రైతన్న నిరశన విజయవంతం | Farmers Union Leaders Hunger Strike Against Farm Laws | Sakshi
Sakshi News home page

రైతన్న నిరశన విజయవంతం

Published Tue, Dec 15 2020 4:46 AM | Last Updated on Tue, Dec 15 2020 8:17 AM

Farmers Union Leaders Hunger Strike Against Farm Laws - Sakshi

సోమవారం ఢిల్లీ శివారులోని తిక్రీ బోర్డర్‌ వద్ద నిరాహార దీక్షలో పాల్గొన్న రైతులు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం రైతులు చేపట్టిన ఒక రోజు నిరశన దీక్ష విజయవంతమైంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద 32 రైతు సంఘాల నాయకులు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోనూ నిరశన దీక్షలు జరిగాయని రైతు నేతలు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 18 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత 18 రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొంటున్న 20 కి పైగా నిరసనకారులు మరణించారు. వారికి నివాళిగా సోమవారం ఉదయం రైతు నేతలు, నిరసనకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా రైతు నిరశన దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆప్‌ కార్యాలయంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. కొత్త సాగు చట్టాలు కొందరు కార్పొరేట్లకే ప్రయోజనకరమని, వాటి వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదముందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆ చట్టాలు రైతులకు, సామాన్యులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారని రైతు నేతలు తెలిపారు. ‘ఇది కేవలం పంజాబ్‌ రైతుల నిరసన కాదు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నిరసన ప్రదర్శన అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘం నేత శివ కుమార్‌ కక్కా పేర్కొన్నారు. నిరశన దీక్ష ముగిసిన తరువాత కూడా సింఘు సహా నిరసన కేంద్రాల్లో నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన కొనసాగాయి. ‘అన్నదాత ఇప్పుడు ఆకలితో నిరసనలో పాల్గొంటున్నాడన్న సందేశం దేశ ప్రజలకు ఇవ్వడానికే ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టాం’ అని మరో రైతు సంఘం నేత హరిందర్‌ సింగ్‌ లోఖావాల్‌ తెలిపారు. మహిళలతో పాటు, మరింత మంది రైతులు నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు రానున్నారని, వారి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.  

మరోవైపు, వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని సోమవారం ‘ఫిక్కీ’ సదస్సులో వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగించేందుకు, మరో విడత చర్చల తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. కచ్చితంగా మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయన్నారు. చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు అంశాలవారీగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. అంతకుముందు, తోమర్‌ హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. అనంతరం, సాగు చట్టాలకు మద్దతిస్తున్న ఆల్‌ ఇండియా కిసాన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులను కలుసుకున్నారు.   

ఆస్ట్రేలియా నుంచి పనిపై వచ్చి..
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి వీలుగా ట్విట్టర్‌ ఖాతా పని చేస్తోంది. ‘ట్రాక్టర్‌2ట్విట్టర్‌’ అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్‌ను ఆస్ట్రేలియాలో పని చేసే ఓ ఐటీ నిపుణుడు క్రియేట్‌ చేసి రైతులకు మద్దతుగా పోస్టులు చేస్తున్నాడు. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన భావ్‌జిత్‌ సింగ్‌ ఆస్ట్రేలియాలో ఐటీ నిపుణుడిగా పని చేస్తున్నారు. గత అక్టోబర్‌లో వ్యక్తిగత పనిపై ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమించడం ప్రారంభమైంది. అయితే ఆ ఉద్యమంపై నకిలీ వార్తలు పుట్టుకొస్తుండటంతో వాటిని తిప్పి కొట్టాలని భావ్‌జిత్‌ నిర్ణయించుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌2ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. నవంబర్‌ 28న ప్రారంభించిన ఈ ట్విట్టర్‌ ఖాతాకు ప్రస్తుతం 10 వేల మందికి పైగా ఫాలోవర్లతో పాటు, 2.5 మిలియన్ల ఇంప్రెషన్లు దక్కాయని ఆయన వెల్లడించారు. హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషల్లో ఫొటోలు, వీడియోలు, న్యూస్‌ పోస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు.

ఘాజీపూర్‌ బోర్డర్‌లో రైతుతో నిరాహార దీక్ష విరమింపజేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికీయత్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement