Poonam Mahajan
-
స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్ తలాక్?!
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను మీరు శిక్షిస్తున్నారు.. ‘స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ మీరు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించాలని అనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మీరు సరికొత్త భారతాన్ని నిర్మించాలనే మాటకు కట్టుబడి ఉన్నారా! ట్రిపుల్ తలాక్ సరైంది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. జైలులో ఉన్న భర్త బయటికి వచ్చేదాకా విడాకులు పొందిన ఓ భార్యకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు. భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించి భార్యలను మీరు శిక్షిస్తున్నారు’ అని అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. వాళ్ల కోసమే ఈ బిల్లు.. లోక్‌సభలో చర్చ సందర్భంగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ స్పందించారు. ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య లేదా కూతురు ఒక్క ఫోన్ కాల్ ద్వారా విడాకులు పొందటాన్ని ఒవైసీ సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ‘ వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా విడాకులు ఇచ్చే వాళ్ల కోసమే ఈ బిల్లు. పళ్లు సరిగా లేవని, కూరలో తగినంత ఉప్పు వేయలేదని విడాకులు ఇస్తున్న మహానుభావులను చూస్తూనే ఉన్నాం కదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘తెలంగాణ బిడ్డను.. ఆంధ్రా కోడలిని’
హైదరాబాద్: నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ లక్ష్యం 2019 యువ మహాధివేశన్’ పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి నిన్న(శనివారం) కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలినని తెలిపారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో కమలం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2019లో విజయ లక్ష్యమే మన సంకల్పమని, ఈ సమ్మేళనం ఉద్దేశ్యం కూడా అదేనన్నారు. డిసెంబర్ 11న తెలంగాణలో కమలోదయం జరగనుందని జోస్యం చెప్పారు. -
బీజేవైఎం యువ సమ్మేళనానికి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి యువ సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి 28 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ హైదరాబాద్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 26న అన్ని రాష్ట్రాల నుంచి బీజేవైఎం మండల బాధ్యులు, జిల్లా, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు దాదాపు 2 లక్షల మంది రానున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు వెల్లడించారు. ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి మోగిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో భాగంగా మొదటి రోజు ప్రతినిధుల రాక, రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి సభ్యుడికి క్యూఆర్ కోడ్ కలిగిన కార్డు ఇస్తారు. బార్ కోడ్ రీడ్ చేయగానే ఆయా అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, ఎక్కడ ఏయే సమావేశం ఉంటుందనే వివరాలు, బస ఏర్పాట్ల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ప్రధానంగా నితిన్ గడ్కారీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రాజ్‌ప్రతాప్ రూఢీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొననున్నారు. -
రైతులపై పూనమ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: తమ హక్కుల కోసం అనేక కష్టనష్టాలకోర్చి 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి విజయం సాధించిన మహారాష్ట్ర రైతులపై బీజేపీ యూత్ వింగ్ చీఫ్, ఎంపీ పూనమ్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రైతులంతా మావోయిస్టులు.. వారిని సమర్థించేవారంతా పట్టణాల్లో నివసించే మావోయిస్టులంటూ’ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించిన వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆమెపై బీజేపీ చర్యలుతీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. బీజేపీ నైజమే అంత: జయంత్ పాటిల్(ఎన్సీపీ ఎమ్మెల్యే) పూనమ్ మహాజన్ వ్యాఖ్యల ద్వారా ప్రజల పట్ల బీజేపీకి ఉన్న వైఖరేంటో మరోసారి బయటపడిందని ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ అన్నారు. ఎవరైనా తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వారిని మావోయిస్టులు, నక్సలైట్లుగా చిత్రీకరించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదని విమర్శించారు. కులం, మతం, సిద్ధాంతాల పేరిట ప్రజలను విభజించడం బీజేపీ నైజమని, దేశానికి స్ఫూర్తినిచ్చిన మహా రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వారిని అవమానించడం పార్టీ విధానాన్ని మరోసారి స్పష్టం చేసిందన్నారు. అన్నం పెట్టే రైతులను అవమానిస్తారా..?: అశోక్ చవాన్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ పూనమ్ వ్యాఖలపై స్పందిస్తూ... దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానించడం అమానుషమని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వివాదాలకే ప్రాధాన్యమిస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. పూనమ్ వెంటనే ఆమె వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని’
హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎంలతో సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిన్ మే కాంగ్రెస్.. రాత్ మే ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో ‘నిరుద్యోగుల సమరభేరి‘ పేరిట బీజేవైఎం ఆదివారం భారీ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూనం మహాజన్ ... తెలంగాణ యువకుల స్వప్నాలను కేసీఆర్ నీరుగార్చారని మండిపడ్డారు. ఆయన తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. అధికార టీఆర్ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జనవరిలో జరిగే ర్యాలీలో బైక్ పై తానే ముందుంటానని పూనమ్ తెలిపారు. నిజాంను కేసీఆర్ పొగడటాన్ని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. కేసీఆర్..కలెక్టర్ ఆఫీస్‌లు వచ్చాయి.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ అని పూనం మహాజాన్ సూటిగా ప్రశ్నించారు. క్యా హువా తేరా వాదా అని బీజేవైఎం కేసీఆర్ ను నిలదీస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఢమరుకం వాయించి సమరభేరి మోగించి కార్యకర్తలను పూనమ్ ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రభుత్వంతో ఫైట్‌కు రెడీ నా అంటూ కార్యకర్తలను అడిగారు. తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని అని తెలిపారు. తెలంగాణ ఖుష్భు మహాజన్ రక్తంలో ఉందన్నారు. తెలంగాణ సర్కార్ పై ఈ సభ యుద్ధ భేరి అని తెలిపారు. కాగా పూనం మహాజన్ మహారాష్ట్రలో పుట్టినప్పటికీ తెలంగాణకు చెందిన ... వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లను వివాహం చేసుకున్నారు. అలాగే ఆనంద్‌రావు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. -
నేనూ లైంగిక వేధింపులకు గురయ్యాను
సాక్షి, ముంబై : ‘నేను కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవ్యక్తినే.. నేనేంటి భారతదేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సంమయంలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంద’ని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పూనమ్ మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. మరింత ధైర్యంగా, ధృఢంగా మారాలని చెప్పారు. ‘నేను కాలేజ్‌కి వెళ్లే రోజుల్లో వెర్సో నుంచి వర్లీ వరకూ లోకల్ ట్రైన్లో వెళ్లేదాన్ని.. అప్పట్లో నా చుట్టు ఉన్నవ్యక్తులు.. నన్ను అసభ్యకరంగా చూసేవారు. కొన్ని సందర్భాల్లో స్పృశించే ప్రయత్నాలు చేశారు. నేనేంటి ప్రపంచంలోని ప్రతి మహిళకు ఇటువంటి అనుభవాలు ఉంటాయ’ని ఆమె అన్నారు. -
రజనీకాంత్‌తో పూనమ్ మహాజన్ భేటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ ఆదివారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చలో సెక్రటేరియ ట్ ఆందోళన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలి హోదాలో పాల్గొనేందుకు ఆదివారం ఆమె చెన్నైకి చేరుకున్నారు. అరగంటసేపు ఆమె రజనీతో భేటీ అయ్యారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీని బీజేపీలోకి ఆహ్వా నించే ప్రయత్నాల్లో భాగంగానే పూనమ్ ఆయనను కలుసుకున్నారని తెలుస్తోంది. -
రజనీతో బీజేపీ ఎంపీ భేటీ
సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు పూనమ్ మహాజన్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను పోయస్గార్డెన్లో కలుసుకున్నారు. బీజేపీ యువజన విభాగం అధ్వర్యంలో సోమవారం జరిగిన ఛలో సెక్రటేరియట్ ఆందోళన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలి హోదాలో పాల్గొనేందుకు ఆదివారం ఆమె చెన్నైకి చేరుకున్నారు. సుమారు అరగంటసేపు రజనీతో భేటీ అయ్యారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఎంపీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్‌ను బీజేపీలో ఆహ్వానించే ప్రయత్నాల్లో భాగంగానే పూనమ్ ఆయన్ను కలుసుకున్నారని సమాచారం. సమావేశం అనంతరం పూనమ్ మహాజన్ ట్విట్టర్లో రజనీ దంపతులను కలుసుకునే అవకాశం దక్కింది అంటూ మాత్రమే ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 22వ తేదీ నుంచి మూడురోజుల తమిళనాడు పర్యటనలో రజనీని కలుసుకోవడం కూడా ఒక భాగమని తెలుస్తోంది. -
పూనమ్.. ఇదేం చోద్యం?
జాబల్పూరు: మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం బినా-భోపాల్ ప్రత్యేక రైలులో ఆమె ప్రయాణించడంపై వివాదం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మే 31న జరిగిన మహారాష్ట్ర సాగర్ జిల్లాలోని బినాలో జరిగిన కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన కోసం భోపాల్ నుంచి పశ్చిమమధ్య రైల్వే ప్రత్యేక రైలు పంపింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇదే రైలులో భోపాల్ వెళ్లాల్సివుంది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలో వెళ్లాలనుకున్నారు. అయితే కార్యక్రమం ఆలస్యంగా పూర్తికావడంతో ఆయన బినా నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో వెళ్లిపోయారు. అయితే బీజేపీ పూనమ్ మహాజన్ ప్రత్యేక రైలులో బినా నుంచి భోపాల్ కు వెళ్లారు. దీనిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. రైల్వే మంత్రి కోసం పంపిన ప్రత్యేక రైలులో ప్రయాణించి ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అయితే పూనమ్ ప్రత్యేక రైలులో ప్రయాణించడం యాధృచ్చికంగా జరిగిందని, ఆమెను వీఐపీగా చూడలేదని పశ్చిమమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రమేశ్ చంద్రా తెలిపారు. ఎంపీలకు ప్రత్యేక రైళ్లు నడపరాదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. -
ఇంకా 56 మంది ఉన్నారు!
ఈ ఐదుగురు ఎంపీలు శాంపిల్! లోక్‌సభలో ఇంకా 56 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. వాళ్లందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అవకాశం వస్తే ఎలా మాట్లాడతారో.. వీళ్లైదుగురూ మాట్లాడి చూపించారు! ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. ముఖం ఇంతైంది! ‘అరె..వా!’ అన్నారు. బడ్జెట్లో మగ ఎంపీలు రాజకీయాలు చూస్తే..మహిళా ఎంపీలు లెక్కలు సరి చూశారు. సరి చేశారు. ఒకటి నిజం. ముగ్గేసి, దీపం పెట్టిన ఇల్లు.. గర్భగుడి. మహిళలు మాట్లాడని సభ.. మొక్కుబడి. కల్వకుంట్ల కవిత, బుట్టా రేణుక, పూనమ్ మహాజన్, సాధ్వి సావిత్రిబాయి ఫూలే, హీనా గవిట్... ఈ అయిదుగురు ఎంపీలు... ఆర్థికాంశాల మీద మహిళలకు ఎంత అవగాహన ఉంటుందో, భావ వ్యక్తీకరణలో ఎంతటి స్పష్టత ఉంటుందో, ఎంత నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉంటారో నిరూపించారు. మొన్న లోకసభలో సాధారణ బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఈ అయిదుగురు ఎంపీలు చేసిన ప్రసంగం తోటి సభ్యులను, ముఖ్యంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని చాలా ఆకట్టుకుందట. ఈ విషయాన్ని జైట్లీనే స్వయంగా పార్లమెంటులో అందరి ముందూ చెప్పారు. ‘పురుషులు రాజకీయపరమైన ప్రసంగాలకు ప్రాధాన్యమిస్తే మహిళా ఎంపీలు మాత్రం తగు గణాంకాలను ఉటంకిస్తూ సరైన అంశాల మీద స్పందించారు. సమస్యలను ప్రస్తావించారు’ అంటూ ఈ అయిదుగురు ఎంపీలను జైట్లీ ప్రశంసించారు. అరుణ్జైట్లిని అంతగా అబ్బురపరిచిన ఈ అయిదుగురి నేపథ్యం కూడా సామాన్యమైనదేమీ కాదు. ఆయన చెప్పినట్టు రాజకీయాలంటే అవగాహన, ప్రజల సమస్యల మీద లోతైన అధ్యయనం చేసే పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. వీళ్ల వెనక రాజనీతిజ్ఞులైన వాళ్ల తండ్రులున్నప్పటికీ ఈ తనయలు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీళ్ల వివరాలు.. సంక్షిప్తంగా.. బుట్టా రేణుక (44) బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. ఇంటర్ వరకు చదివిన రేణుక... దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికన్నా ధనవంతురాలు. ఈమె ఆస్తి విలువ మొత్తం 300 కోట్ల రూపాయలు. రేణుక భర్త బుట్టా నీలకంఠం తెలుగుదేశం పార్టీ సభ్యుడు. రేణుక రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా ఉన్నారు. మెరిడియన్ స్కూల్ నిర్వహణా బాధ్యతలూ ఆమెవే. హోటల్స్, రిటైల్ వ్యాపారరంగంలోనూ భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. సమాజానికి మరిన్ని సేవలందించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి ప్రాధాన్యం ఇవ్వాలని రేణుక అంటారు. కల్వకుంట్ల కవిత (38) నిజామాబాద్ నియోజకవర్గ ఎంపి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, తెలంగాణరాష్ట్రసమితి సభ్యురాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. 2015లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చీఫ్ కమిషనర్‌గా ఎన్నికయ్యారు. కరీంనగర్లో జన్మించారు. ప్లస్ టూ వరకు హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదివిన కవిత తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూర్తి చేశారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిసిసిప్పిలో మాస్టర్స్ చేయడానికి చేరారు కానీ మధ్యలోనే ఆపేశారు. ఎప్పటికైనా ఎమ్మెఎస్ పూర్తిచేయాలనేది ఆమె లక్ష్యం. అంతేకాదు కెమిస్ట్రీ అంటే అమితాసక్తి ఉన్న కవిత కెమిస్ట్రీలో కూడా మాస్టర్స్ చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. తెలంగాణ, జమ్ముకశ్మీర్ ప్రజల సమస్యల సాధనలో తనూ భాగం పంచుకోవాలనే ఆశతో ఉన్నారు. లోక్‌సభలో తెలంగాణ సమస్యల మీద తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. హీనా గవిట్ (28) వృత్తిరీత్యా డాక్టర్ అయిన హీనా ప్రముఖ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, నండుర్బార్ అసెంబ్లీ అభ్యర్థి విజయ్‌కుమార్ గవిట్ కూతురు. 28 ఏళ్ల హీనా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున నండూర్‌బార్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ప్రత్యర్థి అభ్యర్థి, ఇండియన్ నేషనల్‌కాంగ్రెస్ నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన మాణిక్‌రావు హోడ్ల్యాను ఓడించారు. సాధ్వి సావిత్రిబాయి ఫూలే (35) బహారైచ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు. సావిత్రి బాల్యవివాహ బాధితురాలు. ఆరేళ్లకే ఆమెకు పెళ్లిచేశారు. 1995, డిసెంబర్ 16న జరిగిన ఓ ధర్నాలో పాల్గొని బుల్లెట్ గాయానికి గురయ్యారు. లక్నో జైలుకీ వెళ్లారు. అప్పుడే నిర్ణయించుకున్నారు తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేయాలని. జైలు నుంచి బయటకు వచ్చాక... తన తండ్రిని, అత్తమామలను పిలిచి చెప్పారు.. వైవాహిక బంధం నుంచి తాను బయటపడి సామాజికసేవా కార్యకర్తగా బతకాలనుకుంటున్నానని. అంతా షాక్ అయ్యారు. అయినా నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆమె. వెంటనే ఆమె కుటుంబసభ్యులు సావిత్రి చెల్లెలిని ఆమె భర్తకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి సావిత్రి సాధ్వి సావిత్రిబాయి ఫూలేగా మారారు. బహరైచ్లోని జన్ సేవా ఆశ్రమంలో చేరారు. ఆమె రాజకీయ జీవితం కూడా అంతే నాటకీయంగా మొదలైంది. తను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు 480 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. కానీ పాఠశాల సిబ్బంది ఆ మొత్తాన్ని తమ దగ్గరే పెట్టుకున్నారు సావిత్రికి ఇవ్వకుండా. విషయం తెలిసిన సావిత్రి నిలదీస్తే సహించని పాఠశాల యాజమాన్యం 3 ఏళ్లు ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. 480 రూపాయల స్కాలర్ షిప్ మీద, చదువుకునే తన హక్కు మీద తను చేసిన పోరాటమే తనలో నేతను, రాజకీయ మహిళను మేల్కొపింది అంటారు సావిత్రి. తన నియోజకవర్గంలో సరైన రహదారులు, మంచినీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు కల్పించడమే ఎంపీగా తన తక్షణ కర్తవ్యం అంటారు. ప్రజలందరికీ ఉద్యోగవకాశాలు రావాలంటే పారిశ్రామికీకరణ ఒక్కటే మార్గం అంటారు. 2012లో ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ జిల్లా బాల్హ అసెంబ్లీస్థానానికి భారతీయ జనతాపార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు సావిత్రి. ఆ తర్వాత 2014 లోకసభ ఎన్నికల్లో బహరైచ్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. సావిత్రి ఎమ్మే చదువుకున్నారు. పూనమ్ మహాజన్ (35) దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు. ముంబై నార్త్ సెంట్రల్ పార్లమెంట్ నియోజక అభ్యర్థి. భారతీయజనతాపార్టీ సభ్యురాలు. 2006లో తన తండ్రి హత్యకు గురవడంతో ఆయన వారసత్వంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. మేనమామ గోపీనాథ్‌ముండే ప్రోత్సాహంతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. బ్రైట్ఆన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. -
షారుఖ్ బంగ్లా వద్ద ర్యాంప్ తొలగించండి:ఎంపీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాకు సమీపంలో అక్రమంగా నిర్మించిన ర్యాంప్ ను తొలగించాల్సిందిగా బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సుబర్బన్ బంద్రాలో షారుఖ్ బంగ్లాకు దగ్గరగా ఒక సిమెంట్ రోడ్డుపైన ఉన్న ర్యాంప్ తమకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిందని వారు ఎంపీకి తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ పూనమ్ ఇటీవల బ్రిహ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సీతారాం కుంతేకు లేఖ రాశారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలంటూ ఆమె కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇది ఆ బంగ్లా యజమాని తన ప్రైవేటు వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తున్నట్లు తెలిపారు. -
ఐదుగురే ‘మహా’రాణులు
ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన 58 మంది మహిళల్లో కేవలం ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. అయితే గతసారితో పొల్చుకుంటే ఈసారి అతివల సంఖ్య మరో రెండుకు పెరిగింది. భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం...రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 897 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 58 మంది మహిళలు ఉన్నారు. ఉత్తర మధ్య ముంబై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని పూనమ్ మహాజన్, బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే, నందూర్బార్ నుంచి బీజేపీ అభ్యర్థి హీనా గావిత్, రవేర్ నుంచి బీజేపీ అభ్యర్థి రక్షా ఖడ్సే, యావత్మల్-వాషీమ్ స్థానం నుంచి శివసేనకు చెందిన భావనా గావ్లీ విజయం సాధించారు . వీరిలో నలుగురు మహిళలు ప్రముఖ రాజకీయ కుటుంబానికే చెం దినవారే కావడం విశేషం. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, రాష్ట్ర మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిత్ కుమార్తె హీనా గావిత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సే ప్రత్యర్థులపై మంచి విజయాలు నమోదుచేశారు. పదోసారి గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గవిత్‌ను హీనా గవిత్ ఓడించి సంచలనం సృష్టించారు. శాతాల వారీగా లెక్కిస్తే ఈ ఎన్నికల్లో 6.46 శాతం మంది మహిళలు బరిలోకి దిగితే 0.55 శాతం మందిని విజయం వరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 55 మంది మహిళలు బరిలోకి దిగగా కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు. యావత్మల్-వాషీమ్ లోక్‌సభ స్థానం నుంచి భావన గావ్లీ(శివసేన), ఉత్తర మధ్య ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్, బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే విజయదుంధుబి మోగించారు. అన్ని అసెంబ్లీలతో పాటు లోక్‌సభలో 33 శాతం సీట్లు అతివలకు కేటాయించడానికి సంబంధించిన మహిళా బిల్లు ఇంకా పార్లమెంట్లో పెండింగ్‌లోనే ఉంది. అయితే ఈ బిల్లును 2010, మార్చి తొమ్మిదిన రాజ్యసభ ఆమోదించింది.