Gajwel market yard
-
పత్తి ధర పైపైకి.. క్వింటాలుకు రూ.8,421
గజ్వేల్: రాష్ట్రంలో పత్తికి మంచి ధర లభిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.8,421 పలికింది. ఈ–నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ద్వారా 109 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఇందులో గరిష్టంగా రూ.8,421, మోడల్ ధరగా రూ.8,263, కనిష్టంగా రూ.8,200 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు. అతివృష్టి కారణంగా దిగుబడులు పడిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం కొంత ఊరటనిస్తోందని వారు అన్నారు. -
మెరిసిన తెల్ల‘బంగారం’
గజ్వేల్‌లో పత్తి క్వింటాలుకు ధర రూ.5,550 గజ్వేల్: తెల్ల‘బంగారం’ మెరి సింది. ఈ సీజన్ కు సంబం ధించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో సోమ వారం పత్తి క్వింటాలుకు రూ.5,550 పలికింది. ఈ విషయాన్ని స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్ రాహుల్ తెలిపారు. ఈ మార్కెట్ యార్డు పరిధిలో ఇప్పటి వరకు 1.6 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. గజ్వేల్ మార్కెట్ యార్డులో సీజన్ ఆరంభం నుంచే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. తాజాగా రూ.5,550కు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
మక్కలు.. కుప్పలు తెప్పలు
అంతన్నాడింతన్నాడే లింగరాజ... అన్నట్లుగా ఉంది మార్క్‌ఫెడ్ పరిస్థితి. అట్టహాసంగా 62 కొనుగోలు కేంద్రాలను తెరచిన మార్క్‌ఫెడ్ అధికారులు ఒక్క గింజనూ పక్కకు పోనీయమంటూ గొప్పలు పోయారు...కొనుగోళ్లలో మెతుకుసీమ ఫస్ట్ంటూ కితాబిచ్చేశారు..రైతుల తరఫున వారే సంబరపడ్డారు. ఇంకా జూళ్లు తీయని మక్కలు చేలల్లో ఉండగానే కొనుగోలు కేంద్రాలన్నీ మూసేశారు. ప్రస్తుతం గజ్వేల్ మార్కెట్‌యార్డులోనే కొనుగోళ్లు జరుగుతుండడం..మక్కలు కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక కేంద్రాన్ని కూడా 31 తర్వాత మూసివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు మక్కలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. జిల్లా రైతులు పండించిన మక్కలను పూర్తిగా కొనకుండానే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలన్నీ ఎత్తేయడం కేవలం గజ్వేల్‌లోని లావాదేవీలు నడుపుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, చేగుంట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వెల్లువలా వస్తున్నాయి. అయినా శుభ్ర పరిచే మిషన్ల కొరత, కాంటాల కొరత కారణంగా రైతులు కొట్లాటలకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయి నిల్వలు పేరుకుపోయాయి. మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచామంటూ మార్క్‌ఫెడ్ గొప్పలు చెప్పుకుంటున్న వేళ...గజ్వేల్‌లో రైతులకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఒక్క కేంద్రాన్ని సైతం 31వ తేదీ నాటితో ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 62 సెంటర్లు...అయినా తప్పని అవస్థలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.07 లక్షల హెక్టార్లలో(2.67లక్షల ఎకరాలు) మొక్కజొన్న సాగైంది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. అయినప్పటికీ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట సాగు ఆలస్యం కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల ద్వారా కేవలం 4.99 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మక్కలు చేలల్లోనే ఉన్నప్పటికీ జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఎత్తివేసింది. ‘సాక్షి’ కథనంతో గడువు పొడిగింపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లాగే గజ్వేల్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎత్తివేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 20న గజ్వేల్ కేంద్రాన్ని మూసే వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈనెల 16న ‘చేతులేత్తుసిన మార్క్‌ఫెడ్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారులు గజ్వేల్ కేంద్రాన్ని 10 రోజులు పొడిగించారు. ఇప్పటికే జూళ్లు తీయని మక్కలు చేలల్లోనే ఉన్నాయి. ఉత్తుత్తి ప్రకటనలో ఊదరగొట్టారు కొనుగోళ్లలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టామని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించుకుంటున్న వేళ...