ఉన్మాదులను తలదన్నే రీతిలో బీజేవైఎం కార్యకర్తల వీరంగం
పార్టీ కార్యాలయం గేటు దూకి లోనికి వెళ్లే ప్రయత్నం
రాళ్లు, రంగు ప్యాకెట్లు విసురుతూ వికృతానందం
నిలువరించబోయిన పోలీసులు, భద్రతా సిబ్బందిపైనా దాడి
పోలీసు అవుట్ పోస్టు అద్దాలు ధ్వంసం
చివర్లో తాపీగా వచ్చిన పోలీసులు
అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, అమరావతి/భవానీపురం: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రెచ్చిపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై ఆదివారం దాడికి తెగబడ్డారు. రాళ్లు, రంగు డబ్బాలు విసురుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఉన్మాదులను తలదన్నే రీతిలో వీరంగమాడారు. నిలువరించబోయిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై సైతం దాడికి యత్నించి పోలీసు ఔట్ పోస్టు అద్దాలను ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి విదితమే. తాము కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని.. తమకంటూ సిద్ధాంతాలు లేవనే రీతిలో బీజేవైఎం కార్యకర్తలు ఉదయం 11.30 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీకి ప్రధాన కార్యాలయంపైకి దాడికి సాహసించారు.
చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాలను గ్రహించకుండా గుంపు కట్టి నినాదాలు చేస్తూ రాళ్లు విసిరారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయ గోడలు, తలుపులపై రంగు ప్యాకెట్లు చల్లారు. మూసివున్న గేట్లు ఎక్కి లోపలకు దూకేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు కూర్చుని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగు ప్యాకెట్లను పార్టీ కార్యాలయం లోపలకు విసరగా అవి లోపల వైపున ఉన్న సెక్యూరిటీ గదికి సమీపంలో పడ్డాయి.
సుమారు 20 మందికిపైగా యువమోర్చా కార్యకర్తలు దాడికి యత్నించడంతో పాటు కార్యాలయం దగ్గర వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీని చించి తగులపెట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం తాపీగా వచ్చిన పోలీసులు ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ దారిలోనే బీజేవైఎం
గడచిన వంద రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరి స్థాయిలో వారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుండటంతో బీజేవైఎం కూడా అదే దారిపట్టింది. ఈ దాడులు చూస్తేంటే ఏపీలో ఉన్నామా? బీహార్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన దాడిపై తాడేపల్లి పోలీసులకు వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఈశ్వర్, ఆర్‌ఎస్‌ఐ వీరేష్, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, డి.ఖాజాలను దుర్భాషలాడుతూ పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు తెలిపారు.
బీజేవైఎం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన బీజేవైఎం కార్యకర్తల ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇళ్లపై దాడులు చేసేస్థాయి నుంచి పార్టీ కార్యాలయంపై దాడులు చేసే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందన్నారు. చంద్రబాబు డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేక భావం ఉందని, అందుకే దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం ప్రపంచమంతా చూసిందని, దీనిని పవన్ ఖండించకపోగా ప్రాయశ్చిత దీక్ష చేస్తుండటం సిగ్గుచేటన్నారు. కాగా, బీజేపీ ముసుగులో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దాడి సరికాదు: సీపీఎం
తిరుమల లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగాఖండించింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ్ పరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment