గజ్వేల్, న్యూస్‌లైన్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. దళారిపాత్ర పోషిస్తున్న సంస్థగా సీసీఐని ఆయన పేర్కొన్నారు. రైతులు నానా ఇబ్బందులు పడి తమ పంటలను విక్రయించుకున్నాక సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే లాభమేమిటని ప్రశ్నించారు. బుధవారం గజ్వేల్‌లోని మార్కెట్ యార్డును సందర్శించిన నారాయణ, పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న పలువురు పత్తిరైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీసీఐ తీరుపై ధ్వజమెత్తారు. రైతుకు అండగా నిలవాల్సిన ఈ సంస్థ రైతులకు, వ్యాపారులకు మధ్య దళారీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పూర్తిగా తమ ఉత్పత్తులను తెగనమ్ముకున్నాక.... ఆలస్యంగా రంగం ప్రవేశం చేయడం ఆ సంస్థకు పరిపాటిగా మారిందన్నారు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసివ స్తోందన్నారు. ఈపాటికి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతుకు లాభం జరగడమే కాకుండా వ్యాపారులకు భయం ఉండేదన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో, వారంతా తమ పత్తిని వెంటనే వ్యాపారులకు అమ్ముకుని వెళ్తున్నారన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోపక్క రైతులు అమ్ముకునే ఉత్పత్తుల్లో నుంచి రెండుశాతం కోత పెడుతూ డబ్బులు చెల్లిస్తున్నారని, ఆ రెండుశాతం కోత ఎందుకని ప్రశ్నించారు. రైతులను దోచుకునే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సీసీఐ ఇప్పటికైనా నిబంధనలు సడలించుకుని ప్రైవేట్ వ్యాపారులతో పోటీగా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ, ప్రకాశ్, జిల్లా నాయకులు మంద పవన్, రహ్మాన్, కోట కిశోర్, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కస్తుర్భా పాఠశాల సందర్శన
గజ్వేల్‌లోని కస్తుర్భాగాంధీ విద్యాలయను సీపీఐ రాష్ట్ర నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలు, భోజనం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదన్నారు.