గజ్వేల్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లా అంతా కొనుగోలు కేంద్రాలను మూసివేసి గజ్వేల్ సెంటర్‌ను మాత్రమే నడపటం వల్ల మక్కలు వెల్లువలా ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో కొనుగోలుకు నోచుకోకుండా సుమారు 5 వేల క్వింటాళ్లకుపైగా నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కో రైతు వారం రోజులపాటు తిండి తిప్పలు మాని పగలు, రాత్రి నిరీక్షించాల్సి వస్తోంది. సకాలంలో లిఫ్టింగ్ జరగకపోవడం, యార్డు మొత్తమ్మీద రెండు మాత్రమే మక్కలను శుభ్రపరిచే యంత్రాలు ఉండటం, కాంటాలు కూడా తక్కువగా ఉండటం వల్ల కొనుగోళ్లు సాగటం లేదు. శుభ్రపరిచే యంత్రాల కోసం యార్డులో రైతులు కొట్లాటకు దిగుతుండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తమ ఉత్పత్తులను అమ్ముకుంటే చాలని ఎంతో ఓపికతో ఉన్న రైతులకు అధికారులు మారో షాక్ ఇచ్చారు. గజ్వేల్ కేంద్రాన్ని కూడా 31తో మూసేస్తామని చెప్పడంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 రోజులు కేంద్రాన్ని నడిపితే తప్ప రైతులకు ఉపశమనం లభించే పరిస్థితి లేదు. -
గజ్వేల్ మార్కెట్‌యార్డుకు మహర్దశ
గజ్వేల్ : సీఎం సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ మార్కెట్ యార్డుకు మహర్దశ పట్టనుంది. దీని అభివృద్ధి కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గోదాం, షెడ్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు గురువారం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా మార్కెట్‌యార్డులో రూ.5కే సద్దిమూట కార్యక్రమం అమలు కానుంది. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్‌లో 19 ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. తూప్రాన్ రోడ్డువైపున సకల హంగులతో యార్డును నిర్మించారు. జిల్లా రైతులే కాకుండా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల రైతులకు కూడా ఈ యార్డు ఆధారమే. ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. కానీ ఈ యార్డులో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ మూడు ఓపెన్ ప్లాట్‌ఫారాలు, మరో మూడు గోదాములు ఉన్నాయి. ఒక గోదామును పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్‌కు అద్దెకు ఇచ్చారు. మరో రెండింటిని సీజనల్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రైతులు తీసుకువచ్చే ఉత్పత్తులను ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి లేదు. ఈ మూడు ఓపెన్ షెడ్లలో మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు నిల్వ చేసుకునే వీలుంది. కానీ ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఉత్పత్తులకు ఇది సరిపోవడం లేదు. రెండేళ్లుగా యార్డులో కొనుగోళ్ల సందర్భంగా నిత్యం వేలాది క్వింటాళ్ల ధాన్యం ఆరుబయటే ఉంచాల్సి రాగా, అకాల వర్షాలు కురిసి భారీ నష్టం చోటుచేసుకుంటోంది. ఈ క్రమంలోనే యార్డు ఆదాయం నుంచి ఇటీవలే రూ.1.25 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణం పనులను ప్రారంభించగా..అవి ప్రగతి పథంలో సాగుతున్నాయి. అదేవిధంగా మరో రూ.67 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయినా రైతుల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం యార్డు అభివృద్ధికి మరో రూ.4 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులలోని రూ. 1.30 కోట్లతో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము, రూ.1.20 కోట్లతో కవర్‌షెడ్ల నిర్మాణం, రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.60 లక్షల వ్యయంతో రైతుల విశ్రాంతి భవనం, సమావేశ మందిరం, రూ.10 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణం జరుగనున్నది. ‘సద్దిమూట’కు శ్రీకారం... యార్డుకు ఉత్పత్తులను అమ్ముకోవడానికి వచ్చే రైతులకు రూ.5లకే ‘సద్దిమూట’ పథకం కింద హరేరామ ఫౌండేషన్ సంస్థలు భోజనాన్ని అందించనున్నాయి. అభివృద్ధి పనులతోపాటు ‘సద్దిమూట’ పథకాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు. -
అన్నదాతకు అన్యాయం
గజ్వేల్, న్యూస్‌లైన్: అధికారులు..పాలకులు అందరూ కలిసి అన్నదాతకు తీవ్ర అన్యాయం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినట్టే ఇచ్చి ఇపుడు అడ్డగోలు ధర కట్టారు. ఫలితంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ విధిలేని పరిస్థితుల్లో అధికారులు చెప్పిన రేటుకు ప్రైవేటు వ్యాపారులకు పంటను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. రెండురోజూ కొనసాగిన ఆందోళన గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కల రైతుల ఆందోళన శనివారం కూడా కొనసాగింది. 45 రోజుల కిందట రైతుల నుంచి మక్కల కొనుగోలు చేసి తక్‌పట్టీ(రసీదు)లు ఇచ్చిన తర్వాత అధికారులు తరలింపును సాకుగా చూపి చెక్కులివ్వలేమని మాట మార్చిన నేపథ్యంలో రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టిన సంగతి తెల్సిందే. సమస్య పరిష్కారం కోసం శనివారం కూడా యార్డుకు తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. దీంతో యార్డు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. యార్డుగేటు ఎదుట మక్కల రైతుల ఆందోళన నేపథ్యంలో శనివారం యార్డుకు పత్తిని తీసుకువచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిన మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టిలు ఈ సమస్యను సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీఓ ముత్యంరెడ్డి పత్తిరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శనివారం ఒక్కరోజు పత్తికోనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ అధికారులు ఈ విషయాన్నే మక్క రైతలకు వివరించారు. మక్క రైతుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ యార్డులో కొనుగోళ్లు నిలిపివేస్తామనీ, అయితే పత్తిరైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత యార్డులోని 14 వేల క్వింటాళ్ల మక్కల వ్యవహారంపై సాయంత్రం వరకు స్థానిక తహశీల్దార్ బాల్‌రెడ్డి, సీఐ అమృతరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్‌లు రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. నిల్వలను వ్యాపారులు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు సూచించగా వారు అందుకు అంగీకరించారు. అయితే రైతులకు ఐకేపీ కేంద్ర నిర్వాహకులు తక్‌పట్టీల్లో క్వింటాలుకు రూ.1,310 రాసివ్వగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏ గ్రేడ్ రకం మక్కలకు రూ.1,130, సాధారణ రకానికి రూ.975 ధర చెల్లించి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అంగీకరించారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు కూడా ఒప్పుకోవడంతో వ్యాపారులు తరలింపును ప్రారంభించారు. మారిన ధరతో రైతులు రూ.50 లక్షలకుపైగానే నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలావుంటే మక్కల తరలింపు పూర్తయ్యేవరకు యార్డులో లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించారు. పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్ సూచించారు. -
‘బీట్’ లేనట్లే!
గజ్వేల్, న్యూస్‌లైన్: మూడు జిల్లాల రైతులకు గజ్వేల్ మార్కెట్ యార్డే ప్రధాన ఆధారం. వారు పండించిన పంటలన్నీ ఈ యార్డుకే తరలించి విక్రయించుకుంటారు. కానీ యార్డు లో ‘బీట్’ విధానం అమల్లోకి తేవడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం కరువై వారు చెప్పిన ధరకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. మరోపక్క ట్రే డ్ లెసైన్స్‌లు లేని దళారులు కల్లాల వద్దే కాంటాలు నిర్వహిస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు. అంతిమంగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారుల అలసత్వం..దళారులకు వరం జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాకుండా వరంగల్, నల్గొండ జిల్లాల రైతులకు ప్రధాన మార్కెట్ గజ్వేల్ యార్డు. అందువల్లే ఇక్కడ వ్యాపారుల మాయాజాలానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రెండేళ్లక్రితం నుంచి ‘బీట్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొనుగోలుదారుల మధ్య పోటీతత్వం పెంచితే రైతులకు గిట్టుబాటు ధర అందించవచ్చనే భావనతో ఈ విధా నం తెచ్చారు. ఈసారి సీజన్ పూర్తి కావస్తున్నా.... అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కించడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘బీట్’ లేక పోవడంవల్ల వ్యాపారులు నిర్ణయించిన ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకొని వెళ్తున్నారు. అంతేకాకుండా పత్తికి వంద కిలోల సంచిపై తరుగు పేరిట ఇష్టానుసారంగా కోత పెడుతుండగా నియంత్రించే వారు కరువయ్యారు. కల్లాల వద్ద కాంటాలతో మోసాలు గ్రామాల్లో ట్రేడింగ్ లెసైన్స్‌లేని దళారుల మోసాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్లాల వద్ద కాంటాలను నిర్వహిస్తున్న దళారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లను జరుపుతున్నా మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేక పోవడంవల్ల వారు మరింత చెలరేగిపోతున్నారు. కొందరైతే తూకపు బాట్ల స్థానంలో బండరాళ్లను ఉంచి నిలువునా దోచుకుంటున్నారు. -
రోడ్డెక్కిన రైతన్న
గజ్వేల్, న్యూస్‌లైన్: హామీ ఇచ్చిన అధికారులు మాటతప్పారు. కడుపుమండిన రైతన్న ఆందోళన బాటపట్టాడు. దీంతో గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కల రైతుల ఆందోళనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈనెల 6న చేపట్టిన ఆందోళన సందర్భంగా రైతులకు బకాయిగా ఉన్న మొత్తాన్ని అయిదు రోజుల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికారులు తీరా మాటమార్చారు. మక్కలు తరలించనందున చెక్కులు ఇవ్వలేమన్నారు. దీంతో కడుపు మండిన రైతులంతా శుక్రవారం మరోసారి ఆందోళన బాట పట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాస్తారోకోతో మొదలైన నిరసన. యార్డు గేటుకు తాళం వేసే దారి తీసింది. ఫలితంగా గంటల తరబడి లావాదేవీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డిలు ఇక్కడికి చేరుకుని వ్యాపారులు, రైతులతో గంటల తరబడి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో రైతులు శుక్రవారం రాత్రి యార్డులోనే వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో స్థానిక సీఐ అమృతరెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. పెండింగ్‌లో రూ.1.83 కోట్లకుపైగా చెల్లింపులు గజ్వేల్ మార్కెట్‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని అక్టోబర్ నెలలో అధికారులు ప్రారంభించారు. జనవరి 15వ తేదీ వరకు మొత్తం 34 వేల క్వింటాళ్ల మక్కలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 15 వేల కింటాళ్ల మక్కలను అధికారులు తరలించారు. మిగిలిన 14 వేల పైచిలుకు క్వింటాళ్ల స్టాకు ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో ఉంది. ఈ మక్కల తరలింపునకు నోచుకోకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లలో ఈనెల 5 వరకు రూ.1.50 కోట్లు మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. సుమారు రూ.1.83 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ నిల్వ ఉంచిన మక్కలను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాముల్లోకి తరలిస్తేనే చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. మరోపక్క గడువు ముగిసిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లను నిలిపివేయడంతో వేలాది క్వింటాళ్ల మక్కలు యార్డులోనే ఉండిపోయాయి. దీంతో విసిగిపోయిన రైతులు ఈనెల 3నయార్డు గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో తిరిగి 6వ తేదీన యార్డు గేటుకు మరోసారి తాళం వేసి ధర్నా చేపట్టారు. దీంతో అధికారులు పెండింగ్‌లో ఉన్న చెక్కులను అయిదు రోజుల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మాటమార్చిన అధికారులు..ఆందోళనకు దిగిన రైతులు కొనుగోలు చేసిన మక్కలను ఇక్కడి నుంచి తరలించలేని పరిస్థితి ఉన్నందున పెండింగ్‌లో ఉన్న రూ.1.83 కోట్ల చెక్కులను ఇవ్వలేమని శుక్రవారం ఐకేపీ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తొలుత యార్డు సమీపంలోని గజ్వేల్-తూప్రాన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళనకు టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత రైతులు యార్డు గేటుకు తాళం వేసి లావాదేవీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి సైతం ఇక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఐకేపీ కేంద్రం ద్వారా కొనుగోలు చేసి వాసస్ చేసిన సరుకుకు ప్రైవేటు వ్యాపారులతో కొనుగోలు చేయించి రూ.975 నుంచి రూ.1,130 వరకు ధర దక్కేలా చూస్తామని చెప్పినా రైతులు వినిపించుకోలేదు. కొనుగోలు చేసి వాపస్ చేయడమే కాకుండా, అడ్డికి పావుసేరు కాడికి అమ్ముతారా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో వంటావార్పు చేపట్టారు. ఆందోళన కార్యక్రమం శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానిక సీఐ అమృతరెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. -
ఆద్యంతం.. వైఫల్యం
దుకాణంలో సరుకులు కొన్నాక ఇంటికి తీసుకెళ్లి..ఓ వారం గడిచాక కందిపప్పు బాగోలేదు. చింతపండులో రాళ్లున్నాయంటూ వెనక్కు తీసుకువెళ్తే దుకాణం యజమాని డబ్బు వాపస్ ఇస్తాడా... ఇవ్వడు గాక ఇవ్వడు. కొనే సమయంలోనే సరుకు నాణ్యత చూసుకోవాలంటాడు...కానీ మన అధికారులు మాత్రం రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిన పక్షం రోజుల తర్వాత సరుకు నాణ్యత లోపించిందంటూ చెల్లింపులను నిలిపివేశారు. ఇదెక్కడి అన్యాయమంటారా..రైతులూ అదే అంటున్నారు. బాబ్బాబు మా సొమ్ములిప్పించండంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారికి పైసలు మాత్రం అందడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొన్న 72 గంటల్లో పైసలిస్తామన్న కలెక్టరమ్మ మాత్రం ఆ ఊసే మరిచిపోయింది. దీంతో జిల్లాలో వందల మంది రైతులు పంటలమ్మినా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో మక్కల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఆద్యంతం తన వైఫల్యాన్ని చాటుకుంది. దిగుబడులు రాకముందే ఈ 7న కొనుగోలు కేంద్రాలను మూసేసి షాక్చ్చిన అధికారులు, అడపాదడపా చేపట్టిన కొనుగోళ్ల సంబంధించిన పైసలివ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. గోదాముల కొరతను సా కుగా చూపుతూ కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల మక్కలను తరలించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నిల్వలు మా ర్కెట్ యార్డుల నుంచి తరలిస్తేనే రైతులకు చెక్కులు వచ్చే అవకాశం ఉండడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఇంతకంటే దారుణమైన విషయమేమిటంటే మక్కలు కొనుగోలు చేసిన పక్షం రో జుల తర్వాత ‘నాణ్యత’ లేదంటూ వాపస్ పంపుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం ఇదే ఘటనపై గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులకు, ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రాలు తెరచి..కొనుగోళ్లు నిలిపి ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. పంటలు కూడా బాగా ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ నవంబర్ మూడోవారంలో తుఫాన్ రావడం, ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు వ ర్షాలు కురవడంతో మక్క పంటకు అపార నష్టం వాటిల్లింది. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా సుమారు 60 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న పండింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాలను తెరిచింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.900 నుంచి 1,000 మించి ధర చెల్లించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాలకే తరలించాలని తాపత్రయపడినా... కొనుగోళ్లలో నెలకొన్న ఇబ్బందుల వల్ల జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగా యి. ఇప్పటికీ మార్కెట్ యార్డులకు ఇబ్బడిముబ్బడిగా మక్కలు తరలివస్తున్నాయి. అయినా కొనేవారు లేరు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిజానికి రైతులు పండించినపంటలో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసింది 10 శాతం కూడా మించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కొనుగోలు కేంద్రాలను కూడా అధికారుల తొలుత డిసెంబర్ 15న మూసేయాలని, రెండోసారి 31న మూసేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ డిసెంబర్ 20న ‘మక్క రైతుకు మరో షాక్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెల్సిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ కేంద్రాలను జనవరి 7 వరకు కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా రైతుల ఇబ్బందులు తీరలేదు. రూ. 24 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్ జిల్లాలో ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5 లక్షల క్వింటాళ్లకుపైగా మక్కలను కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి రూ.68 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు రూ.44 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిపారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం(మార్కెటింగ్) శ్రీదేవీ ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. జిల్లాలో ఆయా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల సరుకు గోదాముల కొరత కారణంగా కొనుగోలు కేం ద్రాల్లో పేరుకుపోయింది. తరలింపులో చోటుచేసుకుంటున్న జాప్యం వల్ల చెక్కుల పంపిణీకి అవరోధమేర్పడుతోంది. నిజానికి ఐకేపీ కేంద్రాల నుంచి మక్కలు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాములకు వెళ్లి అక్నాలెడ్జిమెంట్ ముట్టిన తర్వాత ఐకేపీ అధికారులు చెక్కులు తయారు చేసి పంపుతున్నారు. కానీ మక్కలు కొనుగోలు కేంద్రాలనే దాటకపోవడంతో, చెక్కులు పంపిణీలో జాప్యానికి కారణమవుతోందని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. గజ్వేల్‌లో ఐకేపీ కేంద్ర నిర్వాహకుల నిలదీత చెక్కుల పంపిణీలో చోటుచేసుకుంటున్న జాప్యంపై శనివారం రైతులు ఐకేపీ కేంద్ర నిర్వాహకురాలు కల్పనతో వాగ్వాదానికి దిగారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇక్కడ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పంపిన ఉత్పత్తులు నాణ్యత లేవని సుమారు 5 లోడ్లకుపైగా వాపస్ వచ్చాయని, దానివల్ల కూడా చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతున్నదని ఆమె రైతులతో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కేంద్రంలో సుమారు 15 వేల క్వింటాళ్లకుపైగా మక్కల తరలింపులో జాప్యం నెలకొనడం మరో కారణమని వివరించే ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎన్నో రోజుల కిందట ఇక్కడి నుంచి పంపిన మక్కల నాణ్యతను ఇప్పడు పరిశీలిస్తారా? అంటూ ప్రశ్నించారు. నాణ్యతను కొనుగోలు చేసే సమయంలోనే చూసుకోకుండా ఇప్పుడు నాణ్యత పేరుతో ఇబ్బందిపెడితే సహించబోమన్నారు. తరలింపుతో తమకేం సంబంధం లేదన్నారు. వెంటనే డబ్బు చెల్లించాలంటూ పట్టుబట్టారు. రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు సాయంత్రానికి కొంతమందికి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. -
మాయాజాలం
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలంపై ఆగ్రహం వెల్లువెత్తింది. సిండికేట్‌గా మారి పత్తి క్వింటాలు ధరను అమాంతం రూ.400 తగ్గించడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వ్యాపారులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో నాలుగు గంటల పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. చివరకు మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జిల్లాలో పత్తి పండిస్తున్న రైతులతో పాటు పొరుగునే ఉన్న వరంగల్, నల్లగొండ జిల్లాల పత్తి రైతులకు కూడా గజ్వేల్ మార్కెట్ యార్డు ప్రధాన ఆధారం. కాస్తాకూస్తో గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో రైతులు వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొస్తారు. కానీ మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం పత్తిరైతులను చిత్తుచోస్తోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో వ్యాపారులంతా ఏకమై ఉన్నట్టుండి పత్తి ధరను అమాంతం తగ్గించేస్తుండడంతో రైతులు నిలువునా మోసపోతున్నాడు. శనివారం కూడా యార్డులో పత్తి ధరను వ్యాపారులు అనూహ్యంగా తగ్గించేశారు. శుక్రవారం క్వింటాలు పత్తి రూ.5 వేలు పలకడంతో వివిధ ప్రాంతాల్లోని రైతులు ఎంతో అశతో తమ పత్తిని ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌కు వచ్చిన పత్తిని చూసిన వ్యాపారులంతా శనివారం ఏకంగా క్వింటాలు పత్తి ధరను రూ.3,600గా నిర్ణయించారు. ఇంతకంటే తాము చెల్లించలేమని తెగేసి చెప్పేశారు. దీంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజులోనే ధరల్లో ఎందుకు తేడా వస్తుందో తెలపాలంటూ వ్యాపారులను నిలదీశారు. అయితే వ్యాపారులు మాత్రం ఇతర ప్రాంతాల్లోనూ పత్తికి ఇదే ధర ఉందనీ, తాము ఎక్కువ ధరకు పత్తిని కొంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వ్యాపారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని భావించిన రైతులు తమ ఆందోళన కొనసాగించారు. ఓ దశలో కడుపుమండిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మార్కెట్‌యార్డులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ లావాదేవీలు నిలిచిపోయాయి. మార్కెట్ కమిటీకి చెందిన అధికారులు రంగ ప్రవేశం చేసి రైతులు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. సమాచారం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జి. ప్రతాప్‌రెడ్డి యార్డుకు చేరుకుని వ్యాపారులు, రైతు ప్రతినిధులతో సుమారు 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు. నాణ్యత కలిగిన పత్తిని రూ. 4,900 పైచిలుకు, సాధారణంగా ఉన్న పత్తికి రూ.3,700లు ఆపైన ధర చెల్లించాలని నిర్ణయించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత లావాదేవీలను యథావిధిగా కొనసాగాయి. సేట్లు కుమ్మక్కయిండ్రు నిన్న క్వింటాలు పత్తికి రూ. 5 వేల వరక ు ధర పలికిం దని తెలిసి నేను పొద్దున 9 గంటలకు 10 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చిన. ఇక్కడికొచ్చి సూస్తే సేట్లు కుమ్మక్కయ్యిండ్రు. క్వింటాలుకు రూ. 400 తక్కువ ఇస్తమన్నారు. అందుకనే ఆందోళన చేసినం. -సుంచు క్రిష్ణ (పత్తి రైతు, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్ వుండలం) -
అదో దళారీ సంస్థ
గజ్వేల్, న్యూస్‌లైన్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. దళారిపాత్ర పోషిస్తున్న సంస్థగా సీసీఐని ఆయన పేర్కొన్నారు. రైతులు నానా ఇబ్బందులు పడి తమ పంటలను విక్రయించుకున్నాక సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే లాభమేమిటని ప్రశ్నించారు. బుధవారం గజ్వేల్‌లోని మార్కెట్ యార్డును సందర్శించిన నారాయణ, పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న పలువురు పత్తిరైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీసీఐ తీరుపై ధ్వజమెత్తారు. రైతుకు అండగా నిలవాల్సిన ఈ సంస్థ రైతులకు, వ్యాపారులకు మధ్య దళారీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పూర్తిగా తమ ఉత్పత్తులను తెగనమ్ముకున్నాక.... ఆలస్యంగా రంగం ప్రవేశం చేయడం ఆ సంస్థకు పరిపాటిగా మారిందన్నారు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసివ స్తోందన్నారు. ఈపాటికి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతుకు లాభం జరగడమే కాకుండా వ్యాపారులకు భయం ఉండేదన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో, వారంతా తమ పత్తిని వెంటనే వ్యాపారులకు అమ్ముకుని వెళ్తున్నారన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోపక్క రైతులు అమ్ముకునే ఉత్పత్తుల్లో నుంచి రెండుశాతం కోత పెడుతూ డబ్బులు చెల్లిస్తున్నారని, ఆ రెండుశాతం కోత ఎందుకని ప్రశ్నించారు. రైతులను దోచుకునే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సీసీఐ ఇప్పటికైనా నిబంధనలు సడలించుకుని ప్రైవేట్ వ్యాపారులతో పోటీగా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ, ప్రకాశ్, జిల్లా నాయకులు మంద పవన్, రహ్మాన్, కోట కిశోర్, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కస్తుర్భా పాఠశాల సందర్శన గజ్వేల్‌లోని కస్తుర్భాగాంధీ విద్యాలయను సీపీఐ రాష్ట్ర నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలు, భోజనం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదన్నారు.