మక్కలు.. కుప్పలు తెప్పలు | farmers concern on gajwel market yard | Sakshi
Sakshi News home page

మక్కలు.. కుప్పలు తెప్పలు

Published Mon, Dec 29 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

farmers concern on gajwel market yard

అంతన్నాడింతన్నాడే లింగరాజ... అన్నట్లుగా ఉంది మార్క్‌ఫెడ్ పరిస్థితి. అట్టహాసంగా 62 కొనుగోలు కేంద్రాలను తెరచిన మార్క్‌ఫెడ్ అధికారులు ఒక్క గింజనూ పక్కకు పోనీయమంటూ గొప్పలు పోయారు...కొనుగోళ్లలో మెతుకుసీమ ఫస్ట్‌ంటూ కితాబిచ్చేశారు..రైతుల తరఫున వారే సంబరపడ్డారు.

ఇంకా జూళ్లు తీయని మక్కలు చేలల్లో ఉండగానే కొనుగోలు కేంద్రాలన్నీ మూసేశారు. ప్రస్తుతం గజ్వేల్ మార్కెట్‌యార్డులోనే కొనుగోళ్లు జరుగుతుండడం..మక్కలు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక కేంద్రాన్ని కూడా 31 తర్వాత మూసివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు మక్కలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. జిల్లా రైతులు పండించిన మక్కలను పూర్తిగా కొనకుండానే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలన్నీ ఎత్తేయడం కేవలం గజ్వేల్‌లోని లావాదేవీలు నడుపుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, చేగుంట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వెల్లువలా వస్తున్నాయి. అయినా శుభ్ర పరిచే మిషన్‌ల కొరత, కాంటాల కొరత కారణంగా రైతులు కొట్లాటలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి నిల్వలు పేరుకుపోయాయి. మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచామంటూ మార్క్‌ఫెడ్ గొప్పలు చెప్పుకుంటున్న వేళ...గజ్వేల్‌లో రైతులకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఒక్క కేంద్రాన్ని సైతం 31వ తేదీ నాటితో ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
62 సెంటర్లు...అయినా తప్పని అవస్థలు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.07 లక్షల హెక్టార్లలో(2.67లక్షల ఎకరాలు) మొక్కజొన్న సాగైంది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. అయినప్పటికీ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు  జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట సాగు ఆలస్యం కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల ద్వారా కేవలం 4.99 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మక్కలు చేలల్లోనే ఉన్నప్పటికీ జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఎత్తివేసింది.  

‘సాక్షి’ కథనంతో గడువు పొడిగింపు
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లాగే గజ్వేల్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎత్తివేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 20న గజ్వేల్ కేంద్రాన్ని మూసే వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈనెల 16న ‘చేతులేత్తుసిన మార్క్‌ఫెడ్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారులు గజ్వేల్ కేంద్రాన్ని 10 రోజులు పొడిగించారు. ఇప్పటికే జూళ్లు తీయని మక్కలు చేలల్లోనే ఉన్నాయి.

ఉత్తుత్తి ప్రకటనలో ఊదరగొట్టారు
కొనుగోళ్లలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టామని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించుకుంటున్న వేళ...గజ్వేల్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లా అంతా కొనుగోలు కేంద్రాలను మూసివేసి గజ్వేల్ సెంటర్‌ను మాత్రమే నడపటం వల్ల  మక్కలు వెల్లువలా ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో కొనుగోలుకు నోచుకోకుండా సుమారు 5 వేల క్వింటాళ్లకుపైగా నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కో రైతు వారం రోజులపాటు తిండి తిప్పలు మాని పగలు, రాత్రి నిరీక్షించాల్సి వస్తోంది.

సకాలంలో లిఫ్టింగ్ జరగకపోవడం, యార్డు మొత్తమ్మీద రెండు మాత్రమే మక్కలను శుభ్రపరిచే యంత్రాలు ఉండటం, కాంటాలు కూడా తక్కువగా ఉండటం వల్ల కొనుగోళ్లు సాగటం లేదు. శుభ్రపరిచే యంత్రాల కోసం యార్డులో రైతులు కొట్లాటకు దిగుతుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తమ ఉత్పత్తులను అమ్ముకుంటే చాలని ఎంతో ఓపికతో ఉన్న  రైతులకు అధికారులు మారో షాక్ ఇచ్చారు. గజ్వేల్ కేంద్రాన్ని కూడా 31తో మూసేస్తామని చెప్పడంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 రోజులు కేంద్రాన్ని నడిపితే తప్ప రైతులకు ఉపశమనం లభించే పరిస్థితి లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement