మాకు పిల్లల్లేరు.. మాకు అన్నీ తెలంగాణ సమాజమే | Sakshi Special Interview With Uttam kumar Reddy | Sakshi
Sakshi News home page

వచ్చేది మా సర్కారే

Published Tue, Oct 16 2018 1:56 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Sakshi Special Interview With Uttam kumar Reddy

రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆదాయం నెలకు రూ.10,500 కోట్లు. ఇందులో 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు నెలకు రూ.3వేల కోట్ల చొప్పున ఏడాదికి రూ.36వేల కోట్లు అవుతుంది. ఇది అసాధ్యమేమీ కాదు. ఢిల్లీలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా రైతులందరికీ రూ.2లక్షల ఏకకాల రుణమాఫీ మా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌ రాజకీయ జీవితానికి చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉందని.. 9 నెలల ముందే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ప్రజలు పీడ విరగడైందని సంతోషిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను అమలుచేసేందుకు తమ వద్ద స్పష్టమైన అంచనాలున్నాయని ఆయన వెల్లడించారు. ఖజానాకు వస్తున్న ఆదాయంపై ఆర్థిక నిపుణులతో చర్చించాకే హామీలు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ 12న రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందన్నారు. తెలంగాణలో దగుల్బాజీ పాలనను అంతమొందించేందుకు రాజకీయ, రాజకీయేతర శక్తులన్నీ తమతో కలిసి రావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘కేసీఆర్‌ హఠావో, తెలంగాణ బచావో’నినాదంతోనే తమ ఎన్నికల ప్రచారం జరుగుతుందని అన్నారు. తనకు మిలటరీలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఉత్తమ్‌.. చిన్న వయసులోనే రాష్ట్రపతి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అరుదైన గౌరవం దక్కిందన్నారు. తన జీవితాన్ని తెలంగాణ ప్రజల సేవకే అంకితం చేశానని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉత్తమ్‌ వెల్లడించారు. 

ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.. 
సాక్షి: 2019 మార్చిలో రావాల్సిన ఎన్నికలు 2018 డిసెంబర్‌లోనే వచ్చాయి. ఇందుకు మీరే కారణమని ఆయన అంటున్నారు? 
ఉత్తమ్‌: కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఆయన విచిత్రమైన లెక్కలు చెబుతూ.. అకారణంగా శాసనసభను రద్దు చేశారు. ఇప్పుడేదో అర్థరహిత వాదనలు చేస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణ ప్రజల్లో 9 నెలల ముందే పీడ విరగడ అయిందన్న భావన వ్యక్తమవుతోంది. జనం సంతోషంగా ఉన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఒకరిని ఫాంహౌస్‌కు, మరొకరిని అమెరికాకు పంపడం ఖాయమే. మోసపూరిత మాటలు, దగుల్బాజీ పాలన, ధోకేబాజ్‌ చేష్టలు ఇవేవీ తెలంగాణ ప్రజలకు నచ్చవు. కేసీఆర్‌లోని ఈ విషయాలను గమనించే తెలంగాణ ప్రజలు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. 
 
సాక్షి: ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమని కేసీఆర్‌ ధీమాగా చెబుతున్నారు కదా? 
ఉత్తమ్‌: ఆయన సర్వే తెలంగాణలో చేసిండో, మరో రాష్ట్రంలో చేసిండో తెలియదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి 70–75 స్థానాలు తగ్గవు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికలలో మా విజయం తథ్యం. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. 
 
సాక్షి: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన ప్రచారాస్త్రాలేంటి? 
ఉత్తమ్‌: సమాజంలోని అన్ని వర్గాలను కేసీఆర్‌ మోసం చేశాడు. 2014 ఎన్నికల సమయంలో కానీ, అంతకు ముందు పదేళ్ల పాటు ఉద్యమ సమయంలో చెప్పిన ఒక్క మాటను కూడా కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్లు, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికీ నల్లా నీళ్లు.. ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్‌ మాయగాడని, అబద్ధాల కోరని తెలంగాణ ప్రజలకు స్పష్టమయింది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమాగా చెప్తున్నా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తాం. 
 
సాక్షి: మీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? 
ఉత్తమ్‌: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతన్నలకు ఊరట కలిగించడానికి ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధి కల్పనకు చర్యలు చేపడతాం. ఉపాధి కల్పించలేని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. తెలంగాణలోని 6లక్షల మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రతి సంఘానికి రూ.లక్ష గ్రాంటు ఇస్తాం. రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, చేనేత కార్మికుల పింఛన్లను రూ.1000 నుంచి రూ.2000లకు పెంచుతాం. 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛను అమలు చేస్తాం. భార్యాభర్తలిద్దరూ అర్హులయితే ఇద్దరికీ వర్తింపజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులకు కూడా పింఛను ఇస్తాం. వికలాంగుల పింఛనును రూ.1,500 నుంచి రూ.3వేలకు పెంచుతాం. దళితులు, గిరిజనులకు రేషన్‌ ఉచితంగా ఇస్తాం. ఈ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తాం. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 6 ఎల్పీజీ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. సెర్ప్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాం. బీమా మిత్ర, వీఓఏలకు రూ.10వేల వరకు వేతనాలిస్తాం. ఇంకా మా మేనిఫెస్టో కమిటీ పూర్తిస్థాయిలో అన్ని వర్గాల సమస్యలపై అధ్యయనం చేస్తోంది. పూర్తిస్థాయి మేనిఫెస్టో మా ఎన్నికల హామీలను త్వరలోనే ప్రజల ముందు పెడతాం. 
 
సాక్షి: మీ హామీలన్నీ నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్‌ సరిపోదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో మీ అంచనాలు, లెక్కలేంటి? 
ఉత్తమ్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆదాయం నెలకు రూ.10,500 కోట్లు. ఇందులో 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు నెలకు రూ.3వేల కోట్ల చొప్పున ఏడాదికి రూ.36వేల కోట్లవుతుంది. ఇది అసాధ్యమేమీ కాదు. ఢిల్లీలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా రైతులందరికీ రూ.2లక్షల ఏకకాల రుణమాఫీ మా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తుంది. 2019–20 వార్షిక బడ్జెట్‌ 2లక్షల కోట్లు అవుతుంది. కాంట్రాక్టర్ల పేరుమీద దుబారా ఖర్చులు నిలిపివేసి సామాన్య ప్రజానీకానికి బడ్జెట్‌ పంచుతాం. రాష్ట్ర ఖజానాలో ఖర్చు చేసేందుకు సరిపోను డబ్బులున్నాయి. మేం చేసే వాగ్దానాలు ఆర్థిక నిపుణుల కమిటీ పరిశీలన తర్వాతే ఇస్తున్నాం. టీఆర్‌ఎస్‌కు కాంట్రాక్టర్లు ముఖ్యం. మాకు పేద ప్రజలు ముఖ్యం. అంతే తేడా.  
 
సాక్షి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి దూసుకెళ్తున్నారు. మీ సంగతేంటి? 
ఉత్తమ్‌: మా అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడిస్తారు. అయినా, మా అభ్యర్థుల గురించి వారికెందుంత ఆందోళనో అర్థం కావడం లేదు. మా వాళ్లు సరైన సమయంలో వస్తారు.. సునాయాసంగా గెలుస్తారు. సందేహమే అవసరం లేదు. 
 
సాక్షి: మీ కూటమిలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మాత్రమే ఉంటాయా? 
ఉత్తమ్‌: ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌ కుటుంబానికి జరుగుతున్నవిగా మేం భావిస్తున్నాం. తెలంగాణలోని నియంతృత్వ, దుర్మార్గపు పాలనను అంతం చేయాలి. తెలంగాణ ప్రజలూ ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ, రాజకీయేతర శక్తులు, సంఘాలు, పార్టీలు మాతో కలిసిరావాలి. ఈ ప్రయాణంలో కలిసి వచ్చే వారిని కలుపుకుని ముందుకెళ్తాం. కోదండరాం పోటీ చేస్తారా? లేదా? అన్నది మాకు తెలియదు. అది పూర్తిగా టీజేఎస్‌ అంతర్గత విషయం. 
 
సాక్షి: రాహుల్, సోనియా గాంధీల సభలు ఎన్నిచోట్ల, ఎక్కడెక్కడ ఉంటాయి? 
ఉత్తమ్‌: మేం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను 12 భాగాలుగా విభజించాం. ఒక్కో భాగంలో 10 నియోజకవర్గాలున్నాయి. ఆ 12 భాగాల్లో 12 చోట్ల సభలుంటాయి. అందులో 10 సభల్లో రాహుల్, 2 చోట్ల సోనియా పాల్గొంటారు. మా ప్రచార కార్యక్రమంలో ఆ సభలు చాలా కీలకం. మా ప్రచార కమిటీ ద్వారా 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా జరుగుతాయి. తెలంగాణలోని దళితులు, మహిళలు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, రైతులు, రైతు కూలీలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు విద్యాసంస్థలతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ వారిని ఎలా మోసం చేసిందో చెపుతాం. తాము అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపుతామో వివరిస్తాం. ఇదే మా ప్రచార సరళిలో అనుసరించబోయే వ్యూహం. 
 
సాక్షి: ఇటీవలి కాలంలో మీ పార్టీలోకి చేరికలు బాగానే ఉంటున్నాయి. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? 
ఉత్తమ్‌: తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. రాబోయే 10–15 రోజుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి భారీ వలసలుంటాయి. 
 
సాక్షి: మిలటరీలో పనిచేసిన మీరు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? ఎలా ఫీలవుతున్నారు? 
ఉత్తమ్‌: 16 ఏళ్లకే.. పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరాను. ఆ తర్వాత చైనా–పాకిస్తాన్‌ సరిహద్దుల్లో భారతీయ వైమానికదళంలో పనిచేశాను. మిగ్‌–21, మిగ్‌–23 యుద్ధవిమానాల పైలట్‌గా అనేక సంవత్సరాలు దేశరక్షణ కోసం సేవలందించాను. ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి కార్యాలయంలో చిన్నవయసులోనే అత్యంత కీలక బాధ్యతలు వహించే అవకాశం వచ్చింది. ఇది ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నా. అయితే, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే.. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను. 
 
సాక్షి: మీ వ్యక్తిగత కుటుంబ వివరాలు చెప్తారా? 
ఉత్తమ్‌: నేను, నా భార్య పద్మావతి ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మాకు ఏడాదిలో 365 రోజులు, రోజుకు 24 గంటలు ప్రజల మధ్య గడపడమే ఆనందం. మాకు పిల్లల్లేరు. ఈ రాష్ట్ర ప్రజలే మా కుటుంబం. ఈ తెలంగాణ సమాజమే మాకు సర్వస్వం. 
 
సాక్షి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటారా? 
ఉత్తమ్‌: నాకలాంటి ఆలోచన ఏమీ లేదు. ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు ఆమోదయోగ్యమే. 
 
సాక్షి: తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పదల్చుకున్నారు? 
ఉత్తమ్‌: తెలంగాణను దగా చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. అణగారి వర్గాలు, సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు మేలు చేసే కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని కోరుతున్నా. ‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’అన్నదే మా ప్రధాన నినాదం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement