సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్‌ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్‌ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు.
100 గోదాముల్లో నిల్వలు...
గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్‌ఫెడ్‌కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది.
(చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!)
రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా
మొన్నటి వరకు మార్క్‌ఫెడ్‌లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్‌లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు.
నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
(చదవండి: కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం)
మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్‌ఫెడ్
‘ఈ–టెండర్‌లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment