సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కునారిల్లిపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం 3.4 శాతం అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా లేకపోవడం, ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురవడం, రబీ, ఖరీఫ్ పంటలకు రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉండడం పంటల దిగుబడికి ఎంతో కలసి వచ్చింది. కరోనా కాటుకు వలస కార్మికులు ఇళ్లకు తిరగి రావడం, జీవనోపాధికోసం వారు కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం కూడా రైతులకు కలసి వచ్చిందని జాతీయ వ్యవసాయ ఆర్థిక వేత్త, ఇందిరాగాంధీ అభివద్ధి, పరిశోధన సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న సుధా నారాయణన్ తెలిపారు. కరోనా కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడం, పంట దిగుబడులకు ఆశించిన ధరలు లభించ లేదని ఆమె చెప్పారు. ఈసారి కూడా చాలా చోట్ల గిట్టుబాటు ధరలు లేక టన్నుల కొద్ది టమోటా రోడ్ల పాలయింది.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాల క్రితం రోడ్డెక్కిన రైతులు ఇంకా రోడ్లపైనే ఉన్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడేమో కొత్త చట్టాలతో చిన్న కారు, సన్నకారు రైతుల నోటి కాడ కూడును కొట్టేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి కలిగిన చిన్నకారు రైతులే ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు. దేశం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 44.2 శాతం మంది ఒక్క వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు.
ఈ ఏడాది దేశంలో 88 శాతం మంది రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్మలేక పోయారు. 37 శాతం రైతులు అసలు పంటలే వేయలేకపోయారు. 15 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు కూడా తరలించలేక వదిలేశారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ‘పీఎం–కిసాన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. దేశంలో 14 కోట్ల మంది రైతులుండగా కేవలం ఆ స్కీమ్ 8 కోట్లకు మాత్రమే పరిమితమవుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి లోతుగా అధ్యయనం చేసే స్థితిలో కూడా రైతులు లేరు
Comments
Please login to add a commentAdd a comment