Markfed officials
-
అన్నదాత నుంచే ఆలయాలకు ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనాలని నిర్ణయించింది. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను దేవదాయ శాఖ రైతుల నుంచి కొంటుంది. వీటి కొనుగోలులో మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. తొలుత 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిల స్థాయిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. బుధవారం ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు సమావేశమయ్యారు. తదుపరి దశలో ఆయా ఆలయ పాలక మండలి సమావేశాల్లో రైతుల నుంచే సేంద్రియ ఆహార ధాన్యాల కొనుగోలుపై చర్చించి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో నిత్య అన్నదానం జరిగే మరో 175 ఆలయాల్లో ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. రైతులకు కేవలం 15 రోజుల్లోనే డబ్బు చెల్లించాలని కూడా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆ 11 ఆలయాలకే ఏటా 8 వేల టన్నుల ఉత్పత్తులు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 – 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండించే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రభుత్వ పరంగానూ అదనపు ప్రోత్సాహం అందించినట్టవుతుందని చెప్పారు. టీటీడీలో సేంద్రియ శనగల కొనుగోలు తిరుమల తిరుమల దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదాల తయారీలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. టీటీడీలో ఏటా 24 వేల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగిస్తారు. వీటిలో శనగలను మార్కెఫెడ్ మధ్యవర్తిత్వంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. మిగతా ఆహార ధాన్యాలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి కొనాలన్న ప్రక్రియ పురోగతి దశలో ఉంది. -
‘మక్క’ల్లో మస్తు తిన్నరు!
సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్‌ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్‌ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు. 100 గోదాముల్లో నిల్వలు... గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్‌ఫెడ్‌కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. (చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!) రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా మొన్నటి వరకు మార్క్‌ఫెడ్‌లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్‌లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. (చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం) మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్‌ఫెడ్ ‘ఈ–టెండర్లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. -
మక్కలు.. కుప్పలు తెప్పలు
అంతన్నాడింతన్నాడే లింగరాజ... అన్నట్లుగా ఉంది మార్క్‌ఫెడ్ పరిస్థితి. అట్టహాసంగా 62 కొనుగోలు కేంద్రాలను తెరచిన మార్క్‌ఫెడ్ అధికారులు ఒక్క గింజనూ పక్కకు పోనీయమంటూ గొప్పలు పోయారు...కొనుగోళ్లలో మెతుకుసీమ ఫస్ట్ంటూ కితాబిచ్చేశారు..రైతుల తరఫున వారే సంబరపడ్డారు. ఇంకా జూళ్లు తీయని మక్కలు చేలల్లో ఉండగానే కొనుగోలు కేంద్రాలన్నీ మూసేశారు. ప్రస్తుతం గజ్వేల్ మార్కెట్‌యార్డులోనే కొనుగోళ్లు జరుగుతుండడం..మక్కలు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక కేంద్రాన్ని కూడా 31 తర్వాత మూసివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు మక్కలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. జిల్లా రైతులు పండించిన మక్కలను పూర్తిగా కొనకుండానే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలన్నీ ఎత్తేయడం కేవలం గజ్వేల్‌లోని లావాదేవీలు నడుపుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, చేగుంట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వెల్లువలా వస్తున్నాయి. అయినా శుభ్ర పరిచే మిషన్ల కొరత, కాంటాల కొరత కారణంగా రైతులు కొట్లాటలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి నిల్వలు పేరుకుపోయాయి. మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచామంటూ మార్క్‌ఫెడ్ గొప్పలు చెప్పుకుంటున్న వేళ...గజ్వేల్‌లో రైతులకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఒక్క కేంద్రాన్ని సైతం 31వ తేదీ నాటితో ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 62 సెంటర్లు...అయినా తప్పని అవస్థలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.07 లక్షల హెక్టార్లలో(2.67లక్షల ఎకరాలు) మొక్కజొన్న సాగైంది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. అయినప్పటికీ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట సాగు ఆలస్యం కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల ద్వారా కేవలం 4.99 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మక్కలు చేలల్లోనే ఉన్నప్పటికీ జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఎత్తివేసింది. ‘సాక్షి’ కథనంతో గడువు పొడిగింపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లాగే గజ్వేల్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎత్తివేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 20న గజ్వేల్ కేంద్రాన్ని మూసే వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈనెల 16న ‘చేతులేత్తుసిన మార్క్‌ఫెడ్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారులు గజ్వేల్ కేంద్రాన్ని 10 రోజులు పొడిగించారు. ఇప్పటికే జూళ్లు తీయని మక్కలు చేలల్లోనే ఉన్నాయి. ఉత్తుత్తి ప్రకటనలో ఊదరగొట్టారు కొనుగోళ్లలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టామని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించుకుంటున్న వేళ...గజ్వేల్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లా అంతా కొనుగోలు కేంద్రాలను మూసివేసి గజ్వేల్ సెంటర్‌ను మాత్రమే నడపటం వల్ల మక్కలు వెల్లువలా ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో కొనుగోలుకు నోచుకోకుండా సుమారు 5 వేల క్వింటాళ్లకుపైగా నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కో రైతు వారం రోజులపాటు తిండి తిప్పలు మాని పగలు, రాత్రి నిరీక్షించాల్సి వస్తోంది. సకాలంలో లిఫ్టింగ్ జరగకపోవడం, యార్డు మొత్తమ్మీద రెండు మాత్రమే మక్కలను శుభ్రపరిచే యంత్రాలు ఉండటం, కాంటాలు కూడా తక్కువగా ఉండటం వల్ల కొనుగోళ్లు సాగటం లేదు. శుభ్రపరిచే యంత్రాల కోసం యార్డులో రైతులు కొట్లాటకు దిగుతుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తమ ఉత్పత్తులను అమ్ముకుంటే చాలని ఎంతో ఓపికతో ఉన్న రైతులకు అధికారులు మారో షాక్ ఇచ్చారు. గజ్వేల్ కేంద్రాన్ని కూడా 31తో మూసేస్తామని చెప్పడంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 రోజులు కేంద్రాన్ని నడిపితే తప్ప రైతులకు ఉపశమనం లభించే పరిస్థితి లేదు.