టచ్‌లో టీఆర్‌ఎస్ నేతలు.. త్వరలోనే మాపార్టీలోకి!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గరి కుటుంబసభ్యులు తప్ప టీఆర్‌ఎస్‌లోని చాలామంది నాయకులు టచ్‌లో ఉన్నారని, ఎన్నికలకు ఏడాది ముందుగానే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సోమవారం ఆయన ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడారు.
ఊహించని స్థాయిలో వలసలు!
టీఆర్‌ఎస్ నుంచి ఊహించని స్థాయిలో కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని ఉత్తమ్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు. వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సభలో కనీసం బీజేపీ గురించి మాట్లాడకపోవడంతోనే బీజేపీ బలమేమిటో సీఎం కేసీఆర్ తేల్చారని విశ్లేషించారు. బీజేపీకి ఉత్తరాదిలో కలిసి వచ్చిన ఫార్ములా ఇక్కడ పనిచేయదన్నారు. హిందువులను రెచ్చగొట్టి ఓటింగుతో లాభపడాలనేది బీజేపీ భ్రమ అని, తెలంగాణలో హిందూముస్లింల మధ్య చాలా సఖ్యత ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చిందని, టీఆర్‌ఎస్సే ఎన్నికల మూడ్‌ను తెచ్చిందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అభద్రత
‘అధికారంలో ఉన్నవారు వచ్చే ఏడాది అమలుచేస్తామంటూ హామీలు ఇవ్వడం ఏందీ? అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తామని ప్రతిపక్షాలు చెప్పాయంటే ఒక అర్థముంటుంది. వచ్చే ఏడాది ఎరువులకు ఇస్తామని, వచ్చే ఏడాది కరెంటు ఇస్తామని ఊరించడం ఏమిటి? అధికారంలో ఉన్నవారు నిర్ణయం తీసుకుంటే వెంటనే అమలుచేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అభద్రత, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 లక్షల చొప్పున ఖర్చుపెట్టి వరంగల్‌లో సభ పెడితే ఆ మరునాడే టీఆర్‌ఎస్‌లోనూ సానుకూల చర్చ లేదు. ప్రజల్లో వ్యతిరేకత సీఎం కేసీఆర్‌కు అర్థమవుతున్నది’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓయూలో ముఖ్యమంత్రి, గవర్నరు మాట్లాడకపోవడం రాష్ట్రపతిని అవమానించడమేనని మండిపడ్డారు. రాష్ట్రపతికి ప్రోటోకాల్‌ను పాటించకపోవడం దారుణమన్నారు. ఖమ్మంలో రైతులు కడుపుమండి ఆందోళన చేస్తే రౌడీలు అనడం సీఎం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. ఖమ్మంలో రౌడీలు విధ్వంసాలు చేశారంటున్న ప్రభుత్వం వారి వివరాలు ఎందుకు బయట పెట్టడంలేదని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉండటానికి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పోతుంటే టీఆర్‌ఎస్‌లో భయం పుడుతున్నదని, అందుకే టీఆర్‌ఎస్ కార్యకర్తలతో గొడవలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. మిర్చిని కొనుగోలు చేయకపోవడంతోనే రైతులు ఆవేదన, ఆగ్రహం చెందారని, అసలు వాస్తవాలేమిటో తెలుసుకోలేదని దుస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు.
నా గడ్డం ఒక హాట్ టాపిక్..
ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కేసీఆర్‌కు చెప్పడానికి ధైర్యం చేయడంలేదన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్లు చెప్పేది కూడా వినడానికి కేసీఆర్ ఇష్టపడటంలేదని, కేసీఆర్‌కు వినడానికి ఏది ఇష్టమో అందరూ అదే చెబుతున్నట్టుగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తీరు రానురాను వికృత, వికారంగా తయారవుతున్నదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజల ఆవేదనను పట్టించుకోకుంటే అది తీవ్రమైన ప్రతిఘటనగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నాయకులకు తన గడ్డం ఒక హాట్ టాపిక్‌గా మారిపోయిందన్నారు. పార్టీ అంతర్గత సమావేశాలు, బహిరంగసభలు కూడా తన గడ్డం గురించి మాట్లాడకుండా పూర్తికావడంలేదన్నారు.