కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడాకారిణి, మహిళా పైలట్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి అవసరమయ్యే శిక్షణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయీదా ఫలక్ జూలైలో జరిగిన చెన్నై ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరిగే 13వ సీనియర్ ఏషియన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొననుంది. సోమవారం సెక్రటేరియట్‌లో సీఎంను సయీదా కలిసింది.
కరాటేలో రాణిస్తున్నందుకు సయిదాను అభినందించిన కేసీఆర్.. ఆమె శిక్షణకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్‌గా ఎంపికైంది. రాష్ట్రం నుంచి మొదటి పైలట్ అయిన స్వాతిరావు ఫిలిప్పైన్స్‌లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తోంది. ఎయిర్‌బస్ పైలట్‌గా మారేందుకు తదుపరి శిక్షణ తీసుకోవాల్సి ఉంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో స్వాతి సీఎంను కలిసింది. పైలట్ శిక్షణకు కావాల్సిన ఖర్చును భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.