అమలాపురం, న్యూస్‌లైన్ :
‘రబీ సాగును ఆలస్యం చేయవద్దని మేము ముందు నుంచీ చెబుతున్నాం. అయినా సాగు ఆలస్యమవుతోంది. నీటి ఎద్దడి ఏర్పడితే మేమేం చేయలేం’ ఇవి ఇరిగేషన్ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు. ‘సాగు చేయాలని మాకూ లేదు. కానీ, పొలం వరకూ నీరిస్తే వెంటనే నారుమళ్లు వేస్తాం’ ఇది రైతులు అంటున్న మాట. వీరి మాటలు ఎలా ఉన్నా అటు తూర్పుడెల్టాకు, ఇటు మధ్యడెల్టాకు నారుమళ్ల సమయానికి ఇవ్వాల్సిన దానికన్నా అధికంగానే సాగునీరు విడుదల చేస్తున్నారు. అయితే ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెల వరకు పూడుకుపోవడంతో శివారు చేలకు నీరందడం లేదు. అసలే ఖరీఫ్ కోతలు ఆలస్యం కావడానికి తోడు నీరందని పరిస్థితి ఏర్పడడంతో డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. రెండు డెల్టాల్లో ఇప్పటి వరకూ కేవలం 40 శాతం మాత్రమే నారుమళ్లు వేయగా, వాటి పరిధిలోని శివారు మండలాల్లో 20 శాతానికి మించి వేయకపోవడం గమనార్హం. హెలెన్ తుపానుతో ఖరీఫ్ వరి పంట నష్టపోవడానికి తోడు రెండు డెల్టాల్లో ప్రధాన పంటకాలువల వ్యవస్థ అధ్వానంగా మారింది.
అడిగే నాథులు లేరు..
ఏడాదిన్నర కాలంగా నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ చానళ్లు, పంటబోదెలు చెత్తాచెదారంతో నిండి, పూడుకుపోవడంతో నీరు పారడంలేదు. హెలెన్ తుపానుకు పంటకాలువలకు, చానళ్లకు అడ్డుగా కొబ్బరిచెట్లు, ఆకులు పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనితో నారుమళ్లు వేద్దామన్నా నీరు లేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీసాగుకు ముందు ఆయా కాలువల పరిధిలో ఇరిగేషన్ అధికారులు షార్ట్ క్లోజర్ పనులు చేయిస్తుంటారు. రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువాను ఇందుకు వెచ్చించి, నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేయించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో నీటి తీరువాతో పనులు చేయించాలనే నాథులే లేకుండా పోయారు.
అధికారులు ఈ ఏడాది తూర్పు, మధ్యడెల్టాలలోని ప్రధాన పంటకాలువల్లో పూడిక, తూడు, గుర్రపుడెక్క, మొక్కలు తొలగించేందుకు కేవలం రూ.2.85 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిలో తూర్పుడెల్టాకు రూ.2.05 కోట్లు కేటాయించగా అందులో రూ.26 లక్షలతో లాకులపై షట్టర్ల మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. మధ్యడెల్టాకు కేవలం రూ.80 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇందుకు సంబంధించి టెండర్లు ఖరారైనా పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. సాగు ఆరంభానికి ముందే కాలువల్లో నీరు సక్రమంగా పారేందుకు గుర్రపుడెక్క, చెత్త తొలగించాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఆ పనులు పూర్తి చేయించకుండా తాపీగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సాగు ఆలస్యమై నీటి ఎద్దడి ఏర్పడితే తమకు సంబంధంలేదంటూ ఇరిగేషన్ అధికారులు ప్రకటనలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలువలను బాగు చేయించాలని నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు కోరుతున్నారు
నారుమడికి నీరేదీ?
Published Sat, Dec 21 2013 2:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement