
హైదరాబాద్: నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ లక్ష్యం 2019 యువ మహాధివేశన్’ పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి నిన్న(శనివారం) కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలినని తెలిపారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో కమలం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2019లో విజయ లక్ష్యమే మన సంకల్పమని, ఈ సమ్మేళనం ఉద్దేశ్యం కూడా అదేనన్నారు. డిసెంబర్ 11న తెలంగాణలో కమలోదయం జరగనుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment