న్యూఢిల్లీ : ఆచితూచి మాట్లాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితబోధ చేసినప్పటికీ బీజేపీ నాయకుల తీరు మారడం లేదు. గత కొన్ని రోజులుగా పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ‍్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్.. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ప్రధాని మోదీలను బ్రాహ్మణులంటూ అభివర్ణించిన త్రివేది వల్ల పార్టీకి నష్టం కలుగుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజేంద్ర త్రివేది తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘కులం అనేది మనిషి పుట్టుక మీద కాకుండా అతడు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. భవద్గీత ప్రకారం విఙ్ఞానం ఉన్న వ్యక్తులు బ్రాహ్మణులు’ అంటూ త్రివేది వ్యాఖ్యానించారు.
రాముడు క్షత్రియుడు..
ఇటీవల ఒక ఉద్యోగ మేళాలో పాల్గొన్న త్రివేది మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బ్రాహ్మణులు దేవుళ్లను తయారు చేస్తారు. క్షత్రియుడైన రాముడిని, ఓబీసీ అయిన కృష్ణుడిని దేవుడిని చేసింది బ్రాహ్మణులే’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అంబేద్కర్ కూడా బ్రాహ్మణుడేనని, ఆయన ఇంటి పేరు చూస్తే అర్థమవుతుందని.. ఆయనకు ఆ పేరు పెట్టింది కూడా బ్రాహ్మణుడైన ఒక ఉపాధ్యాయుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కూడా బ్రాహ్మణుడని చెప్పడానికి నేను గర్వపడతానంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment