బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ చెన్నై పోయస్‌గార్డెన్‌లో నివాసంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకున్నారు
సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు పూనమ్ మహాజన్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను పోయస్‌గార్డెన్‌లో కలుసుకున్నారు. బీజేపీ యువజన విభాగం అధ్వర్యంలో సోమవారం జరిగిన ఛలో సెక్రటేరియట్ ఆందోళన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలి హోదాలో పాల్గొనేందుకు ఆదివారం ఆమె చెన్నైకి చేరుకున్నారు. సుమారు అరగంటసేపు రజనీతో భేటీ అయ్యారు.
రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఎంపీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్‌ను బీజేపీలో ఆహ్వానించే ప్రయత్నాల్లో భాగంగానే పూనమ్ ఆయన్ను కలుసుకున్నారని సమాచారం. సమావేశం అనంతరం పూనమ్ మహాజన్ ట్విట్టర్లో రజనీ దంపతులను కలుసుకునే అవకాశం దక్కింది అంటూ మాత్రమే ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 22వ తేదీ నుంచి మూడురోజుల తమిళనాడు పర్యటనలో రజనీని కలుసుకోవడం కూడా ఒక భాగమని తెలుస్తోంది.