► ఎస్‌ఐ సెలక్షన్లలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు
► పెద్ద దేవలాపురం యువకుడి ప్రతిభ
► తల్లిదండ్రుల ఆనందోత్సాహం
నంద్యాల: సామాన్య రైతు చిన్న లక్ష్మన్న కుమారుడు పెద్దినేని ప్రవీణ్ కుమార్ ఎస్‌ఐ సెలక్షన్లలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును సాధించారు. దీంతో స్వగ్రామం పెద్దదేవలాపురం ఆనందోత్సవంలో మునిగింది. ఎస్‌ఐ సెలక్షన్లకు సంబంధించి రాత పరీక్ష నిర్వహించాక ఎంపిక జాబితాను గురువారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రవీణ్ కుమార్ రెండో ర్యాంకును సాధించారు. బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్.. స్వగ్రామంలో ప్రాథమిక, సంతజూటూరులో హైస్కూల్ విద్యను పూర్తిచచేశాడు.
నంద్యాలలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి ఎంసెట్‌లో ఇంజనీరింగ్ సీటును సాధించాడు. చిత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో పూర్తి చేశాడు. ఎస్‌ఐ కావాలనే పట్టుదలతో హైదరబాద్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో సివిల్, మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సాధించాడు. ఫలితాలను చూసిన చిన్నలక్ష్మన్న కుటుంబం సంబరాలు చేసుకుంది. గ్రామస్తులంతా ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేయాలనే పట్టుదలతో బీటెక్ పూర్తి చేసినా ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ రాశానన్నారు. తొలిసారే తనకు రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో మంచి మార్కులు వచ్చి ఎంపికయ్యానని చెప్పారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లనే తాను ఈ ఘనత సాధించానన్నారు. నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి ఆయనను ఫోన్‌లో అభినందించారు.