సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి యువ సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి 28 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ హైదరాబాద్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 26న అన్ని రాష్ట్రాల నుంచి బీజేవైఎం మండల బాధ్యులు, జిల్లా, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు దాదాపు 2 లక్షల మంది రానున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు వెల్లడించారు.
ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి మోగిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో భాగంగా మొదటి రోజు ప్రతినిధుల రాక, రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి సభ్యుడికి క్యూఆర్ కోడ్ కలిగిన కార్డు ఇస్తారు. బార్ కోడ్ రీడ్ చేయగానే ఆయా అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, ఎక్కడ ఏయే సమావేశం ఉంటుందనే వివరాలు, బస ఏర్పాట్ల వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాటు చేశారు.
27వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ప్రధానంగా నితిన్ గడ్కారీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రాజ్‌ప్రతాప్ రూఢీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment