ఆద్యంతం.. వైఫల్యం | the closure of purchase centers when before yields not came | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. వైఫల్యం

Published Sun, Jan 19 2014 1:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

the closure of  purchase centers  when before  yields not came

దుకాణంలో సరుకులు కొన్నాక ఇంటికి తీసుకెళ్లి..ఓ వారం గడిచాక కందిపప్పు బాగోలేదు. చింతపండులో రాళ్లున్నాయంటూ వెనక్కు తీసుకువెళ్తే దుకాణం యజమాని డబ్బు వాపస్ ఇస్తాడా... ఇవ్వడు గాక ఇవ్వడు. కొనే సమయంలోనే సరుకు నాణ్యత చూసుకోవాలంటాడు...కానీ మన అధికారులు మాత్రం రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిన  పక్షం రోజుల తర్వాత సరుకు నాణ్యత లోపించిందంటూ చెల్లింపులను నిలిపివేశారు.

 ఇదెక్కడి అన్యాయమంటారా..రైతులూ అదే అంటున్నారు. బాబ్బాబు మా సొమ్ములిప్పించండంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారికి పైసలు మాత్రం అందడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొన్న 72 గంటల్లో పైసలిస్తామన్న కలెక్టరమ్మ మాత్రం ఆ ఊసే మరిచిపోయింది. దీంతో జిల్లాలో వందల మంది రైతులు పంటలమ్మినా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో మక్కల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఆద్యంతం తన వైఫల్యాన్ని చాటుకుంది. దిగుబడులు రాకముందే ఈ 7న  కొనుగోలు కేంద్రాలను మూసేసి షాక్‌చ్చిన అధికారులు, అడపాదడపా చేపట్టిన కొనుగోళ్ల సంబంధించిన పైసలివ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. గోదాముల కొరతను సా కుగా చూపుతూ కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల మక్కలను తరలించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

 ఈ నిల్వలు మా ర్కెట్ యార్డుల నుంచి తరలిస్తేనే రైతులకు చెక్కులు వచ్చే అవకాశం ఉండడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఇంతకంటే దారుణమైన విషయమేమిటంటే మక్కలు కొనుగోలు చేసిన పక్షం రో జుల తర్వాత ‘నాణ్యత’ లేదంటూ వాపస్ పంపుతున్నారు.  దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం ఇదే ఘటనపై గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులకు, ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 కేంద్రాలు తెరచి..కొనుగోళ్లు నిలిపి
 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. పంటలు కూడా బాగా ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు.  కానీ నవంబర్  మూడోవారంలో తుఫాన్ రావడం, ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు వ ర్షాలు కురవడంతో మక్క పంటకు అపార నష్టం వాటిల్లింది. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా సుమారు 60 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న పండింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాలను తెరిచింది.

ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.900 నుంచి 1,000 మించి ధర చెల్లించడంలేదు.  ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాలకే తరలించాలని తాపత్రయపడినా... కొనుగోళ్లలో నెలకొన్న  ఇబ్బందుల వల్ల జిల్లావ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగా యి. ఇప్పటికీ మార్కెట్ యార్డులకు ఇబ్బడిముబ్బడిగా మక్కలు తరలివస్తున్నాయి. అయినా కొనేవారు లేరు.

 దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిజానికి రైతులు పండించినపంటలో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసింది 10 శాతం కూడా మించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కొనుగోలు కేంద్రాలను కూడా అధికారుల తొలుత డిసెంబర్ 15న మూసేయాలని, రెండోసారి 31న మూసేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ డిసెంబర్ 20న ‘మక్క రైతుకు మరో షాక్’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెల్సిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ కేంద్రాలను జనవరి 7 వరకు కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా రైతుల ఇబ్బందులు తీరలేదు.

 రూ. 24 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్
 జిల్లాలో ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5 లక్షల క్వింటాళ్లకుపైగా మక్కలను కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి రూ.68 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు రూ.44 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిపారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం(మార్కెటింగ్) శ్రీదేవీ ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. జిల్లాలో ఆయా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల సరుకు గోదాముల కొరత కారణంగా కొనుగోలు కేం ద్రాల్లో పేరుకుపోయింది.

 తరలింపులో చోటుచేసుకుంటున్న జాప్యం వల్ల చెక్కుల పంపిణీకి అవరోధమేర్పడుతోంది. నిజానికి ఐకేపీ కేంద్రాల నుంచి మక్కలు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాములకు వెళ్లి అక్నాలెడ్జిమెంట్ ముట్టిన తర్వాత ఐకేపీ అధికారులు చెక్కులు తయారు చేసి పంపుతున్నారు. కానీ మక్కలు కొనుగోలు కేంద్రాలనే దాటకపోవడంతో,  చెక్కులు పంపిణీలో జాప్యానికి కారణమవుతోందని ఐకేపీ అధికారులు చెబుతున్నారు.

 గజ్వేల్‌లో ఐకేపీ కేంద్ర నిర్వాహకుల నిలదీత
 చెక్కుల పంపిణీలో చోటుచేసుకుంటున్న జాప్యంపై శనివారం రైతులు ఐకేపీ కేంద్ర నిర్వాహకురాలు కల్పనతో వాగ్వాదానికి దిగారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇక్కడ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పంపిన ఉత్పత్తులు నాణ్యత లేవని సుమారు 5 లోడ్లకుపైగా వాపస్ వచ్చాయని, దానివల్ల కూడా చెక్కుల పంపిణీలో జాప్యం జరుగుతున్నదని ఆమె రైతులతో చెప్పే ప్రయత్నం చేశారు.

అంతేకాకుండా కేంద్రంలో సుమారు 15 వేల క్వింటాళ్లకుపైగా మక్కల తరలింపులో జాప్యం నెలకొనడం మరో కారణమని వివరించే ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎన్నో రోజుల కిందట ఇక్కడి నుంచి పంపిన మక్కల నాణ్యతను ఇప్పడు పరిశీలిస్తారా? అంటూ ప్రశ్నించారు. నాణ్యతను కొనుగోలు చేసే సమయంలోనే  చూసుకోకుండా ఇప్పుడు నాణ్యత పేరుతో ఇబ్బందిపెడితే సహించబోమన్నారు. తరలింపుతో తమకేం సంబంధం లేదన్నారు. వెంటనే డబ్బు చెల్లించాలంటూ పట్టుబట్టారు. రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు సాయంత్రానికి కొంతమందికి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement