రాజ్‌నాథ్‌తో కేసీఆర్ ఏకాంత చర్చ
న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీ అశోకారోడ్డులోని రాజ్‌నాథ్ నివాసంలో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకున్నదనే ప్రచారం నేపథ్యంలో రాజ్‌నాధ్‌ను కలిసేందుకు కేసీఆర్ ఐదురోజుల క్రితమే అపాయింట్‌మెంటును కోరారు. ఎట్టకేలకు గురువారం వీరి భేటీ ఖరారరుు్యంది. ఈ సందర్భంగా కేసీఆర్ రాజ్‌నాధ్‌తో అరగంటకు పైగా ఏకాంత చర్చలు జరిపారు. తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బీజేపీ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పినట్టుగా టీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. టీఆర్‌ఎస్, టీ జేఏసీ నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్, పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
అనుమానాలు తొలిగాయి: కేసీఆర్
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన రాజ్‌నాథ్‌ను కలిసి, తెలంగాణ బిల్లుకు మద్దతు అభ్యర్థించినట్టు కేసీఆర్ చెప్పారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ ఏర్పాటుపై ఉన్న అనుమానాలు తొలిగి పోయూయని విలేకరులతో అన్నారు. బిల్లు ఆమోదం కోసం సంపూర్ణ సహకారం, మద్దతు ఇస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు అనుసరిస్తున్న తీరు సభా సాంప్రదాయాలకు విరుద్ధమని, తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను వమ్ముచేస్తే భారత పార్లమెంటుపై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతుందని అన్నారు.
చిత్తశుద్ధి ఉంటే బిల్లు పెట్టాలి: జవదేకర్
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ గేమ్‌ప్లాన్ ప్రజలకు అర్థం అవుతోందని ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. సొంత పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌తో దీక్షను చేయించారని విమర్శించారు. రాష్ట్రాలను విభజించాలంటే, రాష్ట్రంలోని ప్రజలను విడదీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లు పెట్టాలని, బీజేపీ వైఖరి మారలేదని మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.