవసరమని తెలిపింది.
నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి, మురికి నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణకు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు కావాలి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) ద్వారా సిగ్నల్ ఫ్రీ కారిడార్ల ఏర్పాటుకు రహదారుల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులకు రూ. 20,661 కోట్లు కావాలి. అలాంటిది స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయించడం వల్ల హైదరాబాద్ అవసరాలు తీర్చడం సాధ్యం కాదు.
రూ. 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీకి ఏడాదికి కేవలం రూ. వంద కోట్లు ఇవ్వడం వల్ల చెప్పుకోదగిన పనులేవీ చేయడం సాధ్యం కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లాంటి ఏ-1 నగరాల అభివృద్ధికి.. ముఖ్యంగా మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా తదితర మౌలిక రంగాలకు ప్రత్యేక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉంది..’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు.
కొత్త పథకాన్ని తేవాలి..
హైదరాబాద్‌లో 50% కుటుంబాలకు మురికి కాల్వల సదుపాయం లేదని, ఇక్కడ ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన మంచినీటి, మురుగునీటి కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొత్త పైప్‌లైన్లు నిర్మించాల్సి ఉందన్నారు. ఇలా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేయాల్సిన అవసరముందని సూచించారు. లేకుంటే హైదరాబాద్ అవసరాలకు నిధులు సమకూర్చుకోవటం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.
కరీంనగర్‌ను చేర్చండి..
హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘దాదాపు మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ భౌగోళికంగా ఉత్తర తెలంగాణ నడిమధ్య ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ త్వరలోనే ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో చేరబోతున్నది. స్మార్ట్‌సిటీ పథకంలో కరీంనగర్‌ను చేర్చితే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీగా కరీంనగర్
కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న స్మార్ట్ సిటీస్ మిషన్ పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ ఎం.దానకిశోర్ ఇచ్చిన లేఖ ప్రతిని ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు గురువారం అందజేశారు.
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే సమగ్ర ప్రణాళిక నివేదిక (డీపీఆర్)ను తయారు చేసుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని వినోద్ కుమార్ ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. స్మార్ట్ సిటీల కోసం ఇచ్చే రూ.100 కోట్లు సరిపోవని, రూ.1000 కోట్ల చొప్పున కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు.