rabhi season
-
‘మక్క’ల్లో మస్తు తిన్నరు!
సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్‌ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్‌ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు. 100 గోదాముల్లో నిల్వలు... గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్‌ఫెడ్‌కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. (చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!) రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా మొన్నటి వరకు మార్క్‌ఫెడ్‌లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్‌లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. (చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం) మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్‌ఫెడ్ ‘ఈ–టెండర్లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. -
తరలివచ్చిన జలతరంగిణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది. చరిత్రలో తొలిసారి.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్–1 కింద 9.6 లక్షలు, స్టేజ్–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్‌లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్–1 కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన స్టేజ్–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్ టు హెడ్ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి. పునరుజ్జీవంతో మరింత మేలు.. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో) సంవత్సరం వచ్చిన వరద నీటి వినియోగం 2009–10 27.34 13.61 2010–11 308.82 57.96 2011–12 174.20 33.67 2012–13 54.73 27.38 2013–14 320 56.60 2014–15 14.77 4.11 2015–16 4.42 1.61 2016–17 356.26 43.47 2017–18 75.31 33.42 2018–19 77.17 17.10 2019–20 159 69 -
సేద్యానికి ‘చంద్ర’గ్రహణం
పరిహారంపై సన్నగిల్లుతున్న ఆశలు గత ఏడాది డిసెంబర్లో కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లా కరువు తీవ్రతను గుర్తించింది. జిల్లాలో 6.77 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6.95 లక్షల మంది రైతులకు రూ.937.40 కోట్లు పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. మొత్తమ్మీద గత ఏడాది పంట పెట్టుబడులు, దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే జిల్లా రైతులకు రూ.3,600 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం రూ.937 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా ఆమోదం తెలపకపోవడంతో పరిహారంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రబీదీ అదే దుస్థితి ఖరీఫ్ 2018 కల్లోలం కాగా కనీసం ఆదుకుంటుందనుకున్న రబీ కూడా దారుణంగా దెబ్బతీసింది. 77 వేల హెక్టార్లలో చేపట్టిన పప్పుశనగ సాగులో ఎక్కడా ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. రూ.600 కోట్లకు పైగా రైతులు భారీగా నష్టపోయారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 50 మి.మీ నమోదైంది. 67 శాతం లోటు వర్షపాతంతో రబీ ప్రధానపంట పప్పుశనగతో పాటు మరికొన్ని పంటలు దాదాపు 2 లక్షల ఎకరాల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. గత రబీలో జిల్లా రైతులకు రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రబీలో కూడా 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించి చంద్రబాబు సర్కారు చేతులుదులుపుకుంది. రూ.100 కోట్లు పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించినా... పరిహారం ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఉలుకుపలుకూ లేదు. రుణమాఫీ పరిస్థితి ఇలా... 2014 నాటికి జిల్లాలో రైతు రుణాలు రూ.6,817కోట్లు కమిటీలు, కొర్రీల కింద పక్కన పెట్టిన రుణాలు రూ.4,073కోట్లు చివరకు పంట,బంగారు రుణాల మాఫీకి అర్హత రూ.2,744కోట్లు ఒకేసారి మాఫీ అయిన మొత్తం రూ.650కోట్లు మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం రూ.418కోట్లు రెండో విడతగా మాఫీ అయిన మొత్తం రూ.461కోట్లు మూడో విడత మాఫీ రూ.502కోట్లు ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము రూ.1,906కోట్లు రెండు,మూడు విడతల్లో పెండింగ్ రూ.33కోట్లు గిట్టుబాటూ ఎండమావే జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. పై చిత్రంలోని రైతు పేరు ప్రభాకర్‌రెడ్డి. పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు రెండు ఎకరాలలో బెండ పంట సాగు చేశాడు. బోరు బావిలో అరకొర వస్తున్న నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్న ఫలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పని చేయకుండా పోయింది. ఈ విషయాన్ని తోటి రైతులతో కలసి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈక్రమంలో నీరందక పంట ఎండిపోతోంది. చేతి కొచ్చిన పంటను ఎండిపోకుండా ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి నీటిని తోలుతున్నాడు. తన కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట ఎండిపోతే తీవ్రంగా నష్టపోతానని, ఇలా ఎన్ని రోజులు ట్యాంకర్‌తో నీళ్లు తోలుకోవాలో దిక్కు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రైతు ఒక్కడిదే కాదు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసిన రైతులందరిదీ. – ధర్మవరం రూరల్ ఈ ఫొటోలోని రైతు పేరు నాగేంద్రప్ప, వలస గ్రామం, అమరాపురం మండలం. ఈయన పేరిట 4–50 ఎకరాల పొలం ఉంది. పంటలు సాగు చేయడానికి స్థానిక సిండికేట్ బ్యాంకులో 2013లో రూ. 1.2 లక్షల రుణం తీసుకున్నాడు. ఏటా సకాలంలో రుణం రెన్యూవల్ చేయించుకుని వడ్డీ రాయితీ పొందేవాడు. అయితే 2014 ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని, రైతులు రుణాలు కట్టొద్దని చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకులు చెప్పడంతో ఈ రైతు కూడా రుణానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించలేదు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోయింది. బ్యాంకులో అప్పు మాత్రమే అలాగే ఉంది. – అమరాపురం పొలంలోనే వదిలేశా.. రూ.లక్ష పెట్టుబడి పెట్టి గత ఖరీప్‌లో వర్షాధారం కింద 8 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. కానీ పంట సాగుచేసిన తర్వాత రెండు నెలలైనా వాన జాడ లేకపోవడంతో పంటంతా నిట్టనిలువునా ఎండిపోయింది. ఒక్క వర్షం పడినా పెట్టుబడులు వచ్చి, పశువుల మేత అయినా దక్కుతుందనుకున్నా. కాని చివరి వరకు వర్షం రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేశా. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుందనుకుంటే అసలు పట్టించుకోవడం లేదు. – తలారి నరసింహులు, వేరుశనగ రైతు, కనగానపల్లి బీమా పరిహారం నిల్ ఫసల్ బీమా కింద 11 వేల మంది పప్పుశనగ రైతులు 2017 రబీలో రూ.2 కోట్లు ప్రీమియం చెల్లించారు. వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందలేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు రూ.82 కోట్లు ప్రీమియం కట్టారు. ఈ పరిహారం ఇంకా ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశనగ రైతులు రూ.5 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినా పరిహారం అతీగతి లేకుండా పోయింది. అంతకు మునుపు కూడా 2014, 2015, 2016లో వేరుశనగ ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా రైతులు ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు వరకు బీమా ప్రీమియం చెల్లించనా... పరిహారం మాత్రం కంటితుడుపుగా విడుదల చేశారు. ప్రభుత్వంతో పాటు బీమా కంపెనీలు కూడా దగా చేయడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రైతు విలవిల అధికారిక లెక్కల ప్రకారం గత 25 ఏళ్ల జిల్లా వ్యవసాయ చరిత్ర తిరగేస్తే.. కేవలం నాలుగు సంవత్సరాల్లో మాత్రమే వేరుశనగ పంట అంతో ఇంతో చేతికొచ్చింది. మిగిలిన 20 సంవత్సరాలు పెట్టుబడులు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వెయ్యి కిలోల వరకు దిగుబడులు వస్తే పంట బాగా వచ్చినట్లు లెక్క. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1995 నుంచి 2018 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే అందులో 1995, 1998, 2000, 2006లో మాత్రమే పంట పండింది. ఆ తర్వాత 1996, 2004, 2017లో పెట్టుబడులు దక్కించుకున్నారు. ఇక మిగిలిన 18 ఏళ్లు సర్వం కోల్పోయారు. శతాబ్దాల చరిత్ర పునరావృతం జిల్లా గత 140 సంవత్సరాల వర్షపాతం చరిత్ర తీసుకుంటే ఈ ఏడాదే అతి తక్కువ వర్షం కురిసింది. జిల్లా సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా గత జూన్ నుంచి ఇప్పటివరకు కేవలం 274 మి.మీ వర్షం కురిసింది. అంటే సా«ధారణం కన్నా 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండూ ఈ సారి మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. ఈ శతాబ్ధిలో నమోదైనంతగా లోటు వర్షపాతం గతంలో ఎన్నడూ లేదు. ఈ‘సారీ’ దారుణం గత ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. కీలకమైన ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 261 మి.మీ వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దాని కన్నా 37 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో 7 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ప్రధాన, ప్రత్యామ్నాయ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే 2018 ఆగస్టులో తొలి విడతలో 44 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రెండో విడతగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మిగిలిన 19 మండలాలను కూడా కరువు జాబితాలోకి చేర్చింది. పడకేసిన ప్రత్యామ్నాయం చంద్రబాబు హయాంలో వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయమైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటల మనుగడ కూడా పడకేసింది. సబ్సిడీ, రాయితీలు, పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో రైతులను సీఎం చంద్రబాబు దగా చేస్తూ వచ్చారు. కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయనియ్యకుండా అంతో ఇంతో తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యేలా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యానశాఖ ద్వారా రూ.50 కోట్లు వెనక్కి మళ్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యానహబ్ అంటూ ఊరించినా దాని ఊసే లేకుండా చేశారు. పండిన పండ్ల ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక చాలా సార్లు టమాట పంట రోడ్డున పడేస్తున్న దుస్థితి నెలకొంది. చీనీ, దానిమ్మ, అరటి, మామిడి, కర్భూజా, కళింగర, దోస, బొప్పాయి, మిరప లాంటి పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతున్నారు. పశుశాఖకు కేటాయించిన బడ్జెట్ ఐదేళ్లలో రూ.60 కోట్లు కాగా, ఇందులో పాడి రైతులకు ఉపయోగపడే ఒక్క పథకమూ అమలు చేయలేదు. చంద్రబాబు ప్రైవేట్ డైయిరీను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యమైపోయింది. పదేళ్ల కిందటనే రోజుకు 60 నుంచి 70 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న ప్రభుత్వ డెయిరీలో ఇపుడు రోజుకు 6 వేల లీటర్లు కూడా రావడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 1.81 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటల మనుగడకు విఘాతం ఏర్పడింది. అలాగే ఏటా రూ.800 కోట్లు టర్నోవర్ కలిగిన పట్టుపరిశ్రమను నమ్ముకున్న రైతులూ రూ.200 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకున్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నికలు వచ్చినా పూర్తిగా మాఫీ చేయలేదు. గత మూడు విడతల రుణమాఫీ మొత్తం గత అప్పు¯నకు చెల్లించాల్సిన వడ్డీకే సరిపోయింది. ఇక 4, 5 విడతల రుణమాఫీ మొత్తం బ్యాంకు ఖాతాకు ఇప్పటికీ జమ కాలేదు. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మాఫీ చేసింది లేదు. హామీ నెరవేర్చలేని చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. – బాలునాయక్, తిప్పేపల్లి, ఓడీచెరువు నయాపైసా మాఫీ కాలేదు నాకు మా గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. సిండికేట్ బ్యాంకులో రూ.1.5 లక్షల అప్పు ఉంది. సీఎం చంద్రబాబునాయడు 2014 ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తానని గొప్పగా ప్రకటించారు. అయినా నాకు ఇంత వరకూ నయాపైసా కూడా మాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం ప్రచారం చేయడమే తప్ప రైతులను ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు. – శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి, లేపాక్షి మం -
దండుకుంటున్నా..మీ సేవ
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు కబలిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దేవుడా ఏమిటీ దయనీయ పరిస్థితి అని రైతులు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సభలు నిర్వహిస్తున్నారు.తమకు కొంతైనా ఊరటగా ఉంటుందని బీమా చేయించడానికి ఆసక్తి కనబరుస్తుండగా కరువు రైతులను కూడా మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు దండుకుంటున్నారు. అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రొద్దుటూరు : ఓ వైపు కరువు పరిస్థితులు ఉన్నా వరుణదేవుడు కరుణించక పోతాడా అన్న ఆశతో రబీ సీజన్లో రైతులు పంటలను సాగు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అత్యధికంగా శనగ పంటను సాగు చేయగా మిగతా ప్రాంతాల్లో శనగ, వరి, జొన్న తదితర పంటలు వేశారు. వీటిని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వచ్చిన తిత్లీ, గజ తుపాన్లపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వేలెడు లోతున కూడా భూమిలోకి నీరు ఇంక లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు ఇది ఇలా ఉండగా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది. డిసెంబర్ 15 వరకు శనగ పంటకు, జొన్న, వేరుశనగ, ఉల్లి, మిరప, పొద్దుతిరుగుడు పంటలకు డిసెంబర్ 31, వరి పంటకు 2019 జనవరి 15 వరకు బట్టి ప్రీమియం చెల్లించేందుకు గడువు విధించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో ఎక్కువగా శనగ రైతులు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల మంది ప్రీమియం చెల్లించగా జిల్లాకు సంబం«ధించిన రైతులే 21వేల మంది ఉన్నారు. తర్వాత ప్రకాశం జిల్లాలో 10వేల మంది, అనంతపురం జిల్లాలో 9,300 మంది, కర్నూలు జిల్లాలో 4,800 మంది, విజయనగరం జిల్లాలో 552 మంది, కృష్ణాజిల్లాలో 74 మంది, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 7 మంది ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించారు. అదనపు వసూళ్లు.. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు అక్కడే బీమా ప్రీమియంను వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకు రుణం పొందనివారు, కౌలు రైతులు ఎంపిక చేసిన మీ–సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) చెల్లిస్తున్నారు. దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 284 మీ–సేవా కేంద్రాలు ఉండగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే వీటికి అనుమతి మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు బీమా ప్రీమియానికి సంబంధించిన దరఖాస్తుపై రూ.24 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మీ–సేవా కేంద్రం నిర్వాహకులు ప్రతి ఎకరాకు ప్రీమియంతోపాటు రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరా శనగ పంట ప్రీమియం రూ.270 కాగా రూ.300 చొప్పున ప్రొద్దుటూరులో వసూలు చేస్తున్నారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో కూడా ఈ విధంగానే ఫిర్యాదులు అందుతున్నాయి. ఎక్కువ మంది రైతులు ప్రొద్దుటూరుకు వచ్చి ప్రీమియం చెల్లిస్తున్నారు. పలువురు రైతులు ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి ఆర్వీ సాగర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన నిబంధనలను వివరించారు. సమస్యను వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు మురళీకృష్ణకు ఫిర్యాదు చేయగా ఆయన కూడా ఇదే విషయాన్ని తెలిపారు. మిగతా వరి, జొన్న పంటలకు కూడా ఇలానే అదనపు వసూళ్లు చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోయి తాము ఇబ్బందులు పడుతుంటే మీ–సేవా నిర్వాహకులు దోచుకోవడం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త రైతులకు నో చాన్స్
‘రైతు బంధు’ అమలు విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది.ఈ పథకంలో కొత్త వారిని చేర్చకూడదని సూచనలు చేసింది. దీంతో భూ వివాదాలు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’లోకి మారిన రైతులు, పలు కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొందలేక పోయిన దాదాపు 60 వేల మందికి పైగా రైతులకు నిరాశే ఎదురు కానుంది. మోర్తాడ్(బాల్కొండ): పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో కొత్త వారిని చేర్చకూడదని ఎన్నికల కమిషన్ సూచించడంతో గతంలో చెక్కులు పొందిన రైతులకే ప్రయోజనం చేకూరనుంది. పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు, వివిధ కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొం దలేక పోయిన రైతులకు నిరాశే ఎదురుకానుంది. అయితే రబీ సీజనుకు సంబంధించి పెట్టుబడి సహాయం అందించడానికి తమకు ఇంకా మార్గదర్శకాలు అందలేదని అందువల్ల ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి ఖరీఫ్‌కు రూ.4 వేల చొప్పున, రబీ సీజనుకు మరో రూ.4 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం విదితమే. ఖరీఫ్ సీజనుకు గాను మే నెలలోనే అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం చెక్కులను వ్యవసాయ శాఖ అందించింది. రబీ సీజనుకు సంబంధించి నవంబర్‌లో చెక్కులను అందించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలైతే పెట్టుబడి సహాయానికి బ్రేక్ పడవచ్చని భావించిన ప్రభుత్వం ఒక నెల ముందుగానే పంపిణీకి ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచే అన్ని గ్రామాలలో పెట్టుబడి సహాయం చెక్కులను అందించాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పలు సూచనలు, సలహాలను అందించడంతో రైతుబంధు పథకం అమలులో ఊహించని మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి చెక్కులను పంపిణీ చేయ కుండా రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సహాయం నగదు రూపంలో బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. అంతేగాక గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకు మాత్రమే రబీ సహాయంను అందించాలని కొత్త వారిని ఇప్పట్లో చేర్చవద్దని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీంతో జిల్లాలో వివాదాస్పద భూములు పరిష్కారమై పార్ట్ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు దాదాపు 30 వేల మంది పెట్టుబడి సహాయం అందుకోలేక పోతున్నారు. ఖరీఫ్ సీజనులో జిల్లాలోని 2లక్షల, 271 మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు అయ్యింది. రూ.204.44 కోట్ల నిధులు ఇందు కోసం కేటాయించారు. రైతులు మరణించడం, ప్రభుత్వ భూముల్లో సాగు, ఆధార్ కార్డు అందించకపోవడం వంటి కారణాలతో 36,903 మంది రైతులకు చెక్కులు పంపిణీ కాలేదు. ఈ చెక్కులు వ్యవసాయ శాఖ వద్దనే ఉండిపోయాయి. వీరు కూడా రబీలో పెట్టుబడి సహాయం పొందలేకపోతున్నారు. అయితే విదేశాల్లో ఉన్న రైతుల పేరిట మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల కోడ్ అమలుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో విదేశాల్లో ఉన్న రైతుల చెక్కులకు కోడ్ వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. ఖరీఫ్ సీజనులో ఎంత మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరైందో అంతే మొత్తం రబీ సీజనుకు కూడా మంజూరు కానుంది. ఇదిలా ఉండగా రైతుల ఖాతా నంబర్లను మళ్లీ సేకరించడమా లేక ధరణి వెబ్సైట్ ఆధారంగా నమోదైన ఖాతాల వివరాల ప్రకారం నగదు బదిలీ చేయడమా అనేది ప్రభు త్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం నడుచుకుంటామని వ్యవసాయ శాఖ చెబుతుండగా ఇందు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే రబీ సీజను పెట్టుబడి సహాయం ఎలా అందుతుందో స్పష్టం అవుతుంది. ఇందుకోసం కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నగదు బదిలీపై రైతుల్లో అసంతృప్తి రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల బ్యాంకర్లు పాత రుణాల వసూలుకు లింకు పెట్టి పెట్టుబడి సహాయం చెల్లించకుండా నిలిపివేస్తారని రైతులు అంటున్నారు. చెక్కులు ఇవ్వడం వల్ల తమకు అవకాశం ఉన్న బ్యాంకులో నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల పాత రుణాలకు బ్యాంకర్లు లంకె పెట్టే అవకాశం ఉండటంతో రైతులు ఈ విధానంపై పెదవివిరుస్తున్నారు. కాగా బ్యాంకర్లకు పెట్టుబడి సహాయం చెల్లింపులపై ఆదేశాలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. తప్పులు వచ్చాయని చెక్కులు ఇవ్వలేదు మేము గతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి సంబంధించి మూడు ఎకరాలకు బదులు ఎక్కువ భూమి మా రికార్డులలో నమోదు అయ్యింది. దీంతో రూ.12 వేల పెట్టుబడి సహాయానికి బదులు ఎక్కువ సొమ్ము మంజూరైంది. అయితే అధికారులు అసలు ఉన్న భూమికి కూడా చెక్కు ఇవ్వలేదు. చెక్కును వాప సు తీసుకున్నారు. ఇంత వరకు మళ్లీ చెక్కు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు రూ.12 వేల చెక్కు ఇస్తారా ఇవ్వరా అనేది అధికారులు తేల్చడం లేదు. – బూత్‌పురం మహిపాల్, రైతు, మోర్తాడ్ బ్యాంకు ఖాతాలను సేకరించాలని ఆదేశించారు రైతుబంధు పథకాన్ని రబీ సీజనుకు అమలు చేయడానికి గాను రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించాలని సూచించారు. గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకే పెట్టుబడి సహాయం అందించనున్నారు. కొన్ని కారణాల వల్ల పెట్టుబడి సహాయం అందుకోని రైతులకు ఇప్పుడు సహాయం అందిస్తారా లేదో తెలియదు. ప్రస్తుతానికి సహాయం పొందిన రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నాం. –పర్స లావణ్య, వ్యవసాయాధికారి, మోర్తాడ్ -
కరువు అంచనా...అంతా వంచన
కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్పుట్స్ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం విజయకుమార్ ఉన్నారు. ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు. ఉపాధి కష్టాలకు గంతలు కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. చెరువుల పరిశీలన అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్, ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్ సీసీఎస్ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. రైతులకు గోడు వినకుండానే.. అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లారు
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా వేయడానికి మంగళవారం ముఖేష్‌కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(కేంద్ర బృందం) జిల్లా పర్యటన కంటితుడుపుగా సాగింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ జి.వీరపాండియన్ కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు జాబితాలో మొదట 15, తర్వాత 8 మొత్తం 23 మండలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీవ్ర కరువు కాకుండా సాధారణ కరువు (మాడరేట్) జాబితా కింద ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్‌కుమార్, నీతి అయోగ్, అగ్రికల్చర్ ఇన్పుట్స్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధాబటనా, ఎఫ్సీఐకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం (లీగల్) జీవీ విజయకుమార్, హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ శ్రీవాస్తవల బృందం జిల్లాకు వచ్చింది. ఊరూరా కరువు కథలే... జాయింట్ కలెక్టర్–2 సుబ్బరాజు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్డీఏ అధికారులతో కలిసి 11.30 గంటలకు గోరంట్లకు వెళ్లారు. అక్కడ తాగునీటి కష్టాలు తెలుసుకుని ఎండిపోయిన బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర బృందం ఏటా వచ్చివెళుతున్నా...కరువుకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా శంకరనారాయణ విమర్శించారు. వస్తున్న అరకొర నిధులు కూడా టీడీపీ కార్యకర్తలకే సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. అక్కడి నుంచి అదే మండలం బెల్లాలపల్లికి చేరుకున్న కేంద్రం బృందం.. అక్కడ నిర్మిస్తున్న ఫారంపాండ్ చూసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామానికి చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. పప్పుశగన రైతులు కొండారెడ్డి, జగన్నాథరెడ్డితో మాట్లాడారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి పంట ముగిసేదాకా వర్షంజాడ లేకపోవడంతో వేసిన పప్పుశనగ దారుణంగా దెబ్బతినడంతో నష్టాలపాలైనట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ 20 నిమిషాలు గడిపిన కేంద్రబృందం సభ్యులు ఆ తర్వాత 2.15 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన 4 ఎకరాల చీనీతోటను చూసి బాధిత రైతు లక్ష్మమ్మతో మాట్లాడారు. గ్రామ శివార్లలో ఉపాధికూలీలతో సమావేశమై కష్టనష్టాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామంలో ఎండిపోయిన తాగునీటి బోరుబావిని పరిశీలించి సర్పంచ్ నరసింహులుతో మాట్లాడారు. 500 అడుగులకు పైగా బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడటం గగనంగా మారిందని ఈ సందర్భంగా పలువురు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా 15 నిమిషాలు గడిపారు. పక్కనే ఎండిపోయిన టమాట, కర్భూజా పంటలను పరిశీలించాలని కోరినా సమయం లేదని.. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి రాత్రి 7 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరకున్నారు. రూ.699.45 కోట్లతో నివేదిక జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. అందులో ఇప్పటికే రూ.53.94 కోట్లు ఖర్చు చేశామని, మిగతా రూ.645.51 కోట్లు జూన్‌లోపు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో వ్యవసాయశాఖ పరిధిలో రూ.42.40 కోట్లు, ఉద్యానశాఖ పరిధిలో రూ.13.20 కోట్లు, పశుసంవర్ధఖశాఖకు రూ.49.65 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.10.57 కోట్లు, డ్వామాకు రూ.274.71 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌శాఖకు రూ.274.71 కోట్లు అవసరమని నివేదించారు. 11 గంటలకు ప్రారంభం, 6 గంటలకు ముగింపు క్షేత్రస్థాయి పర్యటన ఉదయం 11 గంటలకు చిలమత్తూరు మండలం రక్షా ఆకాడమీ నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం స్థానిక ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష 9.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో కరువు పరిశీలన కన్నా ప్రయాణం, అధికారులతో సమీక్షకే ఎక్కువ సమయం తీసుకోవడం విశేషం. పంట పొలాలు, ఎండిన బోరుబావులు, పండ్లతోటల పరిశీలించడం.. రైతుల కష్టాలు వినేందుకు కనీసం మూడు గంటలు కూడా కేటాయించలేదు. అధికారులపై అసంతృప్తి వ్యవసాయ, అనుబంధశాఖలు, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల పరిధిలో నెలకొన్న కరువు పరిస్థితులకు సంబంధించి సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. అనంతరం జిల్లా కరువు పరిస్థితుల గురించి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర బృందం సభ్యులు సమీక్షించారు. పర్యటన సమయంలో కరువు పరిస్థితులు చూసిన కేంద్ర బృందం సభ్యులు కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు గానీ, కరువు నివారణ ప్రతిపాదనలు కాని పంపకపోవడంతో వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, ఉద్యానశాఖ అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అకాల వర్షం.. రబీ పంటలకు నష్టం
బజార్హత్నూర్(బోథ్) : జిల్లాలో మూడు రోజు లుగా రాత్రి సమయాల్లో కురుస్తున్న రాళ్ల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 40 శాతం శనగ పంటను కోసం మెదలుగా చేనులో ఆరబెట్టారు. ఉరుములు, మెరుపులతో గాలి బీ భత్సం, రాళ్ల వర్షంతో మెదల్లు కొట్టుకుపోవడం, తడిసిపోవడం జరిగింది. గింజలు నల్లబారి మెలకెత్తుతున్నాయి. మిగతా 60 శాతం పంట కోత దశలో ఉండడంతో రాళ్ల వర్షానికి నేలరాలాయి. గింజ నాణ్యత కోల్పోతే గిట్టుబా టు ధరలు రాక మళ్లీ నష్టపోయే పరిస్థితి వ స్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొం డ మండలాల్లో 86 వేల ఎకరాల్లో రబీలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధమ పంటలు సాగు చేశారు. శనగ పంట దెబ్బతింది.. నాకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు శనగ, రెండెకరాల్లో కంది పంట వేసాను. శనగ పంట కోత దశలో ఉండడంతో రూ.4వేలు ఖర్చు చేసి కూలీలతో మెదల్లు వేసి ఆరబెట్టాను. మూడు రోజులుగా అకాల వర్షానికి మెదల్లు తడవడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నాలుగెకరాల శనగ పంట దెబ్బతింది. గింజరంగు మారేపరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రైతు డుబ్బుల ముత్తన్నయాదవ్, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి మండలంలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధుమ పంటలు సాగు చేశారు. మూడు రోజులుగా రాళ్ల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గింజలు మొలకెత్తి, రంగుమారి నాణ్యత కోల్పోతున్నాయి. పంట దిగుబడిలో దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. రబీ పంటలకు గింజ నాణ్యతతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి. – రైతు కొడిమెల కాశీరాం, దేగామ -
యాసంగి జోరు!
జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రబీలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,83,426 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,73,305 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం 94 శాతంగా నమోదైంది. మరో వారం రోజుల్లో వంద శాతం పంటలు సాగయ్యే అవకాశాలు న్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నాట్లు వేశారు. 54,360 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. 61,510 ఎకరాల్లో వరి సాగైంది. మరో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 31,913 ఎకరాల్లో, పోచారం ప్రాజెక్టు కింద 3,806 ఎకరాల్లో, కౌలాస్‌నాలా ప్రాజెక్టు కింద 3,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో సగం ప్రాజెక్టుల కిందనే ఉండగా.. మిగతా సాగు విస్తీర్ణం బోర్లు, బావులపై ఆధారపడి ఉంది. తగ్గిన మొక్కజొన్న సాగు... జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం సాధారణానికం టే తగ్గింది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 44,043 ఎకరాలుకాగా 39,554 ఎకరాల్లో మక్క వేశారు. మక్క దాదాపు బోర్లు, బావుల దగ్గరే సాగవుతోంది. 10,933 ఎకరాల్లో జొన్న సాగవుతుందని అంచనా వేయగా.. 7832 ఎకరాల్లో సాగైంది. శనగ పంట 44,903 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 49,316 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాగు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగు విస్తీర్ణం 2,458 ఎకరాలు కాగా.. 440 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. చెరుకు సాగు విస్తీర్ణం ఈసారి పెరిగింది. సాధారణ విస్తీర్ణం 5,883 ఎకరాలు కాగా 7,643 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. తగ్గుతున్న భూగర్భ జలాలు.. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఎక్కువ సేపు నడుపుతున్నారు. దీంతో బోర్లలో నీటి ఊటలు తగ్గుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో 24 గంటల కరెంటు మరింత దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూగర్భ జలమట్టం దెబ్బతిని యాసంగి పంటలకు నష్టం కలుగుతోంది. ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే మరింత నష్టం తప్పదంటున్నారు. ఎకరం వరి వేసిన... ఎకరం వరి పంట వేసిన. బోరు మంచిగనే పోసేది. ఈ మధ్యన బోర్ల ఊట తగ్గింది. నీళ్లకు తిప్పలైతదనే కొంత బీడు పెట్టినం. వేసిన ఎకరం పంట గూడ ఎట్ల గట్టెక్కుతదోననే భయం ఉన్నది. 24 గంటల కరెంటుతోని కొంత ఇబ్బంది అయితుంది. – నాగరాజు, రైతు, పోల్కంపేట, లింగంపేట మండలం ఇప్పుడైతే మంచిగనే ఉన్నది... బోర్లు మంచిగ పోస్తున్నయని మూడెకరాలల్లో వరి వేసిన. అవసరం ఉన్నంత మేరకు బోరు నడుపుతున్నం. మిగతా సమయం బందు పెడుతున్నం. ఈసారి పంట మంచిగనే ఉన్నది. మా ఊళ్లె అన్ని బోర్లు బాగానే ఉన్నయి. బోర్లు ఎత్తిపోకుంటే ఏ ఇబ్బంది ఉండదు. – దేవేందర్‌రెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట మండలం -
అధ్వానంగా రబీ
16 శాతానికి మించని ఆహారధాన్యాల సాగు వ్యవసాయశాఖ తాజా నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మొత్తం పంటల సాగు 31.32 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ సీజన్లో కేవలం 6.80 లక్షల ఎకరాల్లోనే (22 శాతం) జరిగినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదికలో పొందుపరిచింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా 3.92 లక్షల ఎకరాల్లోనే (16 శాతం) సాగైనట్లు పేర్కొంది. ఇక 16.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఈనేపథ్యంలో రబీలో ఆహారపంటల సాగు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారధాన్యాల కొరత వెంటాడనుంది. ఇదిలా ఉండగా రబీలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో 78 శాతం వర్షపాతం కొరత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 95 శాతం కొరత ఏర్పడింది. -
నారుమడికి నీరేదీ?
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘రబీ సాగును ఆలస్యం చేయవద్దని మేము ముందు నుంచీ చెబుతున్నాం. అయినా సాగు ఆలస్యమవుతోంది. నీటి ఎద్దడి ఏర్పడితే మేమేం చేయలేం’ ఇవి ఇరిగేషన్ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు. ‘సాగు చేయాలని మాకూ లేదు. కానీ, పొలం వరకూ నీరిస్తే వెంటనే నారుమళ్లు వేస్తాం’ ఇది రైతులు అంటున్న మాట. వీరి మాటలు ఎలా ఉన్నా అటు తూర్పుడెల్టాకు, ఇటు మధ్యడెల్టాకు నారుమళ్ల సమయానికి ఇవ్వాల్సిన దానికన్నా అధికంగానే సాగునీరు విడుదల చేస్తున్నారు. అయితే ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెల వరకు పూడుకుపోవడంతో శివారు చేలకు నీరందడం లేదు. అసలే ఖరీఫ్ కోతలు ఆలస్యం కావడానికి తోడు నీరందని పరిస్థితి ఏర్పడడంతో డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. రెండు డెల్టాల్లో ఇప్పటి వరకూ కేవలం 40 శాతం మాత్రమే నారుమళ్లు వేయగా, వాటి పరిధిలోని శివారు మండలాల్లో 20 శాతానికి మించి వేయకపోవడం గమనార్హం. హెలెన్ తుపానుతో ఖరీఫ్ వరి పంట నష్టపోవడానికి తోడు రెండు డెల్టాల్లో ప్రధాన పంటకాలువల వ్యవస్థ అధ్వానంగా మారింది. అడిగే నాథులు లేరు.. ఏడాదిన్నర కాలంగా నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ చానళ్లు, పంటబోదెలు చెత్తాచెదారంతో నిండి, పూడుకుపోవడంతో నీరు పారడంలేదు. హెలెన్ తుపానుకు పంటకాలువలకు, చానళ్లకు అడ్డుగా కొబ్బరిచెట్లు, ఆకులు పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనితో నారుమళ్లు వేద్దామన్నా నీరు లేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీసాగుకు ముందు ఆయా కాలువల పరిధిలో ఇరిగేషన్ అధికారులు షార్ట్ క్లోజర్ పనులు చేయిస్తుంటారు. రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువాను ఇందుకు వెచ్చించి, నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేయించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో నీటి తీరువాతో పనులు చేయించాలనే నాథులే లేకుండా పోయారు. అధికారులు ఈ ఏడాది తూర్పు, మధ్యడెల్టాలలోని ప్రధాన పంటకాలువల్లో పూడిక, తూడు, గుర్రపుడెక్క, మొక్కలు తొలగించేందుకు కేవలం రూ.2.85 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిలో తూర్పుడెల్టాకు రూ.2.05 కోట్లు కేటాయించగా అందులో రూ.26 లక్షలతో లాకులపై షట్టర్ల మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. మధ్యడెల్టాకు కేవలం రూ.80 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇందుకు సంబంధించి టెండర్లు ఖరారైనా పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. సాగు ఆరంభానికి ముందే కాలువల్లో నీరు సక్రమంగా పారేందుకు గుర్రపుడెక్క, చెత్త తొలగించాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఆ పనులు పూర్తి చేయించకుండా తాపీగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సాగు ఆలస్యమై నీటి ఎద్దడి ఏర్పడితే తమకు సంబంధంలేదంటూ ఇరిగేషన్ అధికారులు ప్రకటనలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలువలను బాగు చేయించాలని నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు కోరుతున్నారు -
జలం.. పుష్కలం
సాక్షి, కాకినాడ : రబీ సీజన్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 8.96 లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్ణయించింది. రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తోట నరసింహం అధ్యక్షతన కాకినాడ విధాన గౌతమి హాలులో శుక్రవారం జరిగిన ఐఏబీ సమావేశం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటకు డిసెంబర్ ఒకటి నుంచి నీరు విడుదల చేయాలని, ఫిబ్రవరి 28న కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. వచ్చే ఖరీఫ్‌కు జూన్ 15న నీరు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఇరిగేషన్ ఎస్ఈ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో రబీలో 8,96,533 ఎకరాలు సాగవుతుండగా ఒక్క మన జిల్లాలోనే 4.85 లక్షల ఎకరాలు సాగవుతోందని చెప్పారు. గోదావరితో పాటు ఇతర జలాశయాల్లో ప్రస్తుతం 73.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దీనితో 7,90,590 ఎకరాలకు సమృద్ధిగా నీరందించవచ్చని వివరించారు. ఇటీవలి భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వీటితోపాటు ఇతర యాజమాన్య పద్ధతుల ద్వారా మిగిలిన 1,05,943 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరందించవచ్చని చెప్పారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి గత ఏడాది 2700 టీఎంసీల మిగులు జలాలు సముద్రంలోకి వదలగా, ఈ ఏడాది ఏకంగా 5700 టీఎంసీలు పైగా విడిచిపెట్టామన్నారు. గత ఏడాది 500 క్యూసెక్కుల నీటికోసం ఎంతో ఇబ్బంది పడ్డామని, ఈ ఏడాది ఏకంగా 22 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందని వివరించారు. గత నెలాఖరులో 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రస్తుతం 64 వేల క్యూసెక్కులు మాత్రమే ఉందని, రబీ సాగు పూర్తయ్యేనాటికి ఇది మరింత పడిపోయే అవకాశాలున్నాయని చెప్పారు. అయినప్పటికీ రబీకి ఢోకా లేకుండా నీరందిస్తామన్నారు. మొత్తం ఆయకట్టులో 10 శాతమైనా క్లోజర్‌కు ఇవ్వగలిగితే ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్ఈ చెప్పారు. ఏలేరు పశ్చిమ కాలువ, బిక్కవోలు కాలువల ఆధునికీకరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏలేరుపై వాడీవేడి చర్చ ఏలేరు ఆధునికీకరణ టెండర్ల ఖరారుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. వైఎస్సార్ హయాంలో రూ.138 కోట్లు మంజూరు చేసినప్పటికీ గత ఆరేళ్లలో పనులు ఎందుకు చేపట్టలేకపోయామని మంత్రి తోట నరసింహం తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. రూ.38 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రతిపాదనలు.. 2008లో రూ.138 కోట్లకు చేరగా, ప్రస్తుతం అంచనా విలువ రూ.250 కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ బిడ్ దశలో ఉండగా ఇప్పుడు డిజైన్ మార్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడమేమిటని ఎమ్మెల్యే వంగా గీత ప్రశ్నించారు. పనులు చేపట్టే దశకు చేరుకున్న ఈ తరుణంలో ైహైదరాబాద్లో నిర్ణయాలు ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.బాబి కూడా పలు సమస్యలు ప్రస్తావించారు. చివరగా మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న దీర్ఘకాలిక ఇరిగేషన్ సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ కొండలరావు, డీఆర్ఓ బి.యాదగిరి, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కాగా కీలకమైన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు సహా ఎంపీలు, మెజార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఖరీఫ్ నష్టపోయినందున రబీలో క్లోజర్ అడగడం భావ్యం కాదన్నారు. క్లోజర్‌తో సంబంధం లేకుండా ఖరారైన ప్యాకేజీల పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సామర్లకోట కెనాల్‌కు పలుచోట్ల అనధికారికంగా ఏర్పాటు చేసిన తూరలను తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్నా తన గోడు అరణ్య రోదనగానే మిగిలిపోయిందని పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ చెప్పారు. ఐదు తూములు వద్ద గట్లు కొట్టేయకుండా రైతులు కాపలా కాసే దుస్థితి ఏర్పడిందని, అక్కడి లాకులను ఎందుకు తీయలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటిని మూడు రోజుల్లో తొలగిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. ఏలేరు స్పిల్‌వే గేటు వద్ద క్వారీ బ్లాస్టింగ్లు జరుపుతున్నారని, దీనివల్ల రిజర్వాయర్‌కు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పంతం అన్నారు. క్వారీ యజమానులు తమ పరిధికి మించి బ్లాస్టింగ్లు జరుపుతూ కాలువ గట్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను మణిహంస పవర్ ప్లాంట్ యాజమాన్యం నియంత్రిస్తోందని, ఈ ప్లాంట్ ప్రభుత్వానికి భారీగా బకాయి పడినందున వెంటనే నీటి విడుదలను అడ్డుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పంపా ఆధునికీకరణకు రూ.23 కోట్లు మంజూరై మూడు నెలలైనా పనులు ఎందుకు చేపట్టడం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు ప్రశ్నించారు. వచ్చే నెల 15కల్లా టెండర్లు పిలుస్తామని ఎస్ఈ చెప్పారు. డెల్టా ఆధునికీకరణ ఒక మిథ్యగా తయారైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. మన జిల్లా సమస్యలంటే హైదరాబాద్‌లో చిన్నచూపు చూస్తున్నారని, అందువల్లనే ఎక్కడికక్కడ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయని అన్నారు. రౌతులపూడి వద్ద గండిని పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి ఆరోపించారు.