సాక్షి, ముంబై: తమ హక్కుల కోసం అనేక కష్టనష్టాలకోర్చి 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి విజయం సాధించిన మహారాష్ట్ర రైతులపై బీజేపీ యూత్ వింగ్ చీఫ్, ఎంపీ పూనమ్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రైతులంతా మావోయిస్టులు.. వారిని సమర్థించేవారంతా పట్టణాల్లో నివసించే మావోయిస్టులంటూ’ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించిన వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆమెపై బీజేపీ చర్యలుతీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి.
బీజేపీ నైజమే అంత: జయంత్ పాటిల్(ఎన్సీపీ ఎమ్మెల్యే)
పూనమ్ మహాజన్ వ్యాఖ్యల ద్వారా ప్రజల పట్ల బీజేపీకి ఉన్న వైఖరేంటో మరోసారి బయటపడిందని ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ అన్నారు. ఎవరైనా తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వారిని మావోయిస్టులు, నక్సలైట్లుగా చిత్రీకరించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదని విమర్శించారు. కులం, మతం, సిద్ధాంతాల పేరిట ప్రజలను విభజించడం బీజేపీ నైజమని, దేశానికి స్ఫూర్తినిచ్చిన మహా రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వారిని అవమానించడం పార్టీ విధానాన్ని మరోసారి స్పష్టం చేసిందన్నారు.
అన్నం పెట్టే రైతులను అవమానిస్తారా..?: అశోక్ చవాన్
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ పూనమ్ వ్యాఖలపై స్పందిస్తూ... దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానించడం అమానుషమని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వివాదాలకే ప్రాధాన్యమిస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. పూనమ్ వెంటనే ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment