'కేఎల్ఐ ప్రాజెక్టుపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు'
హైదరాబాద్: టీఆర్ఎస్ మేనిఫెస్టో మొదటి అబద్ధాల పుస్తకం అయితే.. రాష్ట్ర బడ్జెట్ రెండో అబద్ధాల పుస్తకమని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2017 ఖరీఫ్ కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు పదే పదే చెబుతూ మోసగిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. హామీ నెరవేరాలంటే బడ్జెట్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఆ మేరకు ఎందుకు నిధుల కేటాయింపు జరపలేదని.. దీంతో కేఎల్ఐ పూర్తి చేయడంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని తెలుస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రూ.1,772 కోట్లు బడ్జెట్ లో కేటాయింపు చేయాల్సింది.. కానీ కేవలం వెయ్యి కోట్లే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ రైతులను ఉరికంబం ఎక్కించేలా ఉందని, మొత్తం బడ్జెట్ లో నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై అనుమానాలు వ్యక్తంచేశారు.
'ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ వ్యవసాయంపై చూపుతున్న నిర్లక్ష్యమే దీనికి కారణం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్చి 8, 2017 వరకు 2,722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీఆర్ వ్యవసాయానికి బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక కేటాయింపులు చేశారు.
పాలకు ప్రోత్సహకాలను నాలుగు రూపాయలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అది అమలు చేయకపోవడం దారుణం. హరీష్ రావు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు. బూటకపు మాటలు చెబుతున్నారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు. జనం తిరగబడి మీ భరతం పట్టె సమయం దగ్గర పడుతోంది' అని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు.