ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన 58 మంది మహిళల్లో కేవలం ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. అయితే గతసారితో పొల్చుకుంటే ఈసారి అతివల సంఖ్య మరో రెండుకు పెరిగింది. భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం...రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 897 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 58 మంది మహిళలు ఉన్నారు. ఉత్తర మధ్య ముంబై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని పూనమ్ మహాజన్, బారామతి నుంచి ఎన్‌సీపీ అభ్యర్థి సుప్రియా సూలే, నందూర్బార్ నుంచి బీజేపీ అభ్యర్థి హీనా గావిత్, రవేర్ నుంచి బీజేపీ అభ్యర్థి రక్షా ఖడ్సే, యావత్మల్-వాషీమ్ స్థానం నుంచి శివసేనకు చెందిన భావనా గావ్లీ విజయం సాధించారు
. వీరిలో నలుగురు మహిళలు ప్రముఖ రాజకీయ కుటుంబానికే చెం దినవారే కావడం విశేషం. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, రాష్ట్ర మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిత్ కుమార్తె హీనా గావిత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సే ప్రత్యర్థులపై మంచి విజయాలు నమోదుచేశారు. పదోసారి గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్‌రావ్ గవిత్‌ను హీనా గవిత్ ఓడించి సంచలనం సృష్టించారు. శాతాల వారీగా లెక్కిస్తే ఈ ఎన్నికల్లో 6.46 శాతం మంది మహిళలు బరిలోకి దిగితే 0.55 శాతం మందిని విజయం వరించింది.
2009 లోక్‌సభ ఎన్నికల్లో 55 మంది మహిళలు బరిలోకి దిగగా కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు. యావత్మల్-వాషీమ్ లోక్‌సభ స్థానం నుంచి భావన గావ్లీ(శివసేన), ఉత్తర మధ్య ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్, బారామతి నుంచి ఎన్‌సీపీ అభ్యర్థి సుప్రియా సూలే విజయదుంధుబి మోగించారు. అన్ని అసెంబ్లీలతో పాటు లోక్‌సభలో 33 శాతం సీట్లు అతివలకు కేటాయించడానికి సంబంధించిన మహిళా బిల్లు ఇంకా పార్లమెంట్‌లో పెండింగ్‌లోనే ఉంది. అయితే ఈ బిల్లును 2010, మార్చి తొమ్మిదిన రాజ్యసభ ఆమోదించింది.
ఐదుగురే ‘మహా’రాణులు
Published Sun, May 18 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement