హామీలపై సీఎం కేసీఆర్ మోసం: వంశీచంద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పిన సీఎం ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. సమస్యలపై నిరసనలకు అవకాశం ఇవ్వకుండా, ధర్నా చౌక్‌ను కూడా శివార్లలోకి తరలించే ప్రయత్నం దారుణమన్నారు.
అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు సీఎం కేసీఆర్ కట్టుబడలేదని ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు చేసిన సమీక్షలు రాజకీయ సమీక్షలేనని, విపక్షాల ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాల్లో ఉంటే అవినీతి బండారం బయటపడుతుందనే వారిని సమీక్షలకు పిలవడం లేదని ఆరోపించారు. కల్వకుర్తిలో 3.5 కిలోమీటర్లు తవ్వాల్సిన కాలువను కేవలం అరకిలోమీటరు మాత్రమే తవ్వి, మిగిలిన నిధులను టీఆర్‌ఎస్ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు.