పేదలు బాగుండడం ఇష్టంలేకే పాదయాత్ర
పేదలు బాగుండడం ఇష్టంలేకే పాదయాత్ర
Published Sat, Oct 22 2016 6:45 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
హైదరాబాద్: రెండున్నరేళ్ళుగా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధిఫలాలు అడవి బిడ్డలకు అందుతుండడం చూసి ఓర్వలేకనే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు యాత్రలు, దీక్షల పేరుతో కుట్రపూర్తి రాజకీయాలకు పాల్పడుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చే అంశంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన ఖండించారు.
టీఆర్‌ఎస్ ఎల్పీలో శనివారం ఆయన ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతీ రాథోడ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా మార్చే అంశం టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉందని, 1538 తండాలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మారుస్తామన్నారు. తెలంగాణ వద్దని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లొల్లి చేసిన సీపీఎం నేతలకు ఇప్పుడు తెలంగాణపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీపీఎంది ఓడిపోయిన చరిత్ర అని, ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఏకైక భద్రాచలం ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
గిరిజనులకు ఏం కావాలో వారి మనసెరిగి నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. తమ్మినేని ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క గిరిజన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేక పోయారని ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. తెలంగాణపై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తున్న తమ్మినేని, ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను అక్రమంగా ఏపీలో కలిపినప్పుడు ఎందుకు నోరుమెదప లేదని ప్రశ్నించారు. వామపక్షాల సామాజిక న్యాయంపై చర్చ జరగాల్సిందేనని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. తన లాంటి పేద వర్గానికి చెందిన వారికి చోటు లేదని భావించాకే సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు.
Advertisement
Advertisement