మధుర : నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలకు విస్తృతమైన పబ్లిసిటీ లభిస్తోందన్న ఆమె.. గతంలో వాటిని ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన హేమా మాలిని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రస్తుతం మహిళలపై, మైనర్లపై జరుగుతున్న అఘాత్యాలు బోలెడంత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. నిజానికి గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ, వాటి గురించి మీడియా కనీసం ప్రస్తావించ లేదు. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే కాసేపటికే ఆమె దిద్దు బాటు చర్యలకు దిగారు. ‘ఇలాంటి ఘటనలు బాధాకరం. మళ్లీ జరగకూడదనే కోరుకుంటున్నా. అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇతర దేశాల దృష్టిలో మన ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’ అని ఆమె తెలిపారు.
హేమా మాలిని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఆ వ్యాఖ్యలు ఎలా చేయగలిగారని? ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని.. పలువురు మండిపడుతున్నారు. కాగా, ప్రస్తుతం కథువా, ఉన్నావో, సూరత్‌లో జరిగిన మైనర్‌లపై దాష్టీకాలు చర్చనీయాంశంగా మారింది తెలిసిందే. మరోపక్క జమ్ము కశ్మీర్ విద్యాశాఖ మంత్రి కథువా ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను స్కూళ్లకు పంపించకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేయటం విమర్శలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